భజనపరులకు భంగపాటు

విభజనకే మేడం సై

చేతులెత్తేసిన సీమాంధ్ర పైరవీకారులు
సీమాంధ్రలో మోహరించిన పోలీసు బలగాలు
పనిచేయని రాజీనామాల అస్త్రం
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు తప్పదని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఆమె భజనపరులకు చెప్పేశారు. శనివారం సీమాంధ్ర పెత్తందారులు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్యాంధ్రను కొనసాగించాలని వారు అభ్యర్థించారు. అయితే విభజనపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని, ఆమె నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీమాంధ్ర నేతలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించగా ఆమె అనుమతించలేదు. అహ్మద్‌ పటేల్‌తో మాట్లాడగా ఆయన సోనియా గాంధీ మనోగతాన్ని స్పష్టం చేశారు. విభజనపై నిర్ణయం తీసుకున్న తరుణంలో సీమాంధ్ర నేతలతో భేటీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తుది వరకూ ప్రయత్నించిన సీమాంధ్ర నేతలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. దీంతో చేసేది లేక హైదరాబాద్‌కు తిరిగివచ్చేశారు. అనంతరం వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఏం చేసేందుకైనా వెనుకాడబోమని బీరాలు పలికుతూనే సమైక్యాంధ్రను కాపాడలేమని కూడా చెప్పేశారు. తద్వారా ఇక తాము ఏమి చేయలేమని చేతులెత్తేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేని పరిస్థితుల్లో కనీసం రాయల తెలంగాణ ఏర్పాటుకైనా అధిష్టానాన్ని ఒప్పించాలని చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తాము పదవులను వదులుకుంటామని, రాజీనామా చేస్తామని హెచ్చరించినా అధిష్టానం ఎంతమాత్రం పట్టించుకోలేదు. అంతదాక వస్తే ఏం చేయాలో తమకు తెలుసని తేల్చిచెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం సీమాంధ్ర నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. కృత్రిమ ఉద్యమాన్ని నడపొచ్చనే వార్తల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీతో సిద్ధం కావడంతో ఆ తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. కేంద్రంలో చర్యలు తీసుకుంటున్న దానికి అనుకూలంగా భారీగా బలగాలను సీమాంద్రకు పంపించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే పదిహేను పారా మిలిటరీ బలగాలను పంపించిన ప్రభుత్వం మరో 70 బలగాలను రప్పిస్తున్నట్లు డీజీపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (సిఎస్‌)కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. డిల్లీలో ఓవైపు సమావేశాలుచురుకుగా సాగుతున్నందున సీమాంధ్రలో పరిస్థితులు చేతులు దాటకుండా నివారించేందుకే బలగాలను మొహరిస్తోందని తెలుస్తోంది. ఇటువైపుగా సీమాంధ్ర నేతలు, ప్రజలను మోటివేట్‌ చేసే కార్యక్రమం కొనసాగుతుండగా మరోవైపు అధికారులు మాత్రం ఉత్పన్నం అయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేంద్రం రాష్ట్రానికి భారీగా బలగాలను పంపిస్తోందని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో నలబై బలగాల పారామిలిటీ బలగాలు రానున్నాయని సీఎస్‌కు డీజీపీ సమాచారం ఇచ్చినట్లు తెలు స్తోంది. ఈ విషయంపై మాత్రం ఏ ఒక్క అధికారి కూడా నోరు మెదప వద్దని, కేవలం ఐజీ స్థాయి అధికారులు మాత్రమే బలగాల గూర్చి మాట్లాడేలా ఆదేశాలు జారీచేసినట్లు కూడా సీఎస్‌కు డీజీపీ వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులను కచ్చితంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లుగా సమాచారం వస్తుండడమేకాక, సీమాంధ్ర నేతల మాటల ద్వారా తేటతెల్లం అవుతుండగా, అధికారుల చర్యలు కూడా ఇటువైపుగానే సాగుతుండడంతో తెలంగాణా రావడం మాత్రం ఖాయంగా ఉంది.