ఎందుకో కాంగ్రెస్‌ను నమ్మబుద్ధి కావట్లేదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు త్వరలో పరిష్కారం చూపుమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించినా, తెలంగాణ ఇస్తే తలెత్తే పరిణామాలు, కాంగ్రెస్ పార్టీకి కలిగే లాభనష్టాలు, సమైక్యాంధ్రను కొనసాగిస్తే పార్టీ పరిస్థితి, ఇతరత్రా అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేసి సమర్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించాడు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి రెండు రోజుల పాటు పర్యటించి, అందుకు సంబంధించిన నివేదిక, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, తెలంగాణ అంశంపై సమగ్రమైన నోట్‌ను ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి అందజేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై దిగ్విజయ్ సమగ్రమైన నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై తేల్చకుండా ఇంకా సాగదీస్తే 2014 ఎన్నికల్లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో సమైక్యాంధ్ర పేరుతో కొందరు నేతలు సృష్టిస్తున్న అలజడి, అసలు సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉన్న మద్దతు ఇతరత్రా వివరాలను నివేదికలో పొందు పరిచినట్లు ఏఐసీసీ వర్గాలే మీడియాకు లీకులిచ్చాయి. తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతున్నట్లు హడావుడి చేయడం తర్వాత ఉసూరు మనిపించడం పరిపాటే. ఇప్పుడు దిగ్విజయ్ మార్క్ కదలిక కూడా అంతేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ పేరుతో హడావిడి చేస్తుందని ఇక్కడి ప్రజలు అనుమానిస్తున్నారు. దిగ్విజయ్ సంప్రదింపులు కూడా ఈ దిశలోనే సాగాయి. తెలంగాణ ఇస్తే పార్టీకి లాభమా? నష్టమా? తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ పరిస్థితి ఏమిటీ? కాంగ్రెస్‌తో కలిసివస్తుందా? క్రెడిట్ తనదేనని కాలర్ ఎగరేస్తుందా? తెలంగాణ ఇచ్చాక ఇక్కడి 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశముంది? ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ స్థితిగతులేంటి? తదితర అంశాలపై తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకులతో విడివిడిగా సమావేశమై చర్చించారు. వారు ఇచ్చిన వినతిపత్రాలు, నివేదికలు తీసుకొని వాటిని అధిష్టానం ముందుచ్చాడు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వివరించారు. 2014 ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ 50 ఎంపీ సీట్లు గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దిగ్విజయ్ బెంగళూర్‌లో ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుండగా వాటిలో కేరళ మినహా మిగతా మూడు పెద్ద రాష్ట్రాలే. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ తెలంగాణ సమస్యతో పాటు సీమాంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యే ఉంటుంది. కేరళలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు కాస్త ఆశలున్నవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకపైనే. ఈ రెండు రాష్ట్రాల్లోనే 40కి పైగా ఎంపీ సీట్లు సాధించాలంటే తెలంగాణ సమస్యకు ఏదో ఒక ముగింపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించినట్టుగా తెలుస్తోంది. అయినా కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే తెలంగాణపై కాంగ్రెస్‌కు ఆడి తప్పడం కొత్తకాదు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 1969లో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని తుపాకీ గొట్టం ద్వారా అణచివేయాలని చూసింది ఇందిరాగాంధీ. 1971లో అఖండ విజయం సాధించిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్)ను విలీనం చేసుకొని తెలంగాణపై ఎవరూ గొంతెత్తకుండా నివారించగలిగానని అనుకుంది. కాంగ్రెస్ ఎంతటి అణచివేత ధోరణి ప్రదర్శించినా తెలంగాణ ఉద్యమం నివురు గప్పిన నిప్పులా ఉందేకన్నా ఏ రోజూ చల్లబడలేదు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉన్నారు. 2009లో తెలంగాణ సాధన కోసం ఉద్యమం తీవ్రస్థాయిలో సాగింది. పది జిల్లాల ప్రజలు స్వరాష్ట్రం కావాలంటూ అన్ని పనులు వీడి రోడ్లపైకి వచ్చారు. రాస్తాలు, రైలు పట్టాలు, విద్యాలయాలు ఉద్యమ వేదికలయ్యాయి. మొత్తం తెలంగాణ కదిలిరావడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసింది. సీమాంధ్ర పెత్తందారులు సృష్టించిన కృత్రిమ ఉద్యమానికి వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ మాట తప్పడంతో వెయ్యి మందికి పైగా తెలంగాణ విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అయినా స్పందించని కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం తెలంగాణ జపం చేస్తుంది. కాంగ్రెస్‌ను అందుకే ప్రజలు విశ్వసించడం లేదు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్మబోరు.