రాయల తెలంగాణ ఎవరడిగారు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1973లో ఉద్యమం జరిగింది. అది తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నర్సింహారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించడానికి మాత్రమేనని తర్వాతికాలంలో స్పష్టమైంది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు అడిగినట్టుగా దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం కోరుతూ సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజలు వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీలు తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేయడమే తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. 1969లో తరస్థాయిలో సాగిన తెలంగాణ ఉద్యమం తర్వాతికాలంలో నివురుకప్పిన నిప్పులా ఉంది. ఈక్రమంలో రాజ్యం తెలంగాణ ఉద్యమకారులను వివిధ పేర్లతో హత్య చేసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు. కానీ తెలంగాణ ఆకాంక్షను మాత్రం తుడిచివేయలేకపోయారు. కనీసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వెనుక ఉన్న కారణాలను కూడా సమీక్షించకుండా తెలంగాణ ప్రాంతంపై మరింత వివక్ష కొనసాగించారు. ఐదున్నర దశాబ్దాలకుపై బడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రులు కేవలం ఏడేళ్ల పాటే అధికారంలో ఉన్నారు. ఖమ్మం జిల్లావాణ్ని అని చెప్పుకునే జళగం వెంగల్రావు శ్రీకాకుళం జిల్లా వాడిగానే అధికారాన్ని చెలాయించాడనే ఆరోపణలున్నాయి. ఆయన్నూ తెలంగాణ సీఎంగా లెక్కకట్టుకున్నా మొత్తంగా 13 ఏళ్లు ఇక్కడి ముఖ్యమంత్రులు పదవిలో ఉన్నారు. వారిని దించేందుకు సీమాంధ్ర నేతలు ఎన్నో కుట్రలు పన్నారు. తెలుగు భాష పేరుతో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చింది. తెలంగాణ భాష, యాస ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంది. తెలంగాణలోని అపారమైన వనరులు, నీళ్లు, తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన నిధులు, ఉద్యోగాలను సీమాంధ్రులు యథేచ్ఛగా కొళ్లగొట్టారు. తెలంగాణ ప్రజలపై అన్నింటా వివక్ష చూపారు. అవహేళనలు, అవమానాలు, వివక్ష తట్టుకోలేక తెలంగాణ ప్రజలు స్వపరిపాలన, ఆత్మగౌరవం నినాదం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమబాట పట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పదేళ్లలోపే తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. విద్యార్థులు, యువతలో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని రాజ్యం తుపాకీ గొట్టం ద్వారా అణచివేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తాత్కాలిక విజయం సాధించొచ్చేమోగాని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మాత్రం మరుగున పడలేదు. గడిచిన దశాబ్ద కాలంగా తెలంగాణ కావాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. 1969లో ప్రజ్వరిల్లిన తెలంగాణ ఉద్యమాన్ని టీపీఎస్ ఎలాగైతే రాజకీయంగా ఉపయోగించుకుందో 2000 సంవత్సరం తర్వాత వెల్లువెత్తిన పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ప్రయత్నించాయి. తెలంగాణ సాధన కోసమే ఆవిర్భవించినట్లుగా చెప్పుకునే టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకోవడం అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2004లో సమైక్య రాష్ట్రం పేరుతో పోటీ చేసి చావుదెబ్బ తిన్న టీడీపీ 2009 ఎన్నికల నాటికి తన పంథాను మార్చుకొని తెలంగాణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. ఒక్క సీపీఎం మినహా మిగతా పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమనే చెప్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏర్పడలేదు. కారణం పిడికెడు మంది సీమాంధ్ర పెత్తందారుల ప్రయోజనాలు. వాటిని కాపాడ్డానికే అధికారంలో ఉండే వ్యక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2009లో తెలంగాణ పోరు మహోద్యమమైంది. పది జిల్లాల ప్రజలు పోరాటమే లక్ష్యంగా ముందుకొచ్చారు. ఊరు వాడ ఏకమై ఉద్యమ హోరును కొనసాగించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అది మొదలు సీమాంధ్ర పెత్తందారుల కుట్రల కత్తులు బహిర్గతమయ్యాయి. అప్పటి వరకూ తెలంగాణకు మద్దతు పలికిన వారే సమైక్య రాష్ట్రం కావాలంటూ రాజీనామా డ్రామాలకు తెరతీశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లింది. తెలంగాణ మళ్లీ ఉద్యమాగ్నితో ప్రజ్వరిల్లింది. అది లక్ష్య సాధన దిశగా అతివేగంగా పరుగు తీస్తోంది. ఈలోపే 2014 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న విషయం పాలకులకూ గుర్తొచ్చింది. తెలంగాణ అంశానికి ఏదో ఒక ముగింపు ఇవ్వకుండా ఈ ప్రాంతంలో పోటీకి సిద్ధపడటం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని గుర్తించిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై నిర్ణయం దిశగా పావులు కదుపుతోంది. ఇదే క్రమంలో తెలంగాణకు రకరకాల పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా ఏఐసీసీ కార్యాలయం, టెన్ జన్‌పథ్ నుంచి లీకులు ఇస్తోంది. అందులో ఒకటి రాయల తెలంగాణ. రాయలసీమను అడ్డంగా విడగొట్టి మహబూబ్‌నగర్ జిల్లాను ఆనుకునే ఉన్న కర్నూల్, దాని పక్కనే ఉండే అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్టుగా ఇటీవల కాలంలో మీడియా భారీ స్థాయిలో కథనాలు వండి వడ్డిస్తోంది. ఈ డిమాండ్‌ను గతంలో ఏఐఎంఐఎం మాత్రమే చేసింది. హైదారాబాద్‌కే పరిమితమైన ఈ పార్టీ తర్వాతికాలంలో తన డిమాండ్‌ను మార్చుకుంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని కోరుకుంది. మరి ఎవరి కోసం రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారో అంతుపట్టడం లేదు. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుతున్న రాష్ట్రం కాకుండా ఎవరూ అడగని రాయల తెలంగాణ ఇస్తామంటూ ఎవరో చెప్పారో దాన్ని చిలువలు పలువలు చేసి మీడియా ఎందుకు ప్రచారం చేస్తుందో అంతుపట్టడం లేదు. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు మీడియా ఈ పల్లవి అందుకుందో సుస్పష్టం. దిగ్విజయ్ సింగ్ సైతం ఈ డిమాండ్ లేదని చెప్పిన ఆ విషయాన్ని మీడియా ఎక్కడా ప్రస్తావించడం లేదు. తెలంగాణ విషయంలో మీడియాకు ఉద్దేశాలు ఉండటం ఎంతమాత్రం సరికాదు.