నో! నెవర్‌!! ఆరు నూరైనా తెలంగాణ ఇచ్చేస్తున్నాం

సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పిన సోనియా

రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?

2009 డిసెంబర్‌ 7న సీఎల్పీ తెలంగాణ ఏకగ్రీవ తీర్మానం చేశారు కదా?

2003లో 41 మంది ఎమ్మెల్యేలు లేఖ కూడా ఇచ్చారు

నా పుట్టిన రోజు కానుకగా పార్లమెంట్‌లో ప్రకటన చేశాం

ఎలా వెనక్కి పోతాం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :

‘ఆరు నూరైనా తెలంగాణ ఇచ్చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు మీరంతా ఒప్పుకున్నవారే కదా ఇప్పుడేంటి అభ్యంతరం? తెలంగాణ ఏర్పాటుకు మీరు వ్యతిరేకం అయితే 2009 డిసెంబర్‌ 9న సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూంటే ఎందుకు ప్రేక్షకపాత్ర వహించారు. 2003లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 41 మంది అధిష్టానానికి లేఖ ఇచ్చారు కదా? అప్పుడేం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు ఎందుకు ఊరుకున్నారు. నా పుట్టిన రోజు కానుకగా 2009 డిసెంబర్‌ 10న పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాం కదా? ఇప్పుడు ఎలా వెనక్కి పోతాం’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలంగాణ ఏర్పాటు దిశగా పార్టీ నిర్ణయం తీసుకోవడంలో సీమాంధ్ర పాత్రపై ఆమె సూటి ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం.. ఇక మీరు ఏం చేసుకున్నాం వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చిచెప్పారు. ఆమె ప్రశ్నల జడివాన కురిపిస్తుంటే సీమాంధ్ర నేతలు నోళ్లు తెరిచి చూస్తూ ఉండిపోయారు. ఈ విషయాన్ని మంత్రుల క్వార్టర్స్‌ వేదికగా బుధవారం నిర్వహించిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో వారే బహిర్ఘత పరిచారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవడమే తరువాయి కావడంతో ఇప్పుడు ఎలాంటి చర్యల ద్వారా అధిష్టానాన్ని నిలువరించవచ్చో మంత్రులు చర్చించారు. సీమాంధ్ర మంత్రుల్లో పలువురు వివిధ వ్యాపారాల మాటున అక్రమంగా కూడబెట్టిన వారే. ఇప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి పార్టీ పదవులు వదులుకుంటే అధిష్టానం ఎంత తీవ్ర చర్యలకు దిగుతుందో తెలియక సతమతమవుతున్నారు. పార్టీని ధిక్కరించి ముందుకెళ్తే తలెత్తే పరిస్థితులు ఇప్పటికే స్పష్టం కావడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి ఎలాగైనా సమైక్యాంధ్ర ఉంచేలా చూడాలని కోరారు. అయితే అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పదవికి రాజీనామా చేస్తానంటూ లీకులిచ్చిన ముఖ్యమంత్రిని సోనియాగాంధీ పిలిచి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడటం తప్ప ఏమి చేయలేమని కిరణ్‌ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ధిక్కరిస్తే తలెత్తే పరిణామాలను కూడా సీఎం మంత్రుల ముందు ఉంచినట్లు తెలిసింది. సీమాంధ్ర ప్రజలు కూడా సమైక్యాంధ్రకు మద్దతు పలకని పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని సీఎం సూచించినట్లు తెలిసింది. చివరి ప్రయత్నంగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా ఏఐసీసీ పెద్దలను కలిసి తమ డిమాండ్లను పెట్టనున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సోనియాగాంధీ ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్‌ విభజనకే సోనియాగాంధీ మొగ్గు చూపుతున్నారు. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు. హోంశాఖ అధికారులంతా ఇప్పుడు రక్షణ వ్యవహారాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విభజన పనుల్లోనే తలముఖలయ్యారు. వంద రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని ఇప్పటికే హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేను ఆదేశించారు. ఈమేరకు తమ శాఖ ముఖ్యులను పురమాయించిన షిండే ఏర్పాటుకు సంబంధించిన అధికారిక వ్యవహారాలను స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.