సీమాంధ్ర మీడియా ‘ఇందిర’ కథనాలపై… చాచా మాటే ఫైనల్‌

నెహ్రూ మాటకు కట్టుబడేందుకు సోనియా నిర్ణయం

విలీనం రోజే నెహ్రూ నోట విడాకుల మాట

మంచైనా, చెడైనా జరగొచ్చు.. అయిష్టంగానే ఆంధ్రప్రదేశ్‌

బర్త్‌డే కానుకగా తెలంగాణ

హామీ ఇచ్చి వెనక్కిపోలేం కదా?

కోర్‌ కమిటీలో సోనియా

ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్‌ స్టేట్‌పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందుకే ఇందిరా వెనక్కు తగ్గింది

హైదరాబాద్‌, జూలై 21 (జనంసాక్షి) :

విభజనవాదం, వేర్పాటువాదం పేరుతో సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతూనే ఉంది. తమ అభిప్రాయాన్నే ప్రజల అభిప్రాయంగా చెలమణీ చేసేందుకు అడ్డదారులన్నీ తొక్కుతోంది. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ ఉద్యమానికి వక్రభష్యాలు చెప్తోంది. స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం పది జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడమే సోకాల్డ్‌ మీడియా పని. తెలంగాణ అడిగిన వారిని రాజ్యం హత్య చేయించినా దానికి పత్రికల్లో దక్కిన స్థానం బహు స్వల్పమే. రాజ్యం వివిధ పేర్లతో తెలంగాణవాదులను అంతమొందించినా నాటి పత్రికలు తమ బాధ్యతను గుర్తెరగలేదు. పది జిల్లాల ప్రజలు ఒకే గొంతుకతో తెలంగాణ కావాలని కోరుతున్నా వారి ఆంకాక్షలను ప్రతిఫలింపచేయలేదు. నాలుగున్నర కోట్ల గొంతుల రణనిన్నాదం ఢిల్లీ గద్దెను గడగడలాడించి ప్రత్యేక రాష్ట్ర సాధన వైపు నడిపిస్తున్న తరుణంలో సీమాంధ్ర మీడియా భూతం జడలు విప్పింది. అబద్ధాలు, అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రజల మనసుల్లో విషం చొప్పించజూస్తోంది. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమైక్యాంధ్రవైపు మొగ్గు చూపారంటూ ఓ పుక్కిటి పురాణాన్ని జన బహుల్యంలోకి వదిలింది. కానీ హైదరాబాద్‌ స్టేట్‌ పిటిషన్‌ అప్పటికే ఐక్యరాజ్యసమితిలో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని తొక్కిపెట్టారు. హైదరాబాద్‌ ప్రత్యేక దేశమని, ఆపరేషన్‌ పోల్‌తో తమపై దురాక్రమణ జరిగిందని నిజాం నవాబు యూఎన్‌లో వేసిన పిటిషన్‌పై నిర్ణయం జరుగలేదు. అందుకే 1969లో ఉద్యమం అంత ఉధృతంగా సాగినా ఇందిరాగాంధీ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదు.

1947 ఆగస్టు 15. ఇప్పుడున్న భారత దేశానికి స్వతంత్రం సిద్ధించిన రోజు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకూ ఆరోజే స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాలుండేవి. బ్రిటిష్‌ రూల్డ్‌ ఇండియాలోని 556 సంస్థానాలు కలిసి భారత దేశం ఆవిర్భవించింది. హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కాలేదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరున్న అసఫ్‌జాహీ నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగానే కొనసాగిస్తానని ప్రకటించాడు. దక్కన్‌ రాజ్య అభివృద్ధి కోసం దూర దృష్టితో బృహత్‌ ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లో అధికారం చెలాయిస్తున్న దేశ్‌ముఖ్‌లు ప్రజలపై పడి దురాగతాలు సాగించడం, వారికి ఖాసీంరజ్వీ నేతృత్వంలోని రాజాకార్లు అండదండలందించడంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలంతా భారత్‌లో విలీనం కావాలని కోరుకోవడంతో భారత సర్కారు సైనిక చర్యకు ఉపక్రమించడం. విలీనానికి మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అంగీకరించడంతో 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ భారత్‌లో విలీనమై ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. 1956 అక్టోబర్‌ నెలాఖరు వరకూ హైదరాబాద్‌ స్టేట్‌గానే ఉంది. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికిన సీమాంధ్రులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఈ డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశాక కర్నూల్‌ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కార్యాలయాల నిర్వహణకు కనీసం భవనాలు లేని దుస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కన్ను అత్యంత సంపన్నమైన హైదరాబాద్‌పై పడింది. కుట్ర రాజకీయాలకు మొదటి నుంచి పెట్టింది పేరుగా ఉన్న ఆంధ్ర నేతలు ఢిల్లీలో చక్రం తింపారు.

భాషాప్రయోక్త రాష్ట్రాల పేరుతో తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని కుట్ర చేశారు. దీనిని ఆ రోజే పసిగట్టిన అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆంధ్ర కుతంత్రాలు, కుయుక్తులపై ముందే హెచ్చరించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన వీలనసభలో నెహ్రూ మాట్లాడుతూ జిత్తులమారి అబ్బాయికి (ఆంధ్ర), అమాయకురాలైన అమ్మాయితో (తెలంగాణ) వివాహం జరిపిస్తున్నాం. ఇది మంచైనా చేయొచ్చు లేదా చెడూ తెచ్చపెట్టవచ్చు. తెలంగాణ కావాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించచ్చు. అంటూ విలీనం రోజే విడాకుల మంత్రం చదివారు చాచా నెహ్రూ. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటును నెహ్రూ సీమాంధ్ర కుట్రగా అభివర్ణించారు. నెహ్రూ చెప్పినట్లుగానే జిత్తులామారి ఆంధ్ర తెలంగాణను అన్నింటా దోపిడీ చేసింది. ఏ భాష పేరుచెప్పి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డారో అదే తెలంగాణ భాషను, యాసను అన్నింటా అవమానించారు. అవహేళన చేశారు. విలీనానికి రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించారు. తెలంగాణను అడుగడుగునా అమానించారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ ప్రజలు 1969లోనే ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమించారు. ఆ ఉద్యమంలో తెలంగాణ గడ్డ 369 మంది ఉజ్వల భవిత ఉన్న యువతను కోల్పోయింది. ఆ తర్వాత తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావును ముఖ్యమంత్రిని చేస్తే సీమాంధ్ర శక్తులన్నీ కూడా జై ఆంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఆయన్ను గద్దె దింపాయి. ఈ రెండు సందర్భాల్లో ఇందిరాగాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే కట్టుబడ్డారని, ఇప్పుడు సోనియాగాంధీ అత్తమాటను కాదని రాష్ట్రాన్ని విడదీసేందుకు మొగ్గు చూపుతున్నారని సీమాంధ్ర మీడియా అబద్ధాలు వల్లిస్తూ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. కానీ ఇందిరాగాంధీ ఆ సమయంలో విభజనపై నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం హైదరాబాద్‌ స్టేట్‌ అదివరకే ఐక్యరాజ్యసమితిలో దాఖలు చేసిన పిటిషన్‌. ఆ పిటిషన్‌ కారణంగానే ఇందిర నిర్ణయం తీసుకోలేకపోయారు తప్ప ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలనే ఏకైక ఎజెండాతో కాదు. ఇప్పుడు సోనియాగాంధీ విలీన సభ రోజు తన తాత చాచా నెహ్రూ చెప్పిన విడాకుల మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్రాన్ని తన జన్మదిన కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 9లోపు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు. హామీ ఇచ్చి వెనక్కు తీసుకోలేం కదా అని చెప్తూ తెలంగాణ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.