సంక్షేమ పథకాలు – పేదరిక నిర్మూలన
ప్రజల సంక్షేమం కోసమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకో పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పాత పథకాలకు పేర్లు మార్చి కొద్దిపాటి చేర్పులు, మార్పులతో కొత్త పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయి. తమ దోపిడీని నిరంతరాయంగా కొనసాగించడానికి, ప్రజల దృష్టిని తాత్కాలిక అవసరాల మీదే నిలిపేందుకు అనేక వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా, ఏపార్టీ అధికారంలో ఉన్నా పథకాల పేర్లు మారుతున్నాయే తప్ప అమలులో మాత్రం తేడాలు ఉండడం లేదు. సబ్సిడీలను ఒక చేత్తో ఇచ్చినట్లు ఇచ్చి వివిద పన్నులు, చార్జీల రూపంలో మరో చేత్తో అంతకంటే పదుల రేట్లలో డబ్బును ప్రభుత్వాలు లాగేస్తున్నాయి. ఈ పథకాల అమలులోనూ ప్రభుత్వాలకు చిత్తశుద్ది కొరవడింది. అనేక పథకాలను పేరు కోసం మొక్కుబడిగా ప్రారంభించి చేతులు దులుపేసుకుంటున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ పథకం
పేదలకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు 2007లో వైఎస్‌రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. తెల్లరేషన్‌కార్డులున్న ప్రజలంతా ఈ పథకకం కింద లబ్ది పొందడానికి అర్హులే. తాజాగా ఈ పథకాన్ని ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 347 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. 938 రకాల వ్యాధులకు చికిత్స చేసే అవకాశముంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 3500 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ఖర్చు 3.5 శాతమే. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే విషయంలో 175 దేశాలను పరిశీలించగా మనదేశం 171వ స్థానంలో ఉంది. స్థూల జాతీయోత్పత్తిలో 1.2 శాతం మాత్రమే ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఖర్చు పెడుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కనీస వైద్య సేవలు అందని జనాభా 5 కోట్ల 63 లక్షలని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో 66 శాతం జనాభాకు ఎలాంటి వైద్యం అందడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆరోగ్యశ్రీ కార్డులో గుండె జబ్బులు, కేన్సర్, మూత్రపిండాల వ్యాధులవంటి వాటికి చికిత్స అందుతోంది. కానీ రాష్ట్రంలో అత్యధిక అత్యధిక మరణాలకు కారణమవుతున్న డెంగీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడం పేదలకు శాపంగా మారింది. దీంతో ఖరీదైన వైద్యం పొందలేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేగాక ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాసులు కురిపించే ఆపరేషన్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు గర్భసంచి తొలగించే ఆపరేషన్లు అవసరం లేకున్నా చేస్తున్నారు. లాభసాటి కాదనుకున్నప్పుడు ఆపరేషన్లు చేయడం లేదు. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడం కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ 2010లో 15 మందితో ప్రణాళికా సంఘం కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం అమలును అధ్యయనం చేసింది. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు నిధుల కొరత ఎదురైందని, ప్రాథమిక వైద్యం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించింది. అంతేగాక ఇటీవల ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా చికిత్స ఖర్చులు విడుదల చేడం లేదు. ఫలితంగా కొని& ఆస్పత్రుల్లో ముందు డబ్బు చెల్లిస్తేగానీ వైద్యం అందించడం లేదు. ప్రభుత్వానికి నిజంగా పేదల ఆరోగ్యంపై చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయాలి. కొత్త ఆస్పత్రులను నెలకొల్పాలి. బడ్జెట్‌లో ఇందుకు అనుగుణంగా కేటాయింపులు చేయాలి. కానీ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రులను బలహీనం చేస్తూ కార్పొరేట్ ఆస్పత్రులను ప్రోత్సహించడం దీర్ఘకాలికంగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
ఇందిరమ్మ ఇల్లు
ప్రజలకు ఇల్లు తప్పనిసరి ఆవాసం. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలకు సొంత ఇళ్లు లేవు. ఇందులో 32.2 లక్షల కుటుంబాలు పక్కా ఇళ్లు లేకపోవడంతో గుడిసెల్లో, గుడారాల్లో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఉండడానికి ఇళ్లు లేని నిరుపేదలకు ఆ సమస్యను తీర్చేందుకు 2006 మే 7న రంగారెడ్డి జిల్లా బొంపహాడ్ గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరమ్మ పధకాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ పూర్తి అర్థంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ‘ఇందిరా ఆవాస్ యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏటా 2 లక్షల 75 వేల ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంటుంది.ఈ పథకం కింద ఇచ్చే నిధులను రాష్ట్రానికే ఇస్తే ఇంకా తక్కువ ధరకే ఇళ్లు నిర్మిస్తామని అప్పట్లో కేంద్రానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులను కలిపిప్రారంభించిన పథకమే ఇందిరమ్మ ఒక్కో ఇంటికి బిసిలు, ఇతరులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి మూడు దశల్లో 39,000 రూపాయలు ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 50,000 రూపాయలు మంజూరు చేస్తోంది.
– సిరసనగండ్ల సాహితి, సూత్రపు అనిల్
తరువాయి భాగం రేపటి సంచికలో….