తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో పనిచేసే ఆంధ్రప్రాంత ఉద్యోగులంతా తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసన పరమైన ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు కొందరు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. తెలంగాణ ఏర్పాటుకు తామేమి వ్యతిరేకులం కాదాని, హైదరాబాద్‌పైనే తమ బాధంతా అని ఇటీవల సీమాంధ్ర ప్రాంత నాయకులంతా చెప్తున్నారు. ఇంతకాలం తెలుగుజాతి, తెలుగుతల్లి, అన్నాతమ్ములు లాంటి పెద్ద పెద్ద పదాలు ప్రయోగించి అసలు ఆంధ్రప్రదేశ్‌ విభజనే అవసరం లేదంటూ మాట్లాడిన వారంతా ఇప్పుడు తెలంగాణ ఇచ్చుకున్నా హైదరాబాద్‌లోని తమ ప్రాంతం వారి రక్షణ గురించి సందేహాలు లేవనెత్తుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నప్పుడే కేసీఆర్‌లాంటి వాళ్లు తమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, రేపు రాష్ట్రం విడిపోయాక తాము ఇక్కడ ఉండటం సాధ్యమేనా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వారి అనుమానాలకు కేసీఆర్‌ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి తప్ప నివృత్తికి ఇసుమంతైనా అవకాశం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనేక కుట్రలతో కూడుకున్నది అనేది నిజం. దీనిపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం సందర్భంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన వ్యాఖ్యలే ఆంధ్ర ప్రాంత నైజాన్ని తేటతెల్లం చేస్తాయి. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర, హైదరాబాద్‌ స్టేట్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసిన నాటి పరిస్థితులకు, ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ఆ రోజు తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ప్రయత్నించింది సీమాంధ్ర నేతలే. అప్పటి తెలంగాణ ప్రాంత నేతలు విశాల దృక్పథంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు సహకరిస్తే వారి నమ్మకాన్ని కొద్ది కాలానికే వమ్ము చేసిన చరిత్ర సీమాంధ్ర పాలకులది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ఉంది. మొదటి ఎస్సార్సీ (ఫజల్‌ అలీ కమిషన్‌) ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు సిఫార్సు చేయలేదు. 1961 ఎన్నికల వరకూ ఆంధ్ర, హైదరాబాద్‌ స్టేట్‌లను వేర్వేరుగా ఉంచి, అప్పటికి రెండు రాష్ట్రాలు కలవాలనే అభిప్రాయం ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేసుకోవచ్చని ఫజల్‌ అలీ పేర్కొన్నారు. కానీ అంతకు ఐదేళ్లముందే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఇప్పటి సీమాంధ్రులు చెబుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ విలీనానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలుపలేదు. విలీనాన్ని వ్యతిరేకించిన వారూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు ఇరు ప్రాంతాల నేతలు కలిసి పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు. పరిపాలన ఖర్చులను ఇరు ప్రాంతాలు సాపేక్షంగా భరించాలని, తెలంగాణ మిగులు నిధులను ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలని, ఈ అంగీకారాన్ని ఐదేళ్ల తర్వాత పున: పరిశీలించాలని, తెలంగాణ సభ్యులు కోరితే మరో ఐదేళ్లు కొనసాగించాలని సూచించింది. మొదటి ఐదేళ్లకే మోక్షం లేకుంటే ఇంకా కొనసాగింపు ఎక్కడిది అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలంగాణ విద్యార్థులకు నాటికి ఉన్న విద్యా వసతులకు రక్షణ కల్పించాలి. సాంకేతిక విద్యా కేంద్రాల్లో తెలంగాణవారికే అవకాశం ఇవ్వాలి. పాలన, న్యాయశాఖల్లో తెలంగాణ ప్రాంతంలో ఉర్దూకు గల ప్రతిపత్తి ఐదేళ్లు కొనసాగించాలి తదితర ఒప్పందాలను సీమాంధ్ర పాలకులు యథేచ్ఛగా ఉల్లంఘించారు. తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన ఉద్యోగాలను తమ వాళ్లతో నింపేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ తమ ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్షం రెండు రోజుల క్రితం సెక్రటేరియట్‌ సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల ర్యాలీ. తమ హక్కులను పరిరక్షించాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీతో సచివాలయం లోపలి రోడ్లు కిక్కిరిశాయి. ప్రస్తుతం సచివాలయంలో ఐదు వేల మంది ఉద్యోగులుండగా, వారిలో మూడు వేల మందికిపైగా సీమాంధ్ర ఉద్యోగులే. సుమారుగా రెండు వేల మంది తెలంగాణ ఉద్యోగులు తెలంగాణవారున్నారు. వీరిలోనూ ఉన్నత స్థాయి ఉద్యోగుల సంఖ్య బహు స్వల్పం. థర్డ్‌, ఫోర్త్‌ క్లాస్‌ ఉద్యోగాల్లో ఎక్కువగా తెలంగాణవారున్నారు. కీలక హోదాల్లో సీమాంధ్ర ఉద్యోగులకు అవకాశాలెలా వచ్చాయి అంటే సమాధానం చెప్పేవారు ఉండరు. వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరలో కూర్చున్నా సుష్టుగా తినొచ్చు అనే సామెతను నిజం చేస్తూ సీమాంధ్ర పాలకులు తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కొల్లగొట్టి తమవారికి సమర్పించుకున్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదు. 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగానే. అయితే నాలుగున్నర దశాబ్దాల పోరాటానికి ఫలితం వస్తున్న తరుణంలో  మనకు మనంగా ఆంధ్ర ప్రాంతం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదు. అవతలి వారు మనకన్నా అన్ని రకాలుగా బలవంతులైనప్పుడు మనం నిగ్రహంగా, సంయమనంతో వ్యవహరించాలి తప్ప పట్టింపులకు పోవడం శ్రేయస్కరం కాదు. కేసీఆర్‌ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సాగుతున్న తరుణంలో అవతలి వారిని రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా సాధించేది ఏమి ఉండదు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన కసరత్తులో ఉద్యోగాల పంపిణీ కూడా భాగం. ఆరు దశాబ్దాల పాటు సీమాంధ్రుల పీడన భరించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం విడిపోయే వరకు భరించే ఓపిక ఉండకపోదు. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడిన ఇలాంటి వ్యాఖ్యల వల్ల శాంతి నెలకొనాల్సిన సమయంలో మరింత గందరగోళం చెలరేగడం ఖాయం. మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. మన తెలంగాణ మనకు వస్తే దాన్ని పునర్నిర్మించుకోవడం మన చేతిలో పని. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనే తప్పటడుగు వల్ల తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను అంధకారం చేసుకుంది. ఇప్పుడు ఆ చీకట్లు వీడిపోయే సమయంలో అందరం సంయమనంతో ఉందాం. కేసీఆర్‌ వ్యాఖ్యానించిన మరుక్షణమే అవతలి వైపు నుంచి ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు భంగం వాటిల్లితే తర్వాతి పరిణామాలను ఊహించుకోవడం కూడా కష్టం. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మన తెలంగాణ ఏర్పడే వరకు సంయమనం పాటించాలి.