నిర్బంధంలో అసెంబ్లీ
ఆకలైన బిడ్డ అరవడం ఎంత సహజమో, ఆకాంక్షల్ని వెలిబుచ్చ డానికి ప్రజలు ఆందోళనలకు పూనుకోవడం అంతే సహాజం. ప్రజలు ఈ గడ్డమీద పుట్టినందుకు, ఆరు దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్న వివక్ష, దొపిడి అణిచివేత అన్యాయాలకు వ్యతిరేకం గా మాట్లాడడం, పోట్లాడడం కొత్తేమి కాదు. ప్రజల ఆర్థనాదాలను వినడానిదకి అట్లాంటి ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ఓ అరుదైన అవకాశం. ప్రజల పోరాటాల్ని అర్థం చేసుకోవడానికి, కాని ఇవాళ నిత్యం ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్య్రాల గూర్చి అభివృద్ది పథకాల గురించి పాలకులు ఏకరువు పెడుతున్నా రు. అదే కోవలో అవి ప్రజలకు అందుబాటులోకి రానపున్పడు ప్రబుత్వాలను నిలదీసి అడిగే స్వేచ్ఛ, హక్కుంటుందని గుర్తించలేక పోవడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడమే తప్ప మరోటి కాదు. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు నుండే తెలంగాణ ఓ ప్రత్యేక సర్వ స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ప్రాంతమని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించడం పోరాడడం, వివక్ష దోపిడీలకు వ్యతిరేకంగా నెత్తుటి తర్పణ చేసే వరకు కొనసాగుతూనే ఉన్నది. అట్లాంటి నేపధ్యంలో నుండే కొనసాగుతన్న పోరాటం ఈ ప్రాంత వనరులు, నిధులు, నదులు కొలువులు, చదువులు, వైద్యం, బొగ్గు, గనులు, తదితర విద్యుత్, వ్యవసాయ రంగాల్లో కొనసాగుతున్న పాలకుల వివక్ష దోపిడికి వ్యతిరేకంగా నిరంతరాయంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రాంతం తెలంగాణ. 1969లో ఇక్కడి ప్రాంత బిడ్డల ఉద్యోగాలు ఇక్కడి ప్రాంత వాళ్లకే చెందాలని ఇక్కడి బొగ్గు ఇక్కడే విద్యుత్ ఉత్పాదన, ఇక్కడి పరిశ్రమలకే తోడ్పడాలని ఈ ప్రాంత భూముల్ని గనుల్ని, నీళ్లను కొల్లగొట్టడం, తరలించడం ఆపివేయాలని నిరంతరం ఈ ప్రాంత ప్రజలు అనేక రూపాల్లో పోరాడుతూనే ఉన్నారు. అట్లాంటి ప్రజా చైతన్యంతో ఇక్కడి వివక్ష దోపిడీలకు వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తినప్పుడల్లా అఖిల పక్షాలు, అష్ట, షట్సూత్ర పథకాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరోందల పది జిఓలు, గిర్‌గ్లాని కమిటీలు వేసి నీరుగార్చడం, తమ దోపిడి విధానాలను కొనసాగించడం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంత బిడ్డలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పిడికిలెత్తిన విద్యార్థి వీరుల్ని 1969లో 369 మందిని, పొట్టన పెట్టుకున్న నెత్తుటి జ్ఞాపకం ఇవాళ్టికీ అసెంబ్లీ ఎదుటి అమరుల స్థూపం నలు దిక్కులా దిగిన తుపాకి గుండ్ల చిత్రం కెలుకుతూనే ఉంది. ఆనాటి నుండి నేటి దాకా కొనసాగిన, కొనసాగుతున్న అన్యాయాలకు అక్రమాలకు అంతిమ పరిష్కారం ‘ఆంధ్ర’ వలస పాలన, దానికి ఊతంగా కొనసాగుతున్న సామ్రాజ్యవాద బహుళజాతి బంధం. ప్రపంచబ్యాంకు సరళీకరణ విధానాలకు, విద్యారంగం మొదలు వ్యవవసాయం వైద్య, విద్యుత్ గ్రామీణ ఉపాధి తదితర రంగాలన్ని చిద్రమైపోయి ప్రజల బతుకు భారమైంది. ఇక్కడి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వల్ల బొందలగడ్డగా మారిపోయింది. హైదరాబాద్ చుట్టంతా ఐదు జిల్లా ల, 35 మండలాల, 800 గ్రామాల గ్రేటర్: హైదరాబాద్ పేరిట నుజ్జైపోయినా, పోలెపల్లి సెజ్‌లు, అరవిందో కంపెనీలకు బయ్యారం గనుల్ని రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టే కుతంత్రం కొనసాగింది. ‘విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కైనట్లే, బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసుల హక్కు’ అంటే సహించని సర్కార్ ఈ ప్రాంత ప్రజల్ని వంచిస్తున్నది. ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షని నిర్లక్ష్యం చేస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండ రూపాయి ఇచ్చేది లేదని ప్రకటిస్తున్నది. ఐదారు దశాబ్దాలుగా, ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాదన్న సాకుతో, ముల్కి రూల్స్‌ను మాయం చేసి నాలుగేళ్ల చదువుతో స్థానికులుగా మారిన స్థానికేతరుల, రాష్ట్ర సచివాలయం నుండి, గ్రామ సచివాలయం దాకా అన్యాయంగా అప్పనంగా రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసి ఇక్కడి కొలువులు కొల్లగొట్టారని ‘గిర్‌గ్లాని’ నివేదిక ఇచ్చిన ఆరొందల పది జిఒ వచ్చి సిల్వర్‌జూబ్లీ గడిచినా అమలుకు నోచుకోక పోవడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా ఇవ్వాళ అది ఆంధ్ర ప్రాంత అధికారుల, రాజకీయ నాయకుల నియామక కేంద్రంగా మారిపోయిందని రుజువైంది. అలుపెరుగుని పోరాటాల తో వెల్లువెత్తిన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, ప్రజాస్వా మిక ఆందోళనకు వెరసిన కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్న అని ప్రకటించింది. ఆ ప్రకటన ఆచరణ రూపం దాల్చిఉంటే ఇవ్వాళ తెలంగాణ సమాజం ఇంత కలత చెంది కదన రంగానికి కాలు దువ్వేది కాదు. ఆ ప్రకటన ముందు సమ్మతి తెలిపిన రాజకీయ పార్టీలు, తమ స్వార్థ పూరిత ఓటు రారజకీయాల కోసం తిరకాసు పెట్టకపోతే అన్నదమ్ముల్లా, ఆత్మీయుల్లా కలిసి ఉండే సంస్కృతికి విఘాతం కలిగి ఉండక పోయేది. మళ్లీ శ్రీకృష్ణ కమిటీ పేర కాలయాపనతో 8వ అద్యాయం రహస్య కుట్రలతో తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను అణగదొక్కే ఓ మోసపూరిత విధానం వల్ల ఇవాళ అసెంబ్లీ తనకు తాను నిర్భందంలో చిక్కుకున్నది. నిషేధాజ్ఞల్లో కొనసాగుతున్నది. ప్రజాకాంఓను గుర్తించి పరిష్కరించాల్సిన అసెంబ్లీ ఇవ్వాళ ఆ ఆకాంక్షల కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పూనుకున్న తెలంగాణ ఉద్యమకారుల్ని నిర్భందిస్తు బైండోవర్లు, ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం. ప్రజలెదుర్కొంటున& అనేకనేక సమస్యల్ని చర్చించడం ద్వారా పరిష్కార వేదికగా ప్రజల మన్ననలను పొందాల్సిన అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న పలు పార్టీల నాయకులు , శాంతి యుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చినా అను మతివ్వడానికి నిరాకరించడం పూర్తి అప్రజాస్వామికం. ఛలో అసెంబ్లీకి అనుమతివ్వడం వల్ల ఏదో విధ్వంసం జరుగుతుందని ప్రభుత్వమే ఉద్యమకారుల్ని రెచ్చగొట్టే విధంగా అరెస్టులు, నిర్భంధాలతో గొంతు నొక్కే ప్రయత్నం కంటే గతంలో జరిగిన సాగరహారం, మిలియన్ మార్చ్, ఛలో సంసద్‌లలో అనుమతి ఇచ్చినా ఇవ్వక పోయినా, జరిగిన సంఘటల్ని పరిశీలిస్తే ప్రజాస్వా మ్య బద్దంగా అనుమతివ్వడం వల్ల ఎలాంటి విధ్వంసకర సంఘట నలు జరగలేదు. అనుమతివ్వడానికి నిరాకరించిన మిలియన్ మార్చ్ సందర్భంలో ఉద్యమకారుల్ని రెచ్చగొట్టినట్లు ప్రవర్తించడం వల్లే ట్యాంక్ బండ్ పై విగ్రహాల కూల్చివేత జరిగిందన్నది వాస్తవం. కనుక ఏదో ఒక సాకుతో ఇప్పుడైతే మావోయిస్టులు మద్దతు పలికార న్న సాకుతో ఉద్యమకారు లు ఛలో అసెంబ్లీకి తుపాకులు, బాం బులతో వస్తారన్నంత భయానక వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించి వేలాది మంది పోలీసు బలగాలతో అసెంబ్లీని నిర్భందిం చుకోవడం, నిషేదాజ్ఞలతో హైదరా బాద్, మొత్తం తెలంగాణ కొనసా గడం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. మావోయిస్టులు 1969 నుండి ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మద్దతిస్తున్నారు. కాని ఏనాడు వాళ్ల తుపాకులతో ఈ పోరాటాన్ని ప్రజల ఆకాంక్షల్ని హైజాక్ చేయాలని చూడలేదు. కనుక ఏవేవో సాకులతో ఉద్యమాలను అణచడం సాధ్యం కాదని, అసెంబ్లీని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాల్లో నిర్భందించకుండా, ప్రజల ఆకాంక్షల్ని చర్చించి నెరవేర్చే ఓ ప్రజాస్వామిక వైఖరిని ప్రదర్శించడం ఇవాల్టి అవసరం. అందుకోసమే మొన్నటి ఛలో ఢిల్లీ సంసద్ యాత్రలో కాని ఈ దశాబ్ధ కాలంగా సాగుతున్న పోరాటంలో ఎక్కడ హింసాపూరిత సంఘటనలు చోటు చేసుకోకుండా సాగుతున్న ప్రజా పోరాటంగా తెలంగాణ పోరాటాల్ని అర్థం చేసుకోవాలి. కేంద్రం డిసెంబర్ 9న ప్రకటించిన ప్రకటనలను, పార్టీల వైఖరి వల్ల అమలుగాక వేయికి పైగా బిడ్డల ఆత్మహత్యలకు కారణమైన పాలకులు అందుకు పరిష్కారం సమస్యను దాటవేయడం కాదు. ప్రజలు కోరుకుంటున్నట్లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని గుర్తించాలి. నిర్భంధాల ద్వారా, నిషేధాల ద్వారా, అరెస్టులు బైండోవర్లతో ప్రజాకాంక్షను అణిచి ఉంచలేదని గుర్తించి. అసెంబ్లీ చర్చించి అనుమతివ్వడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయడం మినహా మరో మార్గం లేదు. అందుకోసం హామీ ఇచ్చిన ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం విజ్ఞత గల పార్టీలు, నాయకులు ప్రయత్నించాలి. అందుకోసం ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్ధి ఉద్యమకారులు అసెంబ్లీలో ఒత్తిడి పెంచడానికి సంఘటితంగా ముందుకు సాగాలి. ఛలో అసెంబ్లీని విజయవంతం స్పూర్తిగా తీసుకొని పోరాటాల ద్వారా తెలంగాణను సాధించుకోవాలి.
కె ప్రభాకర