మళ్లీ మోసం చేస్తే…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ పరిష్కారం దిశగా సాగుతోంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరుగనున్న కాంగ్రెస్‌ పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పార్టీకి కలిగే ప్రయోజనాలు, లేకుంటే వాటిల్లే నష్టాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించడం వల్ల పార్టీ పరిస్థితి, 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవచ్చు అనే వివరాలపై సమగ్రమైన వివరాలతో రోడ్‌ మ్యాప్‌ సమర్పించాలని దిగ్విజయ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆదేశించారు. ఈమేరకు వివిధ వర్గాల నిపుణులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో బేటీ అయిన ముగ్గురు నేతలు ఎవరికి వారుగా రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకొని ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నా అధిష్టానం రెండు రోడ్‌మ్యాప్‌లు సమర్పించమనడంతో అనివార్యంగా రెండు నివేదికలు పట్టుకెళ్లారు. డెప్యూటీ సీఎం మాత్రం తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయం చూపబోనని ఇది వరకే స్పష్టం చేశాడు. తాను అధిష్టానానికి సమర్పించేది రోడ్‌ మ్యాప్‌ కాదని, తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ నివేదికనే సమర్పిస్తానని పేర్కొన్నాడు. ఈ నివేదికపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కోర్‌కమిటీ సభ్యులు ఏకే ఆంటోని, పి. చిదంబరంతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ భేటీలో పాల్గొంటారు. ఈ భేటీలో తెలంగాణపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఈ ప్రాంత నేతలు ఆశాభావంతో ఉండగా, తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర పెత్తందారులైన కాంగ్రెస్‌ నేతలు తుది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఏవో నష్టపోతారంటూ అక్కడి కాంగ్రెస్‌ నేతలు వల్లెవేస్తున్న అబద్ధాలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి. బుధవారం రాత్రి రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అబద్ధాల దండకమే అందుకున్నాడు. కాకి లెక్కలు చెప్తూ తాను మాత్రమే మేధావినన్నట్టు ఫోజు కొట్టాడు. ఇలాంటి అబద్ధాలతోనే సీమాంధ్ర పెత్తందారులు కాంగ్రెస్‌ అధిష్టానంలోని కొందరు పెద్దలను రకరకాల ప్రలోభాలతో మెప్పించి ఇంతకాలం తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. ఇప్పుడు తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించడంతో సీమాంధ్ర నాయకులు తమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడుతుందని, మళ్లీ కుట్రలకు తెరతీశారు. తెలంగాణ ఏర్పడితే ఏవేవో జరిగిపోతాయంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. తెలంగాణ ఉద్యమాన్ని కొందరు వ్యక్తులకు ఆపాదించి తక్కువ చేసి చూపే ప్రయత్నమూ చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా పది జిల్లాల ప్రజలు చేస్తున్న ఉద్యమం కొలిక్కి వచ్చే తరుణంలో సీమాంధ్ర నేతలు మళ్లీ ఢిల్లీలోని తమ అనుకూలురతో సోనియా, రాహుల్‌ను ప్రసన్నం చేసుకునేందుకు తుది యత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ల కుట్రలే మళ్లీ ప్రభావితం చేసి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నిర్ణయాన్ని ఉసూరుమనిపిస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌కు మోసం చేయడం కొత్తకాదు. మళ్లీ అదే మోసపూరిత ప్రకటన చేస్తే తెలంగాణ యువత, విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. తెలంగాణది ఉద్యమాల చరిత్ర. పోరాడి సాధించుకోవడం తెలంగాణ ప్రజలకు జన్మత వచ్చిందే. కానీ 2009 తర్వాత తెలంగాణ యువత బలిదానాలకు పాల్పడుతూ స్థైర్యం కోల్పోతుంది. కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయంతో కొంపలేమి మునిగిపోవు. పోరాడితే తెలంగాణ సిద్ధించి తీరుతుంది. అది ఎంతో దూరంలో లేదు. మోసాల కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే రాబోతుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్‌ విస్మరిస్తే తెలంగాణలో రాజకీయ సమాధి తప్పదు.