ఎవరడిగారని రాయల తెలంగాణ?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు నాలుగు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం ఫలితాన్నిస్తుందనుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పక్షాన వివిధ రకాల ప్రతిపాదనలు ప్రచారంలో పెట్టారు. అందులో ప్రజలెవరూ కోరుకోని ప్రతిపాదన రాయల తెలంగాణ. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కర్నూల్, అనంతపురం జిల్లాలను విడదీసి తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని, కడప, చిత్తూరు జిల్లాలను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా మీడియాకు లీకులందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే అనేక కుట్రలతో కూడుకున్నదంటే అంతకంటే కుట్రపూరితమైనది రాయల తెలంగాణ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజల జీవన విధానంలో సారూప్యతలు తక్కువే. మూడు ప్రాంతాలు తెలుగు మాట్లాడేవే అయినా ఎవరి యాస వారిదే. ఎవరి యాసకు వారే గౌరవం ఇచ్చుకుంటారు. ఒకే భాషగా చెప్తూ సీమాంధ్ర ప్రాంతం వారు మాత్రం తెలంగాణ యాసను అవహేళన చేస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి కొనసాగుతూ వస్తోంది. భాష, యాస, కట్టుబొట్టును అడుగడుగునా అవమానిస్తూ, అవహేళన చేస్తూ తెలుగుజాతి, తెలుగుతల్లి పేర్లు చెప్పి వారి బానిసల్లా తెలంగాణ ప్రజలు కలిసి ఉండాలని కోరుకోవడం సీమాంధ్ర ఆధిపత్య ధోరణికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నాటికి కనీసం కార్యాలయాలు నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ స్టేట్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత పట్టపగ్గాల్లేనంతగా అభివృద్ధి చెందింది. గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ భూములను ముంచి ఆంధ్ర మడుల్లో బంగారాన్ని పండించాయి. హైదరాబాద్‌కు పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లు ఇక్కడి వనరులు, ఉద్యోగాలు, నిధులు, నీళ్లు కొళ్లగొట్టి అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లే వివిధ పార్టీల్లో చేరి ప్రజాప్రతినిధులుగా మారారు. పెత్తందారుల చేతికి రాజ్యాధికారం చిక్కడంతో తెలంగాణ ప్రజలకు అవకాశాలే దక్కకుండా చేశారు. అన్ని రంగాల్లో సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యం పెరిగిపోవడం, అవమానాలు, అవహేళనలు తట్టుకోలేక తెలంగాణ యువత, విద్యార్థులు 1969లోనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని పోలీసు పదగట్టనలతో రాజ్యం తాత్కాలికంగా నిరోధించగలిగింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమం ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉంది. పది జిల్లాల ప్రజలు ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తూనే ఉన్నారు. వివిధ ఉద్యమ వేదికలు తెలంగాణ కోసం ప్రజాపోరాటాలు నిర్వహించాయి. నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై నినదించడంతో 2009లో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత సీమాంధ్ర పెత్తందారిశక్తులు కుట్రల కత్తులకు పదునుపెట్టి సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఉద్యమ హోరు ఏమాత్రం చల్లారకుండా పోరాటం సాగిస్తున్నారు. ఆ పోరాట ఫలితమే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం వచ్చిన కదలిక. తెలంగాణపై తేల్చాలని కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. ఈక్రమంలో తెలంగాణకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మీడియాకు లీకులందుతున్నాయి. అందులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను విడదీయడం, రాయల తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించడం తదితర ప్రత్యామ్నాయాలను కాంగ్రెస్ పార్టీవైపు నుంచి లీకుల రూపేణ ఇచ్చాయి. అయితే తెలంగాణ, రాయలసీమ ప్రజల జీవన విధానాల్లో అనేక మార్పులున్నాయి. ఎవరి యాస వారిది, ఎవరి భాష వారిది. అలాంటిది రెండు ప్రాంతాలను కలిపి రాయల తెలంగాణ ఇస్తే నాలుగు దశాబ్దాల పోరాటానికి అర్థం ఉండదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల తలెత్తిన పరిణామాలు మళ్లీ పునరావృత్తం కావొచ్చు. అదే జరిగితే తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదటికి వస్తుంది. తెలంగాణతో కలిపేవి రెండే రాయలసీమ జిల్లాలు అయినా అవి ఆధిపత్య ప్రాంతాలే అనే విషయం మరువొద్దు. మరోవైపు రాయలసీమ ప్రజల జీవినవిధానం ఒకేలా ఉంటుంది. అలాంటి సీమను రెండుగా విడదీస్తే వారి జీవన విధ్వంసమూ జరగొచ్చు. అందుకే సీమ ప్రజలెవరూ రాయల తెలంగాణను కోరుకోవడం లేదు. కేవలం వ్యక్తుల, పార్టీల ప్రయోజనం కోసమే ఇప్పుడు రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. 2014 ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్యకు ముగింపు ఇవ్వాలని సంకల్పించింది. ఈ క్రమంలో తన ప్రయోజనం కోసం రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది. రాయలసీమను విడదీయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాల కంటే ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహిస్తే నష్టం కూడా వాటిల్లవచ్చు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం. తెలంగాణ ప్రజలకు ఈ అంశంతో సంబంధం లేకున్నా రాయల తెలంగాణను మాత్రం ఈ ప్రాంత ప్రజలు కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇంతకాలం సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యంతో అన్ని రకాలుగా దోపిడీకి గురై విసిగిపోయిన తెలంగాణ ప్రజలు పూర్తిగా స్వయం పాలన కోరుకుంటున్నారు. హైదరాబాద్ స్టేట్‌గా 1956కు పూర్వం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు.. సీట్లే ధ్యేయంగా తీసుకునే నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే తప్ప ఇక్కడి ప్రజలు అంగీకరించరు. ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కదిలించి అందులో చిక్కుకుంది. కొందరు స్వార్థపరులు దీనికి తాము సానుకూలమని చెప్పొచ్చు కానీ దానికి ప్రజామోదం మాత్రం లేదు. ప్రజామోదం లేని, ప్రజలు కోరుకోని రాయల తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా విరమించుకోకుంటే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదు.