రాజీనామాల స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ కిరణే

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
నిజామాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :
సీమాంధ్ర నాయకుల రాజీనామాలకు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. నిజామబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ సాగదీస్తే సాగనంపుతాం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సారి తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. సీమాంధ్ర రాజకీయ శక్తులు ఈ దశలోనూ తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటే స్థానిక కాంగ్రెస్‌ నేతలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ తేల్చకపోతే ఈ ప్రాంతం నుంచి సాగనంపి తీరుతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మంచి తనాన్ని అశక్తతగా తీసుకుంటే దానికి పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తప్ప తాము కాంగ్రెస్‌ పార్టీని నమ్మబోమని అన్నారు. అప్పటి వరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.