తెలంగాణ భూముల ఫైళ్లు కాలబెడుతుండ్రు


కొసకొచ్చినప్పుడంతా సీమాంధ్రులు అడ్డుకుంటుండ్రు
తెలంగాణ సాధించే వరకూ పోరు ఆగదు
ఆగస్టు 1న ఇందిరాపార్క్‌ ధర్నా : కోదండరామ్‌
హైదరాబాద్‌, జులై 24 (జనంసాక్షి) :
సీమాంధ్ర శక్తులు తెలంగాణ భూముల ఫైళ్లు కాలబెడుతున్నరని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌  ఆరోపించారు. రాష్ట్ర విభజన అనివార్యం కావడంతో సచివాలయంలో ఫైళ్లు తగులబెడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని బుధవారం ఆయన మండిపడ్డారు. తెలంగాణ భూములకు సంబంధించిన ఫైళ్లను తగులబెడుతున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ వస్తుందని అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొందరు సీమాంధ్ర నేతలు విభజన జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు లాభమే అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధంగా తీర్చుకోవచ్చునన్నారు. సీమాంధ్ర నేతలు సభ పెట్టుకోవచ్చునని అయితే, అనాగరికంగా తెలంగాణను మాత్రం అడ్డుకోవద్దన్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడ వద్దన్నారు. వర్షాల కారణంగా జన చైతన్యయాత్ర వాయిదా పడిందన్నారు. గురువారం నిర్వహించ తలపెట్టిన ధర్నాను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా ఉంటుందని చెప్పారు. మూడు దశల ఎన్నికలు ముగిశాక పంచాయతీ ఎన్నికలపై స్పందిస్తానని చెప్పారు. ఎపిఎన్జీవోలకు సమ్మె చేసుకునే హక్కు ఉందని టీఎన్జీవో నేత దేవిప్రసాద్‌ అన్నారు. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణను అడ్డుకునే కుట్ర చేస్తే మాత్రం తాము తగిన సమాధానం చెబుతామన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అనవసర భయాలు సృష్టించవద్దన్నారు. జన చైతన్య యాత్రను ప్రస్తుతం వాయిదా వేసినట్లు చెప్పారు. ఆగస్టు ఒకటిన ధర్నా తర్వాత యాత్రపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణపై త్వరగానిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కాలయాపన లేకుండా కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటన చేయాలన్నారు.