ప్రశాంతంగా పోలింగ్‌

పార్టీపరం కాకున్నా తమదే ఆధిక్యమంటున్న పార్టీలు

తమకు సంబంధం లేదంటున్న అభ్యర్థులు

హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) :

పంచాయతీ తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 82.31 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, పలు జిల్లాల్లో చదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే గ్రామ పంచాయితీ తొలివిడత పోలింగ్‌ ముగిసిందని అన్నారు. మంగళవారం తాజాగా 11 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు వాయిదా పడ్డాయని అన్నారు. అదిలాబాద్‌ జిల్లాలో ఏడు గ్రామ పంచాయతీల్లోనూ, విశాఖ జిల్లాలో నాలుగు గ్రామాల్లోనూ ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం వాయిదా వేశామన్నారు. ఆ పంచాయతీలలో ఈనెల 31న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే, ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలవల్ల 24 పంచాయతీలలో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడిందని అన్నారు. అధికారులు, సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోవడంవల్ల పోలింగ్‌ జరగలేదన్నారు. 24 పంచాయతీలలో 31న పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. విశాఖ జిల్లా జి.కె.వీధి మండలం దేవరపల్లి పంచాయతీలో బ్యాలెట్‌ పత్రంలో చిహ్నాల తప్పిదంవల్ల వాయిదా పడినట్లు తెలిపారు. అలాగే, కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరంలో బ్యాలెట్‌ పత్రంలో చిహ్నాల తప్పిదంవల్ల వాయిదా పడినట్లు చెప్పారు. అదే విధంగా అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురంలో బ్యాలెట్‌ పత్రాల ముద్రణ లోపంవల్ల వాయిదా పడినట్లు తెలిపారు. పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తవగా, అప్పటికే క్యూలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌ 106, టీడీపీ 148, వైఎస్సార్‌ సీపీ 52, ఇతరులు 30 చోట్ల విజయం సాధించారు. విజయనగరంలో కాంగ్రెస్‌ 140, టీడీపీ 79, వైఎస్సార్‌ సీపీ 81, వామపక్షాలు 19, ఇతరులు 41 పంచాయత్లీ విజయఢంకా మోగించారు. విశాఖపట్నంలో కాంగ్రెస్‌ 53, టీడీపీ 33, వైఎస్సార్‌ సీపీ 73, వామపక్షాలు 11, ఇతరులు 40 చోట్ల, తూర్పుగోదావరిలో కాంగ్రెస్‌ 67, టీడీపీ 90, వైఎస్సార్‌ సీపీ 86, వామపక్షాలు 5, ఇతరులు 38 స్థానాల్లో విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ 70, టీడీపీ 133, వైఎస్సార్‌ సీపీ 55, ఇతరులు 51, కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌ 44, టీడీపీ 124, వైఎస్సార్‌ సీపీ 72, వామపక్షాలు 1, ఇతరులు 23 పంచాయతీల్లో, గుంటూరు జిల్లాలో కాంగ్రెస్‌ 39, టీడీపీ 139, వైఎస్సార్‌ సీపీ 84, ఇతరులు 74, ప్రకాశంలో కాంగ్రెస్‌ 55, టీడీపీ 128, వైఎస్సార్‌ సీపీ 78, ఇతరులు 58, నెల్లూర్‌లో కాంగ్రెస్‌ మద్దతుదారులు 109, టీడీపీ 91, వైఎస్సార్‌ సీపీ 108, ఇతరులు 45 చోట్ల గెలుపొందారు. కర్నూల్‌లో కాంగ్రెస్‌ 123, టీడీపీ 55, వైఎస్సార్‌ సీపీ 71, ఇతరులు 49, కడప జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 65, టీడీపీ 24, వైఎస్సార్‌ సీపీ 142, ఇతరులు 49, చిత్తూర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 52, టీడీపీ 142, వైఎస్సార్‌ సీపీ 99, ఇతరులు 62, అనంతపురం కాంగ్రెస్‌ 70, టీడీపీ 165, వైఎస్సార్‌ సీపీ 99, ఇతరులు 15, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 43, టీడీపీ 78, వైఎస్సార్‌ సీపీ 13, ఇతరులు 37 చోట్ల గెలుపొందారు. మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ 73, టీడీపీ 40, టీఆర్‌ఎస్‌ 143, ఇతరులు 37చోట్ల గెలుపొందారు. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 84, టీడీపీ 62, టీఆర్‌ఎస్‌ 48, వైఎస్సార్‌ సీపీ 3, ఇతరులు 87 చోట్ల విజయం సాధించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ 113, టీడీపీ 46, టీఆర్‌ఎస్‌ 63, వైఎస్సార్‌ సీపీ 3, ఇతరులు 60, వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 46, టీడీపీ 49, వైఎస్సార్‌ సీపీ 10, టీఆర్‌ఎస్‌ 72, ఇతరులు 35 చోట్ల విజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ 98, టీడీపీ 53, టీఆర్‌ఎస్‌ 89, వామపక్షాలు 14, వైఎస్సార్‌ సీపీ 8, ఇతరులు 66, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 171, టీడీపీ మద్దతుదారులు 144, వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు 99, టీఆర్‌ఎస్‌ 12, వామపక్షాలు 3, ఇతరులు 91 పంచాయతీల్లో విజయం సాధించారు. కాగా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను తమ పార్టీ వారు అని చెప్పుకునేందుకు అన్ని పార్టీలు ఉత్సాహం చూపాయి. అయితే పలువురు అభ్యర్థులు తాము స్వతంత్రంగా గెలిచామని, ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పుకున్నారు.