ఏం హామీ లభించిందని?

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడంతో మళ్లీ అయారాం, గాయారాంల కప్పదాటు యత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఒనగూరే ప్రయోజనాలు, తెలంగాణ ఇవ్వకుంటే వాటిల్లే నష్టం, సమైక్యాంధ్రను కొనసాగిస్తే కాంగ్రెస్‌ పార్టీకి లాభించే అంశాలు, ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే పార్టీకి తలెత్తే నష్టాలపై రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసి అందజేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆదేశించారు. ఈనెల 12న కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన భేటీ అయింది. మొట్టమొదటి సారిగా కోర్‌కమిటీ భేటీకి హాజరైన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ అంశానికి ఏదో ముగింపు ఇవ్వడం కంటే సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాని సైతం రాహుల్‌ వాదనతో ఏకీభవించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను యథాతథంగా వివరించగా, మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ కాస్త అటూఇటూగా రాహుల్‌కు జై కొట్టినట్లు సమాచారం. ఇక సీమాంధ్ర ప్రతినిధులుగా చెలామణీ అవుతున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు రోడ్‌ మ్యాప్‌ కంటే తెలంగాణ ఏర్పాటు వల్ల నక్సల్స్‌ సమస్య తీవ్రమతుందనే ఆరోపణలతో కూడిన ఓ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇందరు ఇన్ని చెప్పినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని తేల్చిచెప్పినట్లు ఈ ప్రాంత నేతలు పేర్కొంటున్నారు. ఒకవైపు ముంచుకొస్తున్న 2014 సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతున్న పార్టీ పరిస్థితి సోనియాను ఈ దిశగా నిర్ణయానికి పురిగొలిపినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్న సోనియాగాంధీ తెలంగాణ సమస్యకు ముగింపు పలకకుంటే అది సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చింది. అందుకే నాలుగు దశాబ్దాలుగా ప్రజలెన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణపై తేల్చని కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు ఓట్లు, సీట్ల కోసం ఈ సమస్యను పరిష్కరించాలని సంకల్పించింది. కాంగ్రెస్‌ పార్టీకి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని మాత్రం తెలంగాణ ఉద్యమమే కల్పించింది. తెలంగాణపై తేల్చకుంటే ఈ ప్రాంతంలో పార్టీకి పుట్టగతులుండవని గుర్తించిన సోనియాగాంధీ ఎవరెన్ని చెప్పినా వినకుండా నిర్ణయం దిశగా ముందడుగు వేశారు. సీఎం, డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ సమర్పించిన రోడ్‌ మ్యాప్‌లపై రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ మీటింగ్‌ మినిట్స్‌ను సీడబ్ల్యూసీ సమావేశంలో పెట్టి పార్టీ పరంగా నిర్ణయం తీసుకోకున్నట్లు దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. ఈనెలాఖరులోగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈమేరకు ఏఐసీసీ కార్యాలయం, సోనియాగాంధీ నివాసం టెన్‌ జన్‌పథ్‌ నుంచి మీడియాకు లీకులందాయి.  అయితే తెలంగాణపై ఏఐసీసీ వర్గాల నుంచి మీడియాకు లీకులందడం ఇదే మొదలు కాదు. ఆఖరు కాకపోవచ్చు కూడా. గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూల్‌, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంలాంటి ప్రత్యామ్నాయాలు కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద ఉన్నాయంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. తెలంగాణ ఇస్తే ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడా మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిపోతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు సీమాంధ్ర నేతలు ఈ మధ్య అడ్డంగా మాట్లాడుతున్నారు. మావోయిస్టుల సమస్య ఎంతమాత్రం శాంతిభద్రతల సమస్య కాదని, ఇది సామాజిక ఆర్థిక సమస్య అని 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తర్వాత చర్చల పేరుతో మావోయిస్టులను అడవుల నుంచి బయటికి రప్పించి, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండగానే బూటకపు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులను మట్టుబెట్టింది. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై గతంలో ఎన్నోమార్లు హామీలిచ్చి తప్పింది. అలాంటి పార్టీ ఇప్పుడు తెలంగాణ పేరుతో కాస్త హడావుడి చేస్తోంది. ఈ హడావుడి నిర్ణయం దిశగా సాగేట్లుగా సంకేతాలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో తీర్మానం కూడా పెట్టకముందే కాంగ్రెస్‌ వైపు ఇప్పుడు కొందరు నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ తెలంగాణపై జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ పార్టీని వీడిన పెద్దపల్లి ఎంపీ వివేకానంద మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. కేవలం వివేక్‌ పార్టీ వీడటంతోనే ఈ ఫిరాయింపుల పర్వానికి తెరపడేలా కనిపించడం లేదు. మొత్తంగా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయించేలా ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఇలాంటి అయారాం గయారాం వల్లే తెలంగాణ ఉద్యమం ఇలా అయింది. ఇప్పటికైనా తెలంగాణవాదులు దృఢచిత్తంతో నిలిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుంది.