భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్ధంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోస్ముఖంగా అత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. లక్షలాది ప్రజానీకం ఒకే నినాదం, ఒకే లక్ష్యం కోసం ఒకే బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.

ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకకవర్గమైన ముస్లీం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లీమేతర సాంఘీక జన సమూహాలతో మమేకమై స్వాతంత్య్రసమరంలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన ఆత్మబలిదానాలతో ళభారతీయ ముస్లీంలు పునీతులయ్యారు. అయినప్పటికీ యుస్లీం సమాజం త్యాగమయ చరిత్ర పలుకారణాల మూలంగామరుగున పడిపోయంది. తమ పాలనను సుస్ధిరం చేసుకునేందుకుగాను బ్రిటిష్‌ పాలకులు విభజించు-పాలించు కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను హిందువులు-ముస్లీంలుగా విభజించటంలో కృతకృత్యులయ్యారు.

భారతీ విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ తరువాత జరిగిన దారుణాలు, పోరుగుదేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు, వివాదాలు, స్వాతంత్య్రోద్యమ కాలంనాటి హిందూ – ముస్లీం ఐక్యతకు చిచ్చుపెట్టాయి. భారత విభజనానంతరం పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయబడిన ముస్లీం సమాజం సంఘుప్తావస్థలోకి నిష్క్రమించింది. యుద్దాలు, వివాదాలు, దేశంలో తరచుగా సాగిన మతకలహాలు మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య మానసిక విభజన కారణమయ్యాయి.

ప్రజల మత మనోభావాలను రెచ్చగొట్టే మతం పేరుతో మనషులను చీల్చి, రాజకీయ ప్రయోజనాలను సాధించదలచిన మతోన్మాద రాజకీయశక్తులు, వ్యక్తులు ఈ చీలికను ఆగాధంగా మార్చాయి. పర్యవసానంగా బ్రిటిషర్ల బానిసత్వం నుండి మాతృ భూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్ఘ పోరాట చరిత్రలో ముస్లిం సమాజం త్యాగాలు మరుగునపడిపోయాయి.

ప్రజలకు చేరువకాని సమాచారం

చరిత్రలో గ్రంథాలలో ముస్లింలు చాలా వరకు కన్పించరు, ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి త్యాగాలు,  సాధారణ స్థాయి వివరణలతో, వర్ణనలతో సరిపెట్టబడతాయి. ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర గ్రంథాలలో ముస్లీంల వీరోచిత గాధలు సరైన స్థానం పొందలేకపోయాయి. కనుక ఆయా కథనాలు సామాన్య చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్యపుస్తకాలలోగాని చోటు చేసుకోలేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు అమూల్య సమాచారం అందకుండా పోయింది.

చరిత్ర ద్వార తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళారూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముస్లింల శ్లాఘనీయ చరిత్రలు కథా వస్తువు కాలేకపోయాయి. ఆ కారణంగా ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత సంఘటనలు జనబాహుళ్యంలోకి వెళ్ళకపోవటంతో ఆ తరువాత తరాలకు ఆ విషయాలు అందలేదు. ఈ పరిణామాలే భారతదేశంలోని హిందూ-ముస్లిం జనసమూహాల మధ్య మానసిక ఎడం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి.

ఈ మానసిక అగాధాన్ని మరింత పెంచి ఒక సాంఘీక జనసమూహానికి తామే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్న శక్తులు-వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి.

త్యాగాల చరిత్ర అందరికీ తెలియాలి

ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజలకు అన్ని సాంఘీక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. పలు సాంఘీక జనసముదాయాల గడ్డ అయినటువంటి భరతభూమిలో ఆయా జనసముదాయాల మధ్యన సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి గురించి మరొకకరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతమైన ప్రజలందరి చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయాల మధ్యన పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదవగాహన, సధ్భావవన, సహిష్ణుతకు పునాది అవుతుంది.

ఈ వాతావరణం మాత్రమే లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మత విద్వేషాలు మట్టిలో కలసి మత సామరస్యం మరింతగా పరిష్టమౌతుందది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకుచేరువకాని ముస్లిం త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో చిన్న ప్రయత్నమిది.

స్వాతంత్రోద్యమ చరిత్రలో అరుణపుటల్ని తెరిచిన సిరాజుద్దౌలా

16వ శతాబ్ధంలో వర్తకం పేరుతో భారత గడ్డ మీద అడుగుపెట్టిన బ్రిటిషు వర్తకులు స్వదేశీ పాలకుల దరిచేరి ధనకనక వస్తు వాహనాలను కానుకలుగా సమర్పించి, ప్రలోభపెట్టి ఈ నేల మీద స్థిరపడటం ప్రారంభించారు. ఈ వర్తకుల రాకతో వ్యాపారం అభివృద్ది చెందుతుందని ఆశించిన స్వదేశీ పాలకులు ఆంగ్లేయులకు అన్ని అవకాశాలు కల్పించారు. సరుకును నిల్వ చేసుకునేందుకు స్వంత గిడ్డంగులు కట్టుకుంటామని స్వదేశీపాలకుల ఎదుట సాగిలపడి అనుమతి సంపాదించుకున్నారు. ఆ అనుమతుల ఆధారంగా గిడ్డంగుల రక్షణ కోసమంటూ పటిష్టమైన కోటల నిర్మాణానికి పూనుకున్నారు. మీరు వ్యాపారులు. మూకు కోటల అవసరం ఏముంది? నా రక్షణలో ఉన్నందున మీకు శత్రువు గురించి ఎటువంటి భయం అక్కరలేదు, అని బెంగాలు నవాబు అల్లావర్ది ఖాన్‌ లాంటి స్వదేశీ పాలకులు హామీలు ఇచ్చినా, ఓ పధకం ప్రకారంగా గిడ్డంగుల నిర్మాణాలతో ప్రారంభమై, పటిష్టమైన కోటలు కట్టకుంటూ, రాజ్యాధికారం కోసం ఆంగ్లేయులు స్వదేశీ పాలకుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆరంభించారు. ఆప్రయాత్నాలలో భాగంగా బెంగాలు మీద ఆధిపత్యం కోసం ఆరంభించిన ఎత్తులను ఆదిలోనే గ్రహించి, ఆ కుయుక్తులను వమ్ముచేసి, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని రూపుమాపేందుకు పాతికేళ్ళు దాటని యువకుడు బెంగాలు నవాబు సిరాజుద్దౌలా ‘భారత స్వాతంత్య్ర సాయుధ సమరేతిహాసంలో అరుణపుటల్ని తెరిచాడు’. భారతగడ్డ మీద తొలిసారిగా ‘బ్రిటిషు దుష్టులను కత్తిపట్టి ఎదిరించిన మొనగాడు’గా ఖాతిగాంచిన ఆయన ప్రఖ్యాత ప్లాసీ యుద్దంలో క్లయిపు నాయకత్వంలోని కంపెనీ సైన్యాలను ఎదుర్కొన్నారు.

ఈ యుద్దంలో చెంగాలు సింహాసనం కోసం ఆశపడిన సర్వసేనాని మీర్‌ జాఫర్‌, అలవికాంత సంపదను సమకూర్చుకకోవాలనుకున్న దురాశపరులు ప్రముఖ బ్యాంకరు జగత్‌ సేథి, సంపన్న వ్యాపారి అమిచంద్‌, నవాబు దర్బారులోని మరొక ప్రముఖుడు రాయ్‌ దుర్లబ్‌, సేనానాయకుడు మానిక్‌ చంద్‌, తదితరులు శత్రువుతో చేతులు కలిపి విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కారణంగా 1757లో ప్లాసీ అను గ్రామం వద్ద యుద్ధంలో 50వేల స్వదేశీ సైన్యం కలిగిన సిరాజుద్దౌలా మూడు వేల బ్రిటిషు సైన్యం చేతిలో పరాజితుడయ్యారు.

ఆ తరువాత సిరాజుద్దౌలా స్ధాయిలో కాకున్నా, స్వదేశీయుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న కంపెనీ పాలకుల చర్యలను, ఆంగ్లేయుల పెత్తనాన్ని ఏమాత్రం అంగీకరించని మరొక యోధుడిగా మీర్‌ ఖాశిం రంగం మీదకు వచ్చారు. స్వదేశీ పాలకుల సహకారంతో 1746లో బక్సర్‌ అనుచోట కంపెనీ బలగాల మీద మీర్‌ ఖాశిం విరుచుక పడ్డారు. ఈ యుద్ధంలో స్వదేశీ పాలకుల నుండి ఆశించిన సహకారం లభించకపోవటం, స్వదేశీ సైనికుల కంటే, కంపెనీ సైన్యాలు చక్కని శిక్షణ కలిగియుండటంతో మీర్‌ ఖాశింకు పరాజయం తప్పలేదు. 1757లో ప్లాసీ యుద్ధ విజయం అందించిన అవకాశాన్ని ఉపయోగించుకుని బక్సర్‌ యుద్ధంలో సాధించిన విజయంతో ఆంగ్లేయులు ఇండియాలో స్థిరపడగలిగారు.

ఈ క్రమంలో 1756 ప్రాంతంలో మొగుల్‌ పాదుషా ఆలం నుండి బెంగాలు దివానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యతో పాదుషాలు నామమాత్రమైపోగా, ఆంగ్లేయుల పెత్తనం ఇండియాను పూర్తిగా ఆక్రమించుకునే దిశగా సాగింది. అనుకోని విధంగా పెత్తనం చేతికి రావటంతో,గతంలో పాదుషాలు అనుసరించిన విధానాలకు అతీతంగా, లాభాల పంటలు పండించుకుని, ఈ గడ్డ మీద నుండి అందినంత దోచుకుపోవడానికి కంపెనీ అధికారులు, ఉద్యోగులు ఆవురావురంటూ దోపిడికి శ్రీకారం చుట్టారు. ఈ ఆకస్మిక పరిణామాలు కొనసాగుతున్న వ్యవస్థలో అనూహ్య మార్పులకు కారణమై, అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేయటంతో ఆయా వర్గాలలో కలకలానికి కారణమైంది.