బతకడానికి వచ్చి కబ్జా చేస్తామంటే ఎట్లా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఉండవని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్య పెను దుమారమే రేపింది. తెలంగాణ ఏర్పడే సమయంలో సౌహృద్భావ వాతావరణం ప్రత్యేక రాష్ట్రం కోరుకునే వారు చెడగొట్టుకోవద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హితవు చెప్పే వరకూ పరిస్థితి వెళ్లింది. కేసీఆర్‌కు ఏ అధికారం ఉందని అలా మాట్లాడుతారని కొందరంటే, అసలు కేసీఆర్ ఎవరు మాట్లాడటానికి అని మరికొందరు అన్నారు. ఇక సచివాలయంలో పనిచేసే సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులైతే ఏకంగా కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ విధులను బహిష్కరించారు. తెలంగాణ ఏర్పడే సమయంలో కేసీఆరే కాదు ప్రతి తెలంగాణవాది సంయమనంతో ఉండాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు. నాలుగు దశాబ్దాల పోరాట ఫలంగా సాధించుకున్న తెలంగాణ ప్రకటన నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనక్కుపోతుందోననే శంఖ ఈ ప్రాంత ప్రజల మదిలో ఏదో ఓ మూలన గూడుకట్టుకొని ఉంది. అయితే ఆరు దశాబ్దాల పాటు సీమాంధ్రుల ఆగడాలను ఓపికతో బరించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ కంటే రెచ్చిపోయి మాట్లాడారు కూడా. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలు వేధించి, వేపుకుతిన్నారు సీమాంధ్ర ప్రాంత పాలకులు. వారి ఆజ్ఞలను అమలు చేసే ఉద్యోగులు కూడా ఈ పాపంలో భాగస్వాములే. తెలంగాణ వనరుల దోపిడీలో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల పాత్ర తక్కువేమి కాదు. పోని తెలంగాణ వనరులను తిని ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అంటే అది లేదు. బువ్వ పెట్టిన గడ్డమీద మమకారం పెంచుకున్నారా అంటే లేదు. తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ఉద్యోగాలను దిగమింగి సీమాంధ్ర పాట పాడటం వారికే చెల్లింది. వాళ్లకు హైదరాబాద్ మీద ఎందుకంత ప్రేమ అంటే ఇక్కడే ఉంటే తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించవచ్చు. అదే తమ ప్రాంతంలో ఏర్పడే కొత్త రాజధానికో, జిల్లాలకో వెళ్లి ఉద్యోగాలు చేస్తే అది సాధ్యం కాదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను సీమాంధ్రులు అడ్డంగా దోచుకున్నారనడానికి నిదర్శనం తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటన అనంతరం సచివాలంలో నిర్వహించిన ఆ ప్రాంత ఉద్యోగుల ర్యాలీ. సచివాలయంలోని ఐదు వేల మంది ఉద్యోగుల్లో అత్యధికంగా మూడు వేల మంది సీమాంధ్ర ప్రాంతం వారే. వారు నిర్వహించే ఉద్యోగాలు కూడా కీలకమైనవే. వారికి అన్ని ఉద్యోగాలు ఎలా వచ్చాయి. స్థానిక నిబంధనలు వారికి వర్తించకుండా ఎలా పొయాయి అంటే సీమాంధ్ర పాలకులు, అధికారుల దోపిడీకి దర్పణమది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత పరిపాలన వ్యవహారాల్లో అవసరమైన ఉద్యోగాల కోసం కొందరు హైదరాబాద్‌కు వస్తే మరికొందరు అక్రమంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కీలకశాఖల్లో ఉన్నత స్థానాలు వెలగబెట్టిన, వెలగబెడుతున్న వారు తమ ప్రాంతం వారికి, తమ కులం వారికి, తమ ఊరి వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కొందరికి అర్హతల్లేకున్నా ఉద్యోగాలిచ్చేశారు. అలా హైదరాబాద్‌లో ప్రవేశించిన కొందరు ఇప్పుడు ఉద్యోగాలు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారమెత్తారు. పాలకులే తమవారు కావడం, సెజ్‌ల పేరిట సీమాంధ్ర ప్రాంత పెత్తందారులకు వేలాది ఎకరాల భూములు దోచిపెట్టడంతో ఆ భూములను ఫ్లాట్లు చేసి అమ్ముకుని కోట్లకు పడగలెత్తారు. ఈ తరహా ఉద్యోగుల గురించి సెక్రటేరియట్‌లో కథలు కథలుగా చెప్తారు. ఉన్నత స్థానాల్లో తమవారే ఉండటంతో పనిచేసినా, చేయకున్నా నెలాఖరుకు జీతం చేతికి వస్తుంది. అలాంటి దోపిడీదారులు ఇప్పుడు హైదరాబాద్‌పై హక్కులు అడగటంలో ఆంతర్యమేమిటి? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక సొంత ప్రాంతంలో ఉద్యోగం చేస్తే తప్పేమిటి? ఉద్యోగం కోసమే కదా వారంతా హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పుడదే ఉద్యోగం సొంత గడ్డపై చేసుకోమని సూచిస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన ప్రశ్నలే. కేసీఆర్ మాట్లాడిన మరుసటి రోజే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు విధులు బహిష్కరించడంలో ఆంతర్యమేమిటి? వారెవరూ ఈ ప్రాంత ప్రజలమని అనుకోవడం లేదు. సీమాంధ్ర ప్రాంతంతో ముడిపడి హైదరాబాద్‌లో ఉండాలనుకుంటున్నారే తప్ప ఇంతకాలం అక్కున చేర్చుకున్న ప్రజల ఔదార్యాన్ని గుర్తించడం లేదు. ఉద్యోగానికి రాజధానికి వచ్చి.. అదీ అక్రమంగా సంపాదించి ఇప్పుడు హైదరాబాద్ అందరిదీ అంటున్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో రాజధానికి దీటుగా మరో నగరాన్ని పాలకులు అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలంలో అధికారాన్ని అనుభవించింది సీమాంధ్రులే. నిర్ణాయక స్థానాల్లో కొనసాగింది, కొనసాగుతోంది అక్కడి అధికారులే. మరి ఎందుకు దీటైన నగరాన్ని ఏర్పాటు చేయలేదు అంటే అక్కడ వనరుల కొరత. సీమాంధ్ర ప్రాంతంలో భూమిని అభివృద్ధి పేరిట లాక్కోవడానికి తమ వారు నష్టపోతారు అనే భావన సీమాంధ్ర పాలకులకు అడ్డం వచ్చినట్లుంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక సినిమా పరిశ్రమను మెల్లమెల్లగా విశాఖ వైపు నడిపించారు. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఐటీ హబ్‌లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేశారు. చేస్తున్నారు. తమ చేతిలోనే అధికారాన్ని పెట్టుకొని పరులపై నిందమోపడం సీమాంధ్రుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. హైదరాబాద్ స్వాతంత్రానికి ముందే అభివృద్ధిలో దేశంలో ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆరోస్థానానికి పడిపోయింది. ఇందుకు కారణం సీమాంధ్ర పెత్తందారులు. వారు హైదరాబాద్‌పై పడి దోచుకున్న తీరును ఎన్ని రీతుల్లో వర్ణించినా సరిపోదు. అలాంటిది అక్రమంగా పొందిన ఉద్యోగాలు పట్టుకొని ఇక్కడే వేలాడుతామనడం ఎంత వరకు సమంజసం. తాము తెలంగాణ వాళ్లం కాదు అనుకునే వాళ్లు ఇక్కడ ఎందుకు ఉండాలి. ఇక్కడి వనరులను అనుభవిస్తూ సీమాంధ్ర ప్రాంత కోవర్టులుగా పనిచేస్తున్న వారిని తమ రాజధానికో, రాష్ట్రానికో పోవాలనడంలో తప్పేమీ లేదు.