పట్టుమని పది రోజుల్లో తెలంగాణ

సీమాంధ్రుల కుట్రలు సాగవ్‌ : జానారెడ్డి

ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు : పాల్వాయి

లీకులెందుకు ఇచ్చారో చెప్పండి : పొన్నం

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) :

ఎవరెన్ని కుట్రలు పన్నినా పట్టుమని పది రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుందని మంత్రి జానారెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు జానారెడ్డితో సమావేశమయ్యారు. పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్‌రావు మృతిపై నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఇందులో చర్చించారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వారం, పది రోజుల్లో స్పష్టమైన ప్రకటన రానుందని ఆయన అన్నారు. తెలంగాణపై కోర్‌ కమిటీలో చర్చించిన అంశాలు బయటకు వెల్లడించడం నైతికత కాదని ఆయన అన్నారు. ఈ అంశాలను వెల్లడించడం బాధ్యతా రహిత్యమని ఆయన మండిపడ్డారు. కోర్‌ కమిటీ సమావేశంలోని విషయాలు వెల్లడికావడంపై పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహంగా ఉందని జానారెడ్డి తెలిపారు. కోర్‌కమిటీ విషయాల వెల్లడిపై మీడియాలో రావడంతో ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం ఉందని జానారెడ్డి తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసైనా తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ ఇవ్వకుంటేనే నక్సల్స్‌ సమస్య తలెత్తుతోందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం తెలంగాణపై బిల్లు పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాలని యోచిస్తోందని అన్నారు. కేంద్రం తెలంగాణపై ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే నక్సల్స్‌ సమస్య వస్తుందని చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటేనే నక్సల్స్‌ సమస్య ఎక్కువవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కోసం ప్రాంతాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసిఉండటంలో తప్పులేదన్నారు. కోర్‌కమిటీలో చర్చించిన అంశాలు బయటకు పొక్కిన విషయం అధిష్టానానికి చేరిందని ఆయన అన్నారు. సమాచారాన్ని లీక్‌చేసిన నేతలపై అధిష్టానం అసహనంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కోర్‌కమిటీలో చర్చించిన అంశాలు వెల్లడికావడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ వార్తలను వారు ఖండించాలని, ఖండించకపోతే వచ్చిన ఆరోపణలు అంగీకరించినట్టేనని ఆయన అన్నారు. తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని అధిష్టానం ఒక వైపు చెబుతున్నా సీమాంధ్ర నేతలను ఢిల్లీకి పంపించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర నేతలను సీఎం రెచ్చగొడుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో రాష్ట్రప్రభుత్వం పారదర్శకత పాటించాలని ఆయన కోరారు. లేకుంటే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసినట్టేనని పొన్నం అన్నారు.