నేడు యూపీఏ భేటీ


తెలంగాణపై తుది నిర్ణయం : దిగ్విజయ్‌
పది జిల్లాల తెలంగాణే కోరుతాం : అజిత్‌సింగ్‌
మేం తెలంగాణకు అనుకూలం : ఎన్సీపీ నేత తారిఖ్‌ అన్వర్‌
వెనువెంటనే సీడబ్ల్యూసీ
కేబినెట్‌ సమావేశం
పార్లమెంట్‌లో బిల్లు దిశగా కేంద్రం
aన్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రయత్నాలు జోరందు కున్నాయి. సుదీర్ఘంగా కొనసాగుతున్న తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకొనేందుకు అధికార పార్టీ సమాయాత్తమైంది. ఈ మేరకు మంగళవారం కీలకమైన రెండు సమావేశాలను ఏర్పాటు చేసింది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయాత్మ కమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)తో పాటు యూపీఏ మిత్రపక్షాల భేటీలో తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర విభజన అంశంపై సంప్రదింపులు ముగించిన కాంగ్రెస్‌ పార్టీ వీలైనంత త్వరలోనే నిర్ణయం వెలువరించనుంది. నిర్ణయాన్ని తీసుకొనే బాధ్యతను ఇటీవల జరిగిన కోర్‌ కమిటీ భేటీ సీడబ్ల్యూసీకి నివేదించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి యూపీఏ మిత్రపక్షాలతోనూ సమావేశం కానుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని అధికార నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్‌లోని అత్యున్నత విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ సమావేశంలో యూపీయే ప్రధాన పాత్రధారి కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు, అజిత్‌ సింగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌ నేత ఇ.అహ్మద్‌ పాలుపంచుకుంటారు. ఇందులో శరద్‌ పవార్‌, అజిత్‌ సింగ్‌లు సుదీర్ఘకాలంగా తెలంగాణ డిమాండ్‌కు మద్దతు పలుకుతూ వస్తున్నారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారిద్దరూ ఇదివరకు ప్రధానిపై ఒత్తిడి తెచ్చారు కూడా. ఇప్పుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఇ.అహ్మద్‌ ఏం చెబుతారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఆలిండియా ముస్లింలీగ్‌ ఇంత వరకూ దీనిపై ఎలాంటి అభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. అయితే ఎంపైఎం నేత అసదుద్దీన్‌ వీరికి ఏదైనా సలహాలు సూచనలు చేశారా అన్నదానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భేటీలో తెలంగాణపై మిత్రపక్షాల అభిప్రాయాలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ సేకరించనుంది. అనంతరం 5.30 గంటలకు సోనియాగాంధీ నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీలో 21 మంది సభ్యులుండగా, 16 మంది శాశ్వత ఆహ్వానితులున్నారు. వారంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వారికి ఈమేరకు సమాచారం కూడా అందించారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం సీడబ్ల్యూసీ భేటీ జరగనుందని తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియనున్న రోజునే ఈ సమావేశం ఏర్పాటు చేయడం విశేషం.
తుది నిర్ణయం ప్రకటించే అవకాశం
రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించి మంగళవారం రెండు కీలక భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే తెలంగాణ అంశం తేలిపోనుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి మిత్రపక్షాల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కాంగ్రెస్‌ తదుపరి అడుగులు వేయనుంది. యూపీఏ మిత్రపక్షాల్లో ఇప్పటికే ఎన్సీపీ, ఆర్‌ఎల్డీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటుకు లాంఛనంగా యూపీఏ మిత్రపక్షాల ఆమోదముద్ర వేయించుకోనుంది. ఈ భేటీ ముగిసిన అనంతరం సీడబ్ల్యూసీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ సమస్య, మిత్రపక్షాల అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించిన అనంతరం ప్రకటన వెలువరించే అవకాశముందని తెలిసింది.
సీఎం, బొత్సలకు పిలుపు
రాష్ట్ర విభజన అంశంపై మంగళవారం కీలక సమావేశాలు జరగనున్న తరుణంలో హైకమాండ్‌ రాష్ట్ర నాయకత్వాన్ని ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలను హస్తినకు రావాలని ఆదేశించింది. తెలంగాణపై రోడ్‌ మ్యాప్‌ నివేదించి, కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ భేటీలో పాల్గొన్న వీరిద్దరికి హైకమాండ్‌ నుంచి సోమవారం పిలుపువచ్చింది. మంగళవారం ఉదయానికల్లా అందుబాటులో ఉండాలని ఆదేశించింది. దీంతో ఇద్దరు నాయకులు ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కనున్నారు. రాష్ట్ర విభజన ఖాయమని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి స్పష్టంగా తేల్చిచెప్పింది. అందుకు అవసరమైన ప్రక్రియను ముందుండి నడిపించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకూ అందరూ సహకరించేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలను ఆదేశించింది. గత వారం కోర్‌ కమిటీ భేటీ జరిగిన సమయంలో ఈ ముగ్గురిని హస్తినకు పిలిపించిన హైకమాండ్‌.. వారికి బ్రెయిన్‌ వాష్‌ చేసి పంపించింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంతో ఏ పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించక పోవడంతో విభజన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, అది తెలంగాణ లేక రాయల తెలంగాణ అన్నదే సస్పెన్స్‌గా మారింది. చంద్రబాబు, జగన్‌లను సీమాంధ్రకే పరిమితం చేసేందుకు హైకమాండ్‌ రాయల తెలంగాణ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే, ఒట్టి ప్రచారమేనని కాంగ్రెస్‌లోని కీలక నేతలు కొట్టిపడేస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు : అజిత్‌
తెలంగాణ ప్రజలకు ఆర్‌ఎల్‌డి నేత, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అజిత్‌సింగ్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘంగా సుమారు 60 ఏళ్లుగా జరుగుతున్న రాష్ట్ర విభజన పోరాటం చివరి దశకు చేరుకుందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేదే తమ అభిమతమన్నారు. కేంద్రం నిర్వహించే యుపిఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో మరోసారి తమ అభిమతాన్ని వ్యక్తం చేస్తానన్నారు. నేటి నుంచి జరుగుతున్న పోరాటం కానేకాదని, ప్రపంచంలో ఇంత పెద్ద పోరాటాలు జరిగిన చరిత్ర లేనేలేదన్నారు. ఏది ఏమైనా చివరికి ప్రజలే అంతిమ విజేతలు అవుతారని తేట తెల్లం అవుతున్నాయని చాలా పోరాటాలు నిరూపించాయన్నారు. మంగళవారం జరిగే యుపిఏ సమన్వయకమిటీ, సిడబ్ల్యూసిలో అంతిమ నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తుందని భావిస్తున్నామన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెపుతున్నామన్నారు.
తెలంగాణకు అనుకూలమే:ఎన్‌సిపి ప్రధాన కార్యదర్శి, ఎంపి తారిఖ్‌ అన్వర్‌
తెలంగాణకు తాము కూడా అనుకూలమేనని ఎన్‌సిపి ప్రధాన కార్యదర్శి, ఎంపి తారిఖ్‌ అన్వర్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ డిమాండు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదన్నారు. ఆ డిమాండును పరిష్కరించాల్సిందేనన్నారు. తెలంగాణ డిమాండును వేరే వాటితో పోల్చలేమని చెప్పారు. చిన్న రాష్ట్రాల కోసం దేశంలో చాలా డిమాండు ఉన్నాయన్నారు. అయితే తెలంగాణ డిమాండు వాటిల్లో ప్రత్యేకమైనదని వివరించారు.