విప్లవం కాదు వినాశనమే
జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. అయితే ఈ పంటలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని కూడా చెప్పారు. వ్యవసాయ విప్లవం సృష్టిస్తుందని చెప్తున్న జన్యుమార్పిడిపై ప్రజల్లో ఎందుకు సందేహాలు నెలకొన్నాయి. జన్యుమార్పిడి విత్తనాల ప్రవేశం తర్వాత ఎలాంటి పరిణామాలను రైతులు ఎదుర్కొన్నారు. ఎందుకు ఈ పంటలను వ్యతిరేకిస్తున్నారు? అనేదానిపై ఇంతవరకూ సమగ్రమైన చర్చ జరుగకపోగా బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన జీవవైవిధ్య సదస్సులో జన్యుమార్పిడి పంటలపై కొంత వరకు చర్చ జరిగినా అది ఆ పంటలకు అనుకూల ధోరణిలోనే సాగింది. జన్యుమార్పిడి విధానంతో మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించిన పంట పత్తి. బోల్‌గార్డ్ టెర్మినేటర్ (బీటీ) పత్తి భారతీయ వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి దశాబ్దం కావస్తోంది. బీటీ, బీటీ`2 రకం పత్తి విత్తనాల కోసం ఇప్పుడు రైతులు ఎగబడుతున్నారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన పత్తి విత్తనాలతో వేసిన పంటలకు పచ్చ పురుగుతో పాటు వివిధ రకాల చీడపీడలు ఆశించేవి. బీటీ విత్తనాలతో ఆ తెగుళ్లు, చీడల నుంచి రైతులకు కాస్త విముక్తి లభించిందనే చెప్పాలి. కానీ బీటీ విత్తన సంస్థలు ఇష్టారాజ్యంగా సీడ్ ధరలను పెంచేశాయి. దేశీయ పరిజ్ఞానం గల విత్తన కంపెనీలతో వేసిన పత్తి చేల నుంచే రైతులు విత్తనాలను తయారు చేసుకోవచ్చు. కానీ బీటీ పత్తి పంట నుంచి విత్తనాలు తయారు చేసుకునే అవకాశం లేదు. బీటీ కంపెనీలు ప్రత్యేకంగా విత్తన తయారీ కోసం క్షేత్రాలను ఏర్పాటు చేసుకొని, వాటిద్వారానే విత్తనాలు సేకరించి విక్రయిస్తుంది. ఇలా విక్రయించే విత్తనాలకు కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా ధర పెంచుతూ పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తేనే ఒక్కో ప్యాకెట్‌కు రైతులు రూ.1250 వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. అంటే సబ్సిడీ లేకుంటే రైతులు ఒక్కో ప్యాకెట్‌కు రూ.2500 వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. వచ్చే సంవత్సరం ఇదే ధర ఉంటుందనే నమ్మకం లేదు. విత్తన సంస్థలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అవి చెప్పిన ధరకే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సిందే. బీటీ విత్తనాల సాగుకు అలవాటు పడిన రైతులు దేశీయ కంపెనీలు తయారు చేసే విత్తనాలపై ఆసక్తి చూపడం లేదు. వాటికి చీడపీడలు సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో మొత్తంగా పెట్టుబడి కూడా పెరుగుతుంది. కానీ ఆ పంటలతో మానవాళికి పెద్దగా నష్టమేమీ ఉండబోదు. అదే బీటీ పత్తి వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలే పేర్కొన్నారు. ఆ పత్తితో ఉత్పత్తి చేసే వస్త్రాల వల్ల మనుషులకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ నష్టాలను పూడ్చుకునేందుకు అనివార్యంగా బీటీ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. జన్యుమార్పిడిని ఆధారంగా చేసుకుని బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నాయి. జన్యుమార్పిడి పంటల వైపు రైతులను ఆకట్టుకునేందుకు బహుళజాతి కంపెనీలు వివిధ రకాల ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. తాము తయారు చేసే విత్తనాలు వాతావరణ పరిస్థితులను, నీటి ఎద్దడిని, చీడపీడలను ఎదుర్కొంటాయని చెప్తూ మార్కెట్‌లోకి దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత ప్రభుత్వం ప్రపంచ మార్కెట్‌కు తలుపులు బార్లా తెరిచి బహుళజాతి సంస్థ కొమ్ము కాస్తోంది. కేంద్రంలో అధికారం మారుతుందే తప్ప పార్టీల విధానాలు మాత్రం మారడం లేదు. ఫలితంగా బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యం వ్యవసాయరంగంలో పెట్రేగి పోతుంది. జన్యుమార్పిడి పంటల పేరుతో వ్యవసాయ ఉత్పత్తులను దేశీయ వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. భారతీయ శాఖాహార వంటకాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన వంకాయను కూడా జన్యుమార్పిడి చేస్తామని ప్రకటించారు. దీన్ని దేశం మొత్తం ఏకమై అడ్డుకుంది. ఆహార ఉత్పత్తుల్లోనూ జన్యుమార్పిడికి ఆయా సంస్థలు ఉవ్విళ్లూరుతుండగా సర్కారు కూడా పచ్చజెండా ఊపుతోంది. బలమైన ప్రజా ఉద్యమాలతో ఆ యత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు జన్యుమార్పిడి పంటలపై నియంత్రణలు విధిస్తుండగా, భారత్ మాత్రం వాటికి ఎర్ర తివాచీ పరుస్తోంది. జన్యుమార్పిడి మొక్కజొన్నలపై రష్యా వేటు వేసింది. జన్యుమార్పిడి మొక్కజొన్నలో ప్రొటీన్ల శాతం తగ్గి పిండిపదార్థాలు హెచ్చుగా ఉన్నాయి. ఆ మొక్కజొన్నతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వస్తున్నట్లుగా గుర్తించిన రష్యా దతానిని నిషేధించింది. అమెరికన్ జీఎం మొక్కజొన్నపై సమగ్ర పరిశోధనల తర్వాత రష్యా నిషేధం విధించింది. అలాంటి ఆహార ఉత్పత్తులకు భారత్ ఆహ్వానం పలుకుతోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం సాధ్యమంటూ చెప్తున్నాడు. జన్యుమార్పిడి పంటల వల్ల తలెత్తే వినాశనాలను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల ప్రజలు, రైతుల్లో మరిన్ని అపోహలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. దేశంలో బీటీ, జీఎం పంటలను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా సర్కారు మాత్రం వాటిని దేశంలోకి తెచ్చి తీరుతామని పట్టుపడుతోంది. దీనిపై చర్చ జరగాల్సిన సమయంలో విప్లవం సాధ్యమంటూ చెప్పడం, వినాశకర పరిణామాలు తొక్కిపెట్టాలని చూడటం ప్రభుత్వానికి తగదు.