నేడే స్థానిక సమరం


5,803 పంచాయతీలకు పోలింగ్‌
వరద బాధిత 299 గ్రామాల్లో వాయిదా
18 పంచాయతీలకు వేలం వేసినట్లుగా గుర్తింపు
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌
హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి) :
సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధంమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి రాష్ట్రంలోని 5,803 పంచాయతీలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఉదయం ఏడు గంటలకు తొలివిడత పోలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. సాయంత్రం లోగా గెలుపొందిన వారి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఉప సర్పంచ్‌ ఎన్నిక జరగనున్నదని తెలిపారు. మంగళవారం 5,803 పంచాయతీలలో సర్పంచ్‌ పదవులకు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నిక జరగనున్నదని అన్నారు. తొలి విడత పోలింగ్‌ జరగనున్న గ్రామ పంచాయతీలలో 722 ఏకగ్రీవం అయ్యాయన్నారు. వరద ప్రభావిత గ్రామాలలో ఎన్నికను వాయిదా వేసినట్లు చెప్పారు. మొత్తం 299 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని, వాటిని ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. పలు కారణాల వల్ల 18 పంచాయతీలలోని ఎన్నికలను రద్దు చేశామన్నారు. అక్కడ పాలకవర్గాల ఎన్నిక కోసం వేలం పాట నిర్వహించినట్లు తేలిందన్నారు. మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసి వాటిల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గ్రామ పంచాయతీల ఎన్నికను వాయిదా వేశామన్నారు.
ఓటు వేయండిలా..
ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లబోయేముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి తెలుసుకుందాం.
– అధికారులు ఇచ్చిన ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపుకార్డు తీసుకెళ్లాలి
– బ్యాలెట్‌ పేపరులో గులాబి రంగు ఉన్నది సర్పంచును ఎన్నుకునేందుకు.. తెలుపు రంగు ఉన్నది వార్డు సభ్యుడ్ని ఎన్నుకునేందుకు అని గమనించాలి.
– మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంటలోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
– ఓటర్ల జాబితాలో పేరు సరిగ్గానే ఉన్నా.. ఫొటోలో తేడా వస్తే గుర్తింపు కార్డుల్లో ఏదొకదానిని పరిగణనలోకి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.
– పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.