సర్వేజనా సుఖినోభవంతు
(గత బుధవారం తరువాయి భాగం)
పన్నెండు కావస్తోంది. గంటన్నర క్రితం వెళ్ళిన హెడ్ కానిస్టే బుల్ రాకపోవడంతో అసహనంగా ఉంది ఎస్‌ఐకి ఆకలిగా ఉంది. రెండు చాయ్‌లు తాగాడు. ఉదయం టిఫిన్ తినకుండా వచ్చాడు. వైర్‌లెస్ పెట్టు అరుస్తూనే ఉంది. అప్పుడోచ్చాడు హెడ్ కానిస్టేబుల్. ”ఆ పోరాగాండ్లు ఇంట్లో లేరు సార్! వాళ్ళ తండ్రులని పట్టుకొచ్చినం” సాల్యూట్ చేస్తూ అన్నాడు. ”లేద్సార్ నిన్నటి నుంచి ఇంటికి రాలేదట. వాళ్లకీ సంగతి ఇప్పుడే తెలిసింది. బయట ఉన్నారు సార్”
”ఏం చేస్తారు వాళ్లు”
”ఒకరేమో స్కూల్ టీచర్! ఇంకొకకతను కిరాణా వ్యాపారం సార్! ఇంజనీర్ కూడా వచ్చిండు సార్!”
బెల్ కొట్టి అక్కడి నుంచి కుర్చీలను తీయించి వెనక గదిలో వేయిం చాడు. వాళ్లని లోపలికి తీసుకురమ్మని చెప్పాడు. ముగ్గురూ అవమా నరతో లోపలికొచ్చాడు. టీచర్, వ్యాపారి చేతులు కట్టుకొని ముందు నిల్చున్నారు. వాళ్లకి వెనుక ఇంజనీర్ నిల్చున్నాడు.
”మీ కొడుకులు చేసిన సంగతి తెల్సిందా ?”
తెల్సిందన్నట్టుగా తలలు కిందికి వంచి నిల్చున్నారు.
”పోరగాండ్లను పెంచేది గిట్లనేనా? సార్‌వేమో నువ్వు ! ఏమయ్యా సేటూ ! చెప్పు నీ సంగతేంది?”
సమాధానం లేదు. కొడుకులు చేసిన పనులకి తలవంపులుగా ఉంది. తల తీసినా బాగుండేదనిపించింది.
”వాళ్లను ఎ్కడ దాచిపెట్టిండ్రు ? మంచిగ చెప్పుండ్రి”
”వాళ్లెక్కడున్నారో మాకు తెలియద్సార్” ఇద్దరూ ఒకేసారి అన్నారు.
”నా దగ్గర నఖరాలు చేస్తే నడువదు. సాయంత్రం వరకు వాళ్లని తెచ్చి ఇక్కడ పడేస్తేనే మంచిది. లేకపోతే మీ చొక్కాలకు నీళ్లు పోస్తా.”
”మంచిది సార్” అన్నారు, భయపడుతూ, అవమానపడుతూ.
అక్కడి నుంచి వెళ్ళాలా, ఉండాలా తెలియదు కొద్దిసేపు అలాగే నిల్చున్నారు.
”పోండి ! సాయంత్రం ఐదు గంటల వరకి ఆ పోరగాండ్లను, దొంగతనం చేసిన సొత్తుని తీసుకొనిరండి” అన్నాడు ఎస్సై. ‘బతుకు జీవుడా’ని బయటపడ్డారు. వాళ్ల వెంటే నడిచాడు ఇంజ నీరు. సాయంత్రం ఐదు కావస్తోంది. తన వికృతరూపాన్ని బహిర్గతం చేస్తోంది పోలీస్ స్టేషన్. శ్రీను, క్రిష్ణని తీసుకొని వాళ్ల తల్లిదండ్రులు వచ్చారు. వాళ్లతోబాటు గంగాథర్ తండ్రి కూడా వచ్చాడు. కరువుతో గత్యంతరం లేక పశువులని కబేళాలో అమ్ముతున్న రైతు మొఖంలా వాళ్ల ముఖాలు. ఆ ఇద్దరు కుర్రవా ళ్లూ భయంతో వణుకుతున్నారు. వాళ్ళ వయుస్సు ఇరవైకి మించవు. నేరుగా ఎస్సై దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చాలక, స్టేషన్‌కి వెనుక వైపున్న హెడ్ కానిస్టేబుల్ రూం వద్దకి వెళ్లారు. రషీద్ ఉన్నాడు. వీళ్లతో మాట్లాడి ఎస్సై దగ్గరకు వెళ్లి చెప్పాడు. ఎస్సై వాళ్లను తన రూంలోకి తీసుకొని రమ్మన్నాడు. రషీద్‌తో పాటు వాళ్లు ఎస్సై రూంలోకి వెళ్లారు. వాళ్ళు పులి బోనులోకి తోసిన మేకపిల్లల్లా ఉన్నారు.
”సొత్తు తెచ్చినారా?” ప్రశ్నించాడు ఎస్సై.
”తెచ్చాం సార్!” అంటూ ఎస్సై టేబిల్ పైన పెట్టారు.
”అన్నీ తెచ్చారా! ఇంకా ఏమైనా ఉన్నాయా ?” గద్దించాడు.య
”అన్నీ తెచ్చినారు సార్ !” చెప్పారు తల్లిదండ్రులు.
”సరే ! మీరు పొండి” అన్నాడు ఎస్సై తండ్రులవైపు చూస్తూ.
వాళ్లకి భయంగా ఉంది. సొమ్మంతా తెచ్చారు. కుర్రవాళ్లని తెచ్చారు. సొమ్మంతా తెచ్చినప్పటికీ వాళ్లను అక్కడే వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది. ఎస్‌ఐతో మట్లాడాలంటే కష్టంగా ఉంది. అయినా గంగాధర్ తండ్రి ధైర్యం చేసి ”వాళ్లని ఏమీ అనకండి సార్! మొత్తం సొత్తు తెచ్చాం” అన్నాడు. ”ఈ మధ్య చాలా దొంగతనాలు జరిగా యి. వీళ్లకి వాటితో సంబంధాలుండి ఉంటాయి. వీళ్లను విచారిం చాల్సి ఉంటుంది. మీరు విసిగించక పోండి” గదమాయించాడు ఎసై.తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడింది. ఏం చేయాలో తోచల ేదు. అక్కడుండటానికి ధైర్యం చాలక బయటకొచ్చారు. లోపల లాఠీలతో కొడ్తున్న శబ్దాలు. గుండెల్లోని దిగులు తండ్రుల కంటి నుంచి నీరుగా కారుతోంది. తెల్లవారింది. రాత్రి కురిసిన జడివానకి స్టేషన్ మూలుగుతోంది. రషీద్ డ్యూటీ రిజిస్ట్రర్ రాస్తున్నాడు. అప్పు డొచ్చాడు శ్రీను తండ్రి మురళి. అతను వ్యాపారి. హెడ్ కానిస్టేబుల్ టేబుల్ దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. ‘ఏమిటీ’ అన్నట్టు చూశాడు హెడ్ కానిస్టేబుల్, ఉదయం కాబట్టి ముఖం ప్రసన్నంగానే ఉంది. ”మోరీల్ సాబ్! సోరగాండ్లు ఏదో తప్పు చేసిండ్రు, ఇంకొకసారి చేయకుండా చూసుకుంటాం. ఇంట్లో ఎవరికి నిన్నటి నుంచి పానం పానంల లేదు. గీ కేసు నుంచి పోరగాండ్లని తప్పించే ఉపాయం చూడుండ్రి. మీ కష్టముంచుకోం” భయం భయంగా చెప్పిండు. రషీ ద్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ముఖాలవైపు చూశాడు. వాళ్లు అర్థం చేసుకొని బయటకి పోయారు. హెడ్ కానిస్టేబుల్ మురళివైపు చూశాడు. ”ఎస్సై సాబ్ శాన గరమ్ మీదున్నాడు. గీ పోరగాండ్లే ఈ మధ్య జరిగిన దొంగతాలన్నీ చేసిండ్రని బెదరగొట్టేశాడు. ”లుదు మోరీల్ సాబ్ ! నిన్న గట్టిగా అడిగినం. ఇదే మొదటిదని చెప్పిండ్రు పిల్లలు వాళ్ల భవష్యత్ ఖరాబైపోతది మీరే వాళ్లను కాపాడలే. ఇవి చేతులు కావు కాళ్లు” అనుకొంటూ రషీద్ చేతులు పట్టుకున్నాడు మురళి.
”సరే ! కూచో”
కాస్త ధైర్యం వచ్చింది మురళికి.
”వాళ్ళిద్దరేమంటున్నారు ?” గంగాధర్, క్రిష్ణ తల్లిదండ్రుల నుద్దే శించి అన్నాడు.
”వాళ్లకు ముఖం లేకనే నేను వచ్చిన. మీరేది అంటే దానికి ఒప్పుకొంటాం.
”ఖతర్నాక్ కేసులో ఇరుక్కున్నరు. సోరగాళ్లు రెడ్ హ్యాండెడ్‌గా ఒకరు దొరికిపోయే. వీళ్లను ఈ కేసులకెళ్లి తీసుడు శానా కష్టం” ”మీరనుం కుంటే గిది పెద్ద పని కాదు. మీరేదంటే గా మాట మీద నిల్చుంటం”
”సరే ! నేను అమీన్ సాబ్‌తో మాట్లాడి వస్తాను. నువ్వు బయట నిల్చో. మళ్లీ పిలుస్తా”
మురళి ముఖంలో ఆశలు చిగురించాయి. ఆ రూం నుంచి బయ టకు వచ్చి వేపచెట్టు క్రింద నిల్చున్నాడు.
తొమ్మిది గంటల ప్రాంతంలో ఎస్సై వచ్చాడు. రషీద్ వెళ్లి ఎస్సైతో అన్ని విషయాలు చెప్పాడు. తన రూంలోకి వచ్చాడు రషీద్. మరళిని పిలిచాడు. మాట్లాడాడు. డీల్ కుదిరింది. మూడు గంటల ప్రాంతం లో విశ్వనాథానికి కబురు పెట్టారు. విశ్వనాథం పరుగు పరుగున స్టేషన్‌కి వచ్చాడు. ఎస్సై ముందు నిల్చున్నాడు.
”కూర్చోవయ్యా విశ్వనాథం !” అన్నాడు ఎస్సై.
ఎస్సై మర్యాదకి ఆనందపడాలో, దాన్లోని లాజిక్కుకి తలగొట్టుకోవాలో అర్థం కాలేదు విశ్వనాథానికి. అలాగే నిల్చున్నాడు. రషీద్ పెన్నూ, ప్యాడు తెచ్చి ఎస్‌ఐ టేబుల్‌పైన ఉంచాడు. ”కూర్చో వయ్యా సేటూ ! కూర్చొని చదువుకొని సంతకం పెట్టు” అన్నాడు ఎస్సై కాగితాల ప్యాడు చేతికిస్తూ.
విశ్వనాథం ధైర్యం చేసి కూర్చున్నాడు. చదవడం ప్రారంభించాడు.
”గౌరవనీయులైన ఎస్సై గారికి
అయ్యా !
నా మనవి ఏమనగా నేను అల్గునూర్ నివాసిని. వ్యాపారం చేసుకొని జీవిస్తాను. నిన్న కరీంనగర్‌లో పనుండి మా కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాను. ఈ రోజు ఉదయం తిరిగొచ్చాం. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టబడి ఉంది. లోపల బీరువా తాళం కూడా పగుల కొట్టబడి ఉంది. బీరువాలో ఉంచిన ముప్పై తులాల నగల దొంగతనం జరిగింది. వాటి వివరాలు క్రింద పేర్కొన్నాను. ఎవరో గుర్తు తెలియని దొంగలు ఈ దొంగతనం చేసి ఉంటారు. దొగలను పట్టి నా సొత్తును నాకు ఇప్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
ఇట్లు
తమ విధేయుడు
(చింతకింది విశ్వనాథం)”
విశ్వనాథం ఫిర్యాదు చదువుకొని ఆశ్చర్యపోయాడు. భయపడ్డాడు. కేసు ఒకలా ఉంటే, ధరఖాస్తు మరోలా ఉంది. ఇదివరకే తమ దరఖాస్తు ఇచ్చాడు. మళ్లీ ఇదెందుకు? తన నగదు ఇరవైవేల రూపా యల గురించి రాయలేదేమిటి? ఇంతకి తన సొత్తు దొరుకుతుందా? అన్నీ ప్రశ్నలే విశ్వనాథం మనసులో. ఎస్సై వైపు భయంగా చూశాడు. ”ఆలోచిస్తున్నావేంది సేటూ? సంతకం పెట్టు” అన్నాడు ఎస్సై మర్యాదగానే.
”అదికాదు సార్! జరిగింది ఒకట దీంట్లో రాసున్నది మరొకటి. నా పోయిన ఇరవైవేల సంగతి దీంట్లో లేదు” భయంభయంగా అన్నాడు. ”నీకు బంగారం దొరుకుతుందన్న ఆశ ఉందా? దొరికినా మొత్తం బంగారం దొరుకుతుందా? నీ చేతికి ఎప్పుడోస్తుందో తెలియదు. జరిగింది జరిగినట్లు రాస్తే కేసు హైకోర్టు దాకా పోతుంది. నువ్వు దీనిపై సంతకం చేస్తే కనీసం నీ ముప్పై తులాల బంగారమైనా దొరుకుతుంది. తొందరగా కోర్టు నుంచి నీ చేతికి వచ్చేట్టు చేస్తాను. ఆలోచించుకో. ఆలోచించుకొని సంతకం చేయి” అన్నాడు ఎస్సై.
ఆలోచనలో పడిపోయాడు విశ్వనాధం.
”ఇట్లా చేస్తే, కనీసం ముప్పై తులాల బంగారమన్నా దొరుకుతుందంటారా?” అడిగాడు విశ్వనాథం.
”దానికి నేను పూచీ ఇస్తాను . రెండు మూడు నెలల్లో నీ చేతికి వచ్చేట్టు కూడా చేస్తాను” భరోసా ఇచ్చాడు ఎస్సై. కాస్సేపు ఆలో చించుకొని సంతకం చేశాడు. ”నీట ముంచినా, పాల ముంచి నా మీదే భారం సార్” ఫిర్యాదు ఎస్సై చేతికిచ్చాడు. రెండు రోజులు గడిచిపోయాయి. సాయంత్రం నాలుగవుతుంది. పంచ నామ రిమాండు రిపోర్టు, ఛార్జిషీట్ అన్నీ సిద్దం అయ్యాయి. వాటి మీద సంతకాలు చేస్తున్నాడు ఎస్సై.. జీప్ కూడా సిద్దం అయింది. దొంగని తీసుకొని ఎస్సై హెడ్ కానిస్టేబుల్ కోర్టుకి బయలుదేరారు. కోర్టుకి చేరుకొనేసరికి నాలుగున్నర దాటింది. ప్రాసిక్యూటర్ గదిలోకి వెళ్లి కూర్చున్నాడు ఎస్సై. కాగితాలు అన్నీ తీసుకొని వెళ్లి బెంచి క్లర్క్‌కి అందజేశాడు హెడ్ కానిస్టేబుల్. కాసేపటికి కేసుని పిలిచారు. ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాడు హెడ్ కానిస్టేబుల్ సాల్యూట్ చేస్తూ. కాగితాలని చదువుకొన్నాడు మేజిస్ట్రేట్.
”ఏం పేరు ?” ముద్దాయిని అడిగాడు మేజిస్ట్రేట్.
”ఆకుసాని మల్లయ్య”
”తండ్రి పేరు ?”
”రామయ్య”
”వయస్సు”
”ముప్పై అయిదు”
”పోలీసులేమైనా కొట్టినారా ?”
”లేదు సాద్”
కేసు కాగితాలు ముద్దాయికి ఇవ్వమని చెప్పాడు మేజిస్ట్రెట్ బెంచి క్లర్క్‌తో. అతను కేసు కాగితాలు ముద్దాయికి ఇచ్చి సంతకాలు తీసుకొన్నాడు. పదిహేను రోజుల వరకకి అతన్ని రిమాండ్ రాశాడు మేజిస్ట్రేట్. పోలీసులు అతన్ని తీసుకువెళ్లారు. పదిహేను రోజుల తరువాత రెండున్నర ప్రాంతంలో మల్లయ్యని కోర్టులో మళ్లీ ప్రవేశపెట్టారు పోలీసులు. ”కేసుకి సంబంధించిన కాగితాలు అన్నీ ముట్టినవా ?”
”ముట్టినవి సార్”
”ఫలానా తేదీనాడు విశ్వనాథం ఇంట్లో ముప్పై తులాల బంగారు నగలు దొంగతనం చేశావని, ఆ విషయాన్ని నువ్వు పోలీసుల ముందు ఒప్పుకొన్నావని, నువ్వు చెప్పిన ప్రకారం ఆ సొత్తుని నీ ఇం టి నుంచి నీ సమక్షంలో బరామతు చేశారని పోలీసులు ఫిర్యాదులో ఆరోపించినారు. ఏమంటావు నువ్వు ?” ప్రశ్నించాడు మేజిస్ట్రేట్.
”నిజమే సార్. చేశాను !”
”నేరాన్ని స్వచ్చందంగానే ఒప్పుకొంటున్నావా ?”
”ఇష్టపూర్వకంగానే ఒప్పుకొంటున్నాను సార్ !”
ముద్దాయి మల్లయ్య చెప్పిన సమాధానాలు రాసి క్లర్క్ కిచ్చాడు మేజిస్ట్రేట్, క్లర్క్ ముద్దాయి సంతకాలు తీసుకొన్నాడు. మల్లయ్యకి పద్దెనిమిది నెలల కఠిన కారాగార శిక్షని, సొత్తుని ఫిర్యాదుదారైన విశ్వనాథానికి అప్పీలు కాలపరిమితి దాటిన తరువాత ఇచ్చేయ్యాలని మేజిస్రేట్ తీర్పు రాశారు. ఆ సంగతి మల్లయ్యకి చదివి వినిపిం చాడు. తుఫాను రాకని ముందే పసిగట్టిన జాలరిలా నిల్చున్నాడు మల్లయ్య. మల్లయ్యని పోలీసులు తీసుకొని వెళ్లారు. పోతే పోయాయి ఇరవైవేల రూపాయలు. ముప్పై తులాల బంగారం దొరికిందని సంతోషపడ్డాడు చింతకింది విశ్వనాధం. పొతే పోయాయి ముప్పై వేల రూపాయలు. కొడుకులు ఎలాంటి కేసు లేకుండా బయటప డినారని సంతోషపడ్డారు గంగాధర్, శ్రీను, క్రిష్ణ తల్లి దండ్రులు, సెంట్రల్ జైల్లో మంచి మందులు దొరుకుతయాని సంతోషపడ్డాడు ఆకుసాని మల్లయ్య, పదిహేను రోజుల్లో ”గ్రేవ్ కేసు” పరిష్కారమైందని సంతోషపడుతూ యాభైవేల రూపాయలని తనివితీ రా తడిమాడు ఎస్సై నవ్వుతూ ఎస్సై పక్కన నిల్చున్నాడు హెడ్ కానిస్టేబుల్ రషీద్.
సంతోషపడనిదల్లా మోసపోయిన న్యాయం.