మా వైఖరి స్పష్టం చేస్తున్నాం


మీ పార్టీకి తెలంగాణపై వైఖరేది
వైకాపాను నిలదీసిన బొత్స
న్యూఢిల్లీ, జులై26 (జనంసాక్షి) :
తెలంగాణపై మా పార్టీ స్పష్టం చేస్తున్నాం, తమపై ఆరోపణలు చేసేముందు మీ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను నిలదీశారు. తెలంగాణపై పార్టీ పరంగా నిర్ణయం జరిగిందని అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు సంసిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, కేంద్ర మంత్రి ఆజాద్‌ సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్సతో వార్‌ రూమ్‌ భేటీ అనంతరం వారు వెల్లడించిన అభిప్రాయాలను బట్టి కాంగ్రెస్‌ ఓ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. భేటీ అనంతరం బొత్స మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం చెప్పేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు ఉంటాయన్నారు. వైకాపా తన వైఖరి చెప్పకుండా నాటకాలు ఆడుతోందన్నారు. ముందుగా ఆ పార్టీ తన వైఖరిని చెప్పకుండా రాజీనామాలు ఆడుతోందని అన్నారు.తెలంగాణపై నిర్ణయం చెప్పేందుకే తమ పార్టీ అధిష్టానం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని, వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ డ్రామాలు ఆపాలని బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. కాంగ్రెసు పార్టీ వార్‌ రూమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్‌ సింగ్‌, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. త్వరలో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు ఉంటాయన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామాలతో డ్రామాలు ఆడుతోందన్నారు. వారు డ్రామాలు ఆపి తెలంగాణపై తమ పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ పార్టీలకు రాజీనామాలతో పనేమిటని ప్రశ్నించారు. ఆ పార్టీలోనే స్పష్టమైన వైఖరి లేదన్నారు. త్వరలో తమ పార్టీ విధానం చెబుతామన్నారు. ఇదిలావుంటే  తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి న్యూఢిల్లీలో అన్నారు.