బలవంతంగా కలిసుండటానికి తెలంగాణ ప్రజలు బానిసలా?
సమైక్యాంధ్ర ప్రదేశ్ పేరుతో గడిచిన మూడేళ్లలో ఓ కృత్రిమ ఉద్యమం అప్పుడప్పుడూ తెరపైకి వచ్చి అంతలోనే తెరమరుగవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సమైక్యాంధ్ర అనే ముద్దు పేరు పెట్టి కొందరు సీమాంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారుల నుంచి రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందినవారు నయా రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ను విడదీయొద్దని కోరుతూ తామేదో జాతీయవాదులమన్నట్టు సదరు పెట్టుబడిదారులు పెద్ద ఫోజు కొడుతున్నారు. ఓ ఎంపీ అయితే ఏకంగా జాతీయ జెండా చేతబట్టుకొనే ఈ కృత్రిమ ఉద్యమంలో అప్పట్లో పాలుపంచుకున్నాడు. సదరు ఎంపీ అంతకుముందు ఏం చేసేవాడో.. ఎలా ఎదిగాడు అటు విజయవాడ, ఇటు హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు. అలాగే సమైక్యాంధ్ర కోరుకునే పెత్తందారుల నిజస్వరూపం ఏంటో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి వారి పరిస్థితి ఏమిటో? ఇప్పుడు ఎలా బిలియనీర్లుగా ఎదిగారో? ఎవరినడిగినా చెప్తారు. హైదరాబాద్‌కు, తెలంగాణలోని మిగతా జిల్లాలకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిలో పలవురు వ్యక్తులు ఇప్పుడు చట్టసభల్లో ప్రతినిధులుగా ఉన్నారు. వారు ఎలా అంతస్థాయికి ఎదిగింది బహిరంగ రహస్యమే. అయినా తామేదో సచ్చీలురమన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారు సమైక్యాంధ్ర రాష్ట్రమే ఉండాలని ఓ కొత్త ఉద్యమాన్ని అప్పుడప్పుడూ తలుక్కున మెరిపిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో అనవసర భయాలు చొప్పించి వారితో ఉద్యమాలు చేయించాలని చూసినా వారి ఆటలు సాగలేదు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యరాష్ట్రం కోసం ఆందోళనలకు రమ్మంటే ప్రజలు పట్టించుకోవడమే లేదు. ఉన్నట్టుండి ఇప్పుడే సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఎందుకు మెరుస్తుందంటే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పటి రెండు రాష్ట్రాల కలయిక. భాషా ప్రయోక్త రాష్ట్రాల పేరుతో ‘తెలుగు’ భాష ప్రాతిపదికన ఏర్పాటు చేసిన రాష్ట్రం. అంతకుపూర్వం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంగా నిజాం ఏలుబడిలో ఉండేది. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నిజాం నవాబు తెలంగాణ ప్రాంతంలో పటిష్టమైన సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆయన హయాంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆధునిక సేద్యానికి ఆనవాళ్లు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర రాజ్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండేది. తమిళుల ఏలుబడిలో మగ్గిన ఆంధ్రుల విముక్తి కోసం పొట్టిశ్రీరాములు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. ఇవేవి పట్టని సీమాంధ్ర ప్రాంత నాయకులు ఇప్పుడు సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. తాము తమిళనాడు నుంచి విడిపోయిన విషయాన్ని విస్మరించి తెలంగాణ ప్రజలది వేర్పాటు వాదమని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడమంటే దేశం నుంచి విడిపోవడమే అనే భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ చుట్టూ ఇనుపకంచేదో పెడతారని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. అసలు సమైక్యాంధ్ర ప్రదేశ్ వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అని శోధిస్తే పిడికెడు మంది పెత్తందారులవే అనేది తేటతెల్లమవుతుంది. ఆ పిడికెడు మందికోసం తామెందుకు రోడ్లమీదికి రావాలని సీమాంధ్ర ప్రజలు ఇప్పటికే సమైక్యాంధ్ర పేరుతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమానికి దూరమయ్యారు. అయినా సీమాంధ్ర పెత్తందారులు తమకున్న అంగబలం, అర్థబలంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో కొందరిని మంచిక చేసుకొని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను తమతో కలిసి ఉండాలని బలంవతం చేస్తున్నారు. సీమాంధ్రుల దుష్పపరిపాలనతో వేగలేక తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమ ఉధృతికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది. తెలంగాణ ప్రాంతాన్ని ప్రజలను బానిసలుగా చూడటం సీమాంధ్రులకు అలవాటుగా మారింది. కానీ తెలంగాణ ప్రజలు ఏనాడు ఎవరికి లొంగి బతకలేదు. రాజకీయాల్లో ఏకాభిప్రాయానికి చోటు లేదు. మెజార్టీ అభిప్రాయం మేరకే ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు. ఏకాభిప్రాయం మాటున బలమైన ఆకాంక్ష ఆశను తొక్కిపెట్టాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోబోరు. ఆకాంక్షకు, ఆశకు మధ్య వ్యత్యాసం పెరిగితే ఉద్యమం ఏ రూపం దాలుస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆర్టికల్ 2, 3 ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు. లోక్‌సభలో సాధారణ మెజార్టీతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నట్లు చరిత్రలో లేదు. మెజార్టీ సభ్యుల అభిప్రాయామే ప్రజాస్వామ్యం. మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని గౌరవించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఇప్పటికైనా సీమాంధ్రుల తీరు మార్చుకోవాలి. ఉద్యమం మరోరూపు దాలిస్తే అందుకు సీమాంధ్ర నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.