ప్రజల్ని సమానత్వంతో చూడలేని వారు ప్రధానిగా ఎలా అర్హులు?
భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జాతీయవాదానికి విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. తాను హిందూ జాతీయవాదినని చెప్పుకుంటూ 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేధంపై ప్రజల హృదయాల్ని పిండేసేలా మాట్లాడారు. కారు కింద కుక్కపిల్ల పడి మృతిచెందితే బాధ పడమా అంటూ సుమారు మూడు వేల మంది ముస్లింల ప్రాణాలను కుక్కపిల్లతో సమానమని పేర్కొన్నాడు. హిందువుగా పుట్టినందుకు తాను గర్విస్తానని, తాను ఎప్పటికీ హిందూ జాతీయవాదేనని తేల్చిచెప్పాడు. తద్వార లౌకికవాద దేశంలో ఒక మతాన్ని భుజానికెత్తుకొని మిగతా వర్గాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. మోడీకి హిందుత్వ అతివాదిగా పేరుంది. ఆ అతివాదాన్ని దేశ ప్రజలందరిపై ప్రయోగించి మెజార్టీ వర్గమైన హిందువుల ఓట్లు గంపగుత్తాగా వేసుకొని అధికార పీఠమెక్కాలని బీజేపీ ఉవ్విలూరుతోంది. అందుకే గోద్రా ఘటనల నేపథ్యంలో ప్రపంచమంతా తప్పుబట్టిన మోడీని ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించుకుంది. బీజేపీని రెండు ఎంపీ స్థానాల నుంచి భాగస్వామ్య పక్షాల సాయంతో అధికారం చేజిక్కించుకునే దిశగా తీసుకెళ్లిన అగ్రనేత ఎల్‌కే అద్వానీ సహా పలువురు వ్యతిరేకించినా కాదని మోడికి ప్రచార కమిటీ పగ్గాలు కట్టబెట్టింది. బీజేపీ రాజకీయాలను తెరవెనుక నుంచి నడిపే విశ్వహిందూ పరిషత్, భగరంగదళ్ కనుసన్నల్లోనే మోడి నియమాకాన్ని బీజేపీ ఖరారు చేసింది. భారతదేశంలో అత్యధిక జనాభా హిందువులు. వారి హక్కులను పరిరక్షించే పార్టీగా చెప్పుకునేది బీజేపీ. మెజార్టీ ప్రజల పక్షం తమదని చెప్పుకునే బీజేపీకి ఆ వర్గమంతా అండగా నిలిచిన దాఖలాలు లేవు. అలాంటిది నరేంద్రమోడీని పావుగా ఉపయోగించి యావత్ హిందూ జాతిని తమవైపు నిలిచేలా ఓ కుయత్నానికి బీజేపీకి బీజం వేసింది. హిందూ సమాజానికి ఏదో ముప్పు వాటిల్లనుందనే అబద్ధపు ప్రచారాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి తద్వార తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవాలని మోడీని బాణాన్ని ప్రయోగించింది. జనసంఘ్ నుంచి బీజేపీ ఆవిర్భావం వరకు హిందువుల కోసం ఓ రాజకీయ పక్షం అవసరమనే సంఘ్ పరివార్ సిద్ధాంతమే ప్రధానం. బీజేపీ హిందుత్వ ఎజెండాతో రాజకీయాల్లోకి ప్రవేశించినా కేవలం హిందువుల ఓట్లతో మాత్రమే అధికారానికి చేరువ కాలేదు. 1980లో జరిగిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో 7.74 శాతం ఓట్లతో కేవలం రెండు ఎంపీ సీట్లను సాధించింది. 1989లో జరిగిన తొమ్మిదో లోక్‌సభ నుంచి బీజేపీ ప్రాభవం పెరిగింది. కేవలం 3.62 శాతం ఓట్లను కలుపుకొని 11.36 శాతం ఓట్లతో 85 ఎంపీ సీట్లు సాధించింది. 1991లో జరిగిన పదో లోక్‌సభ ఎన్నికల్లో 8.75 శాతం ఓట్లు పెంచుకొని 20.11 శాతం ఓట్లతో 120 సీట్లు సొంతం చేసుకుంది. 1996లో జరిగిన పదకొండో లోక్‌సభ ఎన్నికల్లో 41 స్థానాలు మెరుగుపర్చుకొని 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ పార్లమెంటరీ పక్షనేత అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేసినా సభలో బలం నిలుపుకోలేకపోయాడు. 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో మరో 21 స్థానాలు పుంజుకొని 182 సీట్లు సాధించి ఎన్‌డీఏ కూటమిగా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 1999లో కార్గిల్ యుద్ధం చేసినా సీట్ల సంఖ్యను మాత్రం పెంచుకోలేకపోయింది. పైపెచ్చు 1.84 శాతం ఓట్లను కోల్పోయింది. అది మొదలు కేంద్ర రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానం నేల చూపులు చూడటం మొదలైంది. వాజపేయి మూడు పర్యాయాలు ప్రధానిగా ప్రమాణం చేసి ఏడేళ్లకు పైగా అధికారంలో కొనసాగారు. ఎన్‌డీఏ పాలనలో అవినీతి పేట్రేగిపోవడం, ఓట్లేసిన వారిలో మెజార్టీ పక్షం విశ్వాసం చూరగొనలేకపోవడంతో బీజేపీ సీట్లు క్రమేపీ తగ్గడం మొదలైంది. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 44 స్థానాలు కోల్పోయి 138 సీట్లకే పరిమితమైంది. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సంఖ్యలో మరో 22 స్థానాలు లోపించి 116 స్థానాలకే పరిమితమైంది. 1998లో 25.59 శాతం ఓట్లతో 182 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ 2009లో 18.80 శాతం ఓట్లతో 116 సీట్లకే పరిమితం కావాల్సి రావడం వెనుక ఆ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం స్పష్టమవుతోంది. కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి దశాబ్ద కాలం కావడంతో ఈసారి కనుక సత్తా చాటుకోకపోతే అధోగతేనని గుర్తించిన సంఘ్ పరివార్ శక్తులు బీజేపీని మళ్లీ హిందూ అతివాదం వైపు పరిగెత్తించడం ప్రారంభించారు. అందులో భాగంగానే గుజరాత్‌లో ముస్లింలపై ఊచకోతకు పాల్పడ్డ అక్కడి ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించారు. తద్వార అతడిని భవిష్యత్ ప్రధానిగా ప్రమోట్ చేసే పనిని సంఘ్ పరివార్ మొదలుపెట్టింది. బీజేపీలో తొలితరం అతివాదిగా పేరుగాంచిన ఎల్‌కే అద్వానీ అధికారం కోసం అనివార్యంగా లౌకికవాదిగా మారాడు. రాముడికి గుడి కట్టేందుకు దేశమంతా రథయాత్ర చేసిన అద్వానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆ మాటే ఎత్తడం మానేశాడు. మొత్తంగా రామాలయ నిర్మాణం బీజేపీకి ఎన్నికల అస్త్రంగా మారింది. రామాలయ నిర్మాణం మాత్రమే సొంతగా అధికారాన్ని తెచ్చిపెట్టదని గుర్తించిన సంఘ్ పరివార్ మెజార్టీ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఎత్తులు వేసింది. గుజరాత్‌లో అధికారంలో ఉండి మైనార్టీ పక్షమైన ముస్లింలను ఊచకోత కోసిన నరేంద్రమోడీని సారథిగా పెట్టి అతడిని సమస్త హిందువుల ప్రతినిధిగా ముందుకు తెస్తుంది. ఆ ప్రతిపాదనకు లోబడే మోడీ ప్రజలను కుక్కపిల్లతో పోల్చాడు. తాను హిందూ జాతీయవాదినని చెప్పి మిగతా పక్షాలపై తన వైఖరేంటో చెప్పాడు. లౌకిక దేశంలో ఒక మతానికి ప్రతినిధిగా చెప్పుకునే వ్యక్తిని ప్రధానిగా ప్రజలు ఎలా ఆమోదిస్తారు. దేశంలోని 120 కోట్లకు పైగా జనాభాలోని మెజార్టీ పక్షం బీజేపీ అండగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో అలా నిలిచినట్లు దాఖలాలు లేవు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. విభిన్న జాతులు, మతాల వారు సోదరభావంతో కలిసి మెలిసి జీవనం సాగించడం ఇక్కడి ప్రత్యేకత. ఇలాంటి దేశంలో కొన్ని మతాలకు చెందిన అతివాద శక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అలాంటి అతివాద శక్తులు రాజకీయ నాయకులైతే, అధికారాన్ని హస్తగతం చేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో దానికి తార్కాణం గోద్రా అల్లర్లు తదనంతర మారణకాండ. తనకు తానుగా హిందూ జాతీయవాదినని చెప్పుకునే మోడీని ప్రధానిగా ప్రజలు ఎలా ఆమోదిస్తారు. ప్రజలను సమానంగా చూడలేని వారు, ఒక మతానికో, వర్గానికో ప్రతినిధిగా వ్యవహరించేవారు జాతీయవాదులు ఎలా కాగలరు? అలాంటి వ్యక్తులను ఉన్నతస్థానాల్లో ఎలా అంగీకరిస్తాం. మోడీలాంటి వ్యక్తులను దేశ అత్యున్నత స్థానాల్లో కూర్చోబెడితే గోద్రాలాంటి ఘటనలు పునరావృత్తం కాకపోవు. అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ప్రజాస్వామ్యవాదులు, లౌకిక వాదులు ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.