ఓట్లు సీట్లే లక్ష్యమా?

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై తేల్చేస్తామని చెప్పి నిర్వహించిన కోర్‌కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఈ సమావేశం వెనుక ఉన్న లక్ష్యాలు, ఉద్దేశాలు మాత్రం వేరు. ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఈ భేటీకి కాంగ్రెస్‌ తెరతీసినట్లుగా స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధికంగా సీట్లు సాధిస్తే రాహుల్‌ను ప్రధాని చేయవచ్చు. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాలు 2014 ఎన్నికలే లక్ష్యంగా ఉంటున్నాయి. ఓ వైపు రాజకీయంగా కార్యక్రమాల వేగం పెంచుతూ మరోవైపు వివిధ పథకాలతో ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. దక్షిణాదిలో పోయిందనుకున్న కర్నాటక చేజిక్కిన తరవాత కాంగ్రెస్‌లో ఉత్సాహం ఇనుమడించింది. అందుకే మెల్లగా పావులు కదిపి బీహార్‌ను గుప్పిట్లోకి తెచ్చకుంది. మోడీ బూచిని ఎగదోయడంతో నితీశ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ బుట్టలో పడ్డారు. ఎన్‌డిఎ గూటినుంచి విడివడి ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జార్ఖండ్‌లో కూడా ఇదే తరహా రాజకీయాలు నెరిపారు. అక్కడ రాష్ట్రపతి పాలనకు తెరదించి జెఎంఎంతో జతకట్టారు. ఇక తెలంగౄణపై రాజకీయాలు స్పీడ్‌ కావడం వెనకా ఇదే మతలబు ఉంది. దక్షిణాదిలో 55 ఎంపీ సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని దిగ్విజయ్‌ ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ. 2014 ఎన్నికల నాటికి మరో నాలుగు రాష్టాల్ల్రో ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక అంతా సులవవుతందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాదిలో మోడీని నిలువరించడమే లక్ష్యంగా ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు. సిబిఐని రంగంలోకి దించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. ఇవన్నీ అధికారం కోసం వేస్తున్న ముందస్తు వ్యూహాలుగానే భావించాలి. ఇక నగదు బదిలీకి తోడు ఇప్పుడు ఆహారభద్రతా పథకాన్ని చేపట్టారు. హడావిడిగా ఆర్డినెన్స్‌ తెచ్చారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలను నడపడంలో కాంగ్రెస్‌ను మించిన వారెవ్వరూ ఈ దేశంలో లేరంటే అతిశయోక్తి కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండబోదు. ఎప్పుడు ఎలా ఓట్లు సంపాదించుకోవాలో దానికి తెలిసినంతగా ఇతర పార్టీలకు తెలియకపోవడం వల్లనే ఎన్నికల్లో అన్ని పార్టీలు బోల్తా కొడుతున్నాయి. ఓ వైపు తనకు అనుకూలమైన పథకాలు ప్రవేశ పెడుతూనే ఓట్లు గుంజుకునే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహంలో భాగంగానే భావించాలి. ఆహారభద్రత, నగదు బదిలీ పథకం,ఆధార్‌ కార్డుల నమోదు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు ధరల వాతలు పెడుతూ భారీగా భారం మోపుతూనే నగదు బదిలీకి చకచకా చర్యలు తీసుకోవడం ముందస్తు వ్యూహంలో భాగమనే చెప్పాలి. జనం డబ్బుతో జనం ఓట్లకు గాలం వెయ్యడమే నగదు బదిలీ పరమార్థమని వేరే చెప్పక్కర్లేదు. లబ్దిదారులకు ఇంతవరకు ఆధార్‌ అందలేదన్న నిజాన్ని దాచుతున్నారు. ఇప్పటిదాకా ఆధార్‌ కార్డుల ప్రక్రియలో మనమే ముందున్నామని నందన్‌ నీలేకని కితాబునిచ్చారు. అవి ఎక్కడున్నాయో చూపాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు. నగదు బదిలీకి పూర్వరంగం సిద్ధం చెయ్యాలంటే అయిదు కీలకాంశాలపై దృష్టి సారించాలి.ఆయా పథకాల ద్వారా మరోమారు అంటే మూడో సారీ యూపిఎను గద్దెనెక్కించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. అందుకే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలుకు ఉరకలుపరుగులు పెడుతోంది. విధానరాహిత్యంతో ఏళ్లతరబడి జాతి ప్రయోజనాలను పణంపెట్టిన మన్మోహన్‌ ప్రభుత్వం- నగదు బదిలీ విషయంలో వేంగంగా పావులు కదపడం ఆశ్చర్యం కలిగించక మానదు. పనిలో పనిగా పేదలకు ఆహారం అందించడమే లక్ష్యమని ప్రకటించుకున్నారు. కేంద్రం పరిధిలోని 42 సంక్షేమ, సబ్సిడీ పథకాల్లో 29 స్కీములను నగదు బదిలీ జాబితాలో చేర్చి, ఆధార్‌ సంఖ్యతో లబ్దిదారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి నేరుగా డబ్బులందిస్తామని చెబుతున్నారు. లబ్దిదారులకు ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు- ప్రత్యక్ష నగదు బదిలీకి అత్యంత కీలకమన్నది కార్యదర్శుల కమిటీ చెప్పింది. అయితే వాటికి తగిన కసరత్తు లేకుండానే పథకాన్ని మాత్రం పరుగులు తీయిస్తున్నారు. పేదల ఓట్లే లక్ష్యంగా ఈ పథకం ఇక పరుగులు పెడితే తమ ఓటు బ్యాంక్‌ను ఏ గ్యాస్‌ ధరలు, పెట్రో ధరలు, నిత్యావసర ధరలు గండి కొట్టలేవని వారి నమ్మికగా కనిపిస్తోంది. దీర్ఘకాలంలో సబ్సిడీల కుదింపు, అసలు సిసలైన లబ్దిదారులకే ప్రయోజనాల మళ్ళింపు లక్ష్యంగా పురుడుపోసుకొన్నదే ఈ నగదు బదిలీ పథకం. మొదట్లో పించన్లు, ఉపకార వేతనాలవంటి వాటినే నగదు బదిలీ కింద క్రోడీకరించదలచినా, మలిదశలో పౌరసరఫరాల్నీ చేర్చనున్నారు. మొత్తానికి అన్ని పథకాలు, రాజకీయ నిర్ణయాలు కేవలం ఓట్లు దండుకునే పథకాలు తప్ప దేశ ప్రయోజనాల కోసం కాదన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్తూ సమరోత్సాహంతో ముందకు సాగుతోంది.