తెలంగాణ ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి సంప్రదింపుల రాజకీయానికి తెరలేపింది. 2004 నుంచి ఇప్పటి వరకూ వివిధ కమిటీలతో తెలంగాణపై విస్తృత సమాచారం సేకరించిన కాంగ్రెస్‌ ఇంతవరకూ ఈ అంశంపై తేల్చకపోగా ఎప్పటికప్పుడు గడువులు పెంచుతూ పోతూ ఈ ప్రాంత ప్రజల్లో నిరాశ నిస్పృహలు పెల్లుబికేలా చేస్తోంది. ఎప్పటికప్పుడు తెలంగాణపై ఇదిగో అదిగో అంటూ జాప్యం చేయడమే తప్ప పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. తెలంగాణను ఫక్తు ఎన్నికల అంశంగానే చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి కోసమే ఏదో చేయబోతున్నామంటూ హడావుడి సృష్టిస్తోంది. ఎన్నికల ఏడాది కావడం, పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధపడుతుండటంతో ఆ పార్టీ తెలంగాణపై ఏదో చేయబోతున్నట్టు మీడియాకు లీకులిస్తోంది. అంతటిగా ఆగకుండా మొన్నటికి మొన్న కాంగ్రెస్‌ పార్టీ కోర్‌కమిటీ భేటీ అయింది. కేవలం తెలంగాణపై చర్చిండానికే కోర్‌కమిటీ రెండు గంటలకుపైగా సమాలోచనలు జరిపింది. కోర్‌కమిటీలో సభ్యులుకాని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచితే పార్టీకి కలిగే లాభాలు, తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఒనగూరే ప్రయోజనాలు, ఇవ్వకుంటే తలెత్తే ఇబ్బందులపై రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసి తమకు సమర్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ఆదేశించింది. వారు సమర్పించిన నివేదికల ఆధారంగానే కోర్‌కమిటీలో సమాలోచనలు జరిపారు. ఈ మీటింగ్‌ మినిట్స్‌ను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పెట్టి చర్చించనున్నట్లు దిగ్విజయ్‌సింగ్‌ కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియాకు వెల్లడించారు. ఈనెల 26న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. అధికారికంగా తేదీ ప్రకటించడమే తరువాయి అని కేంద్రంలో కీలకస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుడొకరు చెప్పారు. తెలంగాణపై ఈ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం వెలువడవచ్చని తెలంగాణ ప్రాంత నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే సీమాంధ్ర నాయకులు మాత్రం అందుకు భిన్నంగా ప్రతిస్పందిస్తున్నారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను యథాతదంగా కొనసాగించడానికి అధిష్టానం సిద్ధపడినట్లు చెప్తున్నారు. ఈమేరకు ఏఐసీసీ కార్యాలయం, టెన్‌ జన్‌పథ్‌ నుంచి మీడియాకు వచ్చిన లీకులను ఆధారంగా చూపుతున్నారు. ముఖ్యమంత్రి కోరినట్టుగా తెలంగాణకు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధపడిందని ముఖ్యమంత్రి లీకులిచ్చారు. కాంగ్రెస్‌ అధిష్టానవర్గంలోని వారు కాని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగాని దానిని ఖండించలేదు. మరోవైపు తెలంగాణకు సానుకూల సంకేతాలు కూడా అధిష్టానం ఇస్తుంది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డితో దిగ్విజయ్‌ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో తెలంగాణ ఏర్పాటుపైనే చర్చించినట్లుగా ఈ ప్రాంత నాయకులు పేర్కొన్నారు. దిగ్విజయ్‌గాని, జైపాల్‌గాని మీడియాతో మాట్లాడకపోయినా వారి మధ్య చర్చల సారాంశం ఇదేనని ఈ ప్రాంత నాయకులు చెప్తున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణపై చర్చించాక, యూపీఏ భాగస్వామ్య పక్షాలతో భేటీ అయి తెలంగాణపై చర్చించిన అనంతరం పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ నేతలు పేర్కొంటున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, జైపాల్‌రెడ్డితో అరగంటకు పైగా భేటీ అయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరి, పార్టీ నేతలను కొత్త రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసే తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లుగా తెలిసింది. తెలంగాణపై ఎడతెగని చర్చలు, సంప్రదింపుల పేరుతో జాప్యం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అది కాకుండా ఎన్నికల్లో లబ్ధికోసమంటూ ఎవో కళ్లబొళ్లి కబుర్లతో కాలక్షేపం చేయాలని చూస్తే మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా వ్యతిరేకత తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణపై ఎంత త్వరగా తేలిస్తే అంతమంచిది. లేకుంటే కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజల తిరుగుబాటు ప్రభావం ఎలా ఉంటుందో కూడా తేటతెల్లమవుతుంది. పరిస్థితి అంతవరకూ లాగితే కాంగ్రెస్‌కే నష్టం.