జూబ్లీహాలులో స్వల్ప అగ్నిప్రమాదం
ఎసీలలో అంతరాయం వల్లేనంటున్న అధికారులు..
జాగ్రత్తలు తీసుకుంటాం.. : చక్రపాణి
స్వల్ప ఘటన : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 1 :
ఆదివారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్ సిఎల్‌పి భేటీ అనంతరం తాజ్‌కృష్ణాకు బయల్దేరి వెళ్లిన కొద్దిసేపటికి జూబ్లీహాల్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. హాలంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ హఠాత్ సంఘటనతో అక్కడ ఉన్న పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది బయటకు పరుగులుదీశారు. రంగంలోకి దిగిన మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పాయి. కొద్దిసేపటికి పరిస్థితి చక్కబడింది. తివాచీలు, ఫర్నీచర్ దగ్ధమైనట్టు తెలిసింది. ఈ సమాచారం అందగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విచారణకు ఆదేశాలిచ్చారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వెంటనే ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని జిఎడి రాజకీయ కార్యదర్శిని కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు.
జూబ్లీహాల్‌లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహాలులో జరిగిన ప్రమాదం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూబ్లీహాలు అపురూప కట్టడం కావడంతో గట్టిగా మరమ్మతులు చేపట్టలేకపోతున్నామన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో సంప్రదించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఏసిలు ఎక్కువగా వాడడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని కొందరు అధికారులు, సిబ్బంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. అప్పటికే సిఎల్‌పి భేటీ ముగియడం.. ప్రణబ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పారు.
ఊహించని ప్రమాదం : శ్రీధర్‌బాబు
జూబ్లిహాల్‌లో జరిగిన ప్రమాదం అనుకోకుండా జరిగిందనని ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. స్వల్పంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందని, ఇది చాలా స్వల్పమైన విషయమని, దీన్ని సాధారణ విషయంగానే పరిగణించాలని కోరారు. మన ఇళ్లల్లోను ఇలాంటి జరుగుతుండడం మామూలేకదా అన్నారు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎసిల్లో ఏర్పడిన స్వల్ప అంతరాయం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు.