తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగుల కోసం కాదు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర ఉద్యోగుల కోసం కాదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత బలిదానాలు ఆంధ్ర ప్రాంత వాసులు అక్రమంగా సంపాదించుకున్న ఉద్యోగాల రక్షణ కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం పది జిల్లాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆరు దశాబ్దాల వంచన, పీడన, అణచివేతల నుంచి విముక్తి. నాలుగు దశాబ్దాల పోరాట ఫలం. ఎందరో త్యాగదనుల ఆకాంక్షల మణిహారం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో దోపిడీదారులకు హక్కులు కావాలట? అందుకు వాళ్లు సిగ్గు విడిచి ఉద్యమాలు చేస్తున్నారు. ఇందుకు తెలంగాణ ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్న హైదరాబాద్ నగరాన్ని వేదికగా మలుచుకుంటున్నారు. బతకడానికి ఇక్కడికి వచ్చి తమ కష్టార్జితంతోనే హైదరాబాద్‌ను నిర్మించామనే గోబెల్స్ ప్రచారం జరుపుతున్నారు. మీడియా తమ చేతుల్లో ఉంది కదా అని అబద్ధాలను అచ్చేసి, ప్రసారం చేసి ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయం నుంచే ఉద్యమ గొంతుకలు గర్జిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వెనుక అనేక కుట్రలు దాగున్నాయని విలీనం మంచిదికాదని 1956లోనే పలువురు హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ ఏర్పాటుతోనే సీమాంధ్రులు దోపిడీ రాజకీయాలు ప్రారంభించారు. విలీనం సందర్భంగా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి తెలంగాణలోని వనరుల దోపిడీకి తెరతీశారు. తెలుగు అధికార భాష కావడంతో అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్‌లో అధికార భాషగా ఉన్న ఉర్దూను పక్కకు నెట్టేసి, తెలంగాణ ఉద్యోగుల స్థాయిని బలవంతంగా తగ్గించేసి కీలక స్థానాలను సీమాంధ్రులు ఆక్రమించేశారు. ఏ తెలుగు పేరుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కుట్ర పన్నారో అదే తెలుగును సాకుగా చూపి వేలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ఆ తర్వాతి తరానికి ఉపాధి అవకాశాలు దక్కకుండా చేశారు. ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా థర్డ్, ఫోర్త్ క్లాస్‌కే పరిమితం చేశారు. ఆ తర్వాతి తరం అందుకోలేని స్థాయికి ఉద్యోగాలను తీసుకెళ్లారు. అన్ని శాఖల్లో ఆక్టోపస్‌లా వేళ్లూనుపోయిన ఆంధ్ర అధికారులు అన్ని ఉద్యోగాలను తమ వారికే దోచిపెట్టారు. అలా దోచిపెట్టిన అక్రమ ఉద్యోగులు ఇప్పుడు హైదరాబాద్ తమదే అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నందున తమ హక్కుల పరిస్థితి ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి తామెందుకు పోవాలని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు వెలగబెడుతున్న సీమాంధ్రుల్లో ఎంతమంది అధికారిక నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరారు? ఎంత మంది దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించుకున్నారు? అని తరచి చూస్తే అధికారిక నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య బహు స్వల్పమే. వచ్చిందే దొడ్డిదారిన.. అలా వచ్చి కనీసం ఉద్యోగాలైనా సరిగా చేశారా అంటే అదీ లేదు. సెక్రటేరియట్‌లోని ఐదు వేలకు పైగా ఉద్యోగుల్లో మూడు వేలకుపైగా సీమాంధ్ర ప్రాంతం వారే. వారిలో అత్యధికులు ఉద్యోగం కంటే రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలే ఎక్కువగా చేస్తుంటారు. తెలంగాణ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన భూములను సీమాంధ్ర వలస పాలకులు సెజ్‌ల పేరిట తమ ప్రాంత పెత్తందారులకు కట్టబెడితే వాళ్లు ఆ భూములను యథేచ్ఛగా తెగనమ్ముకున్నారు. అభివృద్ధి పేరిట అప్పగించిన భూములను ఇష్టారాజ్యంగా వెంచర్లుగా మార్చి, ఫ్లాట్‌లు చేస్తే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పాలకులు, నాయకులు, పెట్టుబడిదారులు పెద్ద దొంగలైతే ఉద్యోగాల పేరుతో అక్రమంగా హైదరాబాద్‌లో ప్రవేశించిన వారు చిన్నపాటి దొంగలే. ఇప్పుడు వారు తెలంగాణ తమ హక్కుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. తెలంగాణ నడిగడ్డపై నిలబడి ఇక్కడ ఉద్యమ నాయకుల దిష్టిబొమ్మలు దహనాలు చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వాళ్లంతా సీమాంధ్ర ప్రాంత వాసులమేనని భావిస్తున్నారు తప్ప తెలంగాణ వారిమి అనుకోవడం లేదు. ఎవరైనా ఒక ప్రాంతంలో ఏడేళ్లకుపైగా నివసిస్తే వారిని ఆ ప్రాంతంలో స్థానికులుగా గుర్తింస్తుంది రెవెన్యూ శాఖ. కానీ సీమాంధ్ర ఉద్యోగులు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చినా వారు నైతికంగా ఎప్పుడు హైదరాబాదీలమని అనుకోలేదు. హైదరాబాద్ ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ ఫలాలు అనుభవించాలనే ధ్యాస తప్ప ఈ ప్రాంత ప్రజల జీవన విధానంతో మమేకమవుదామన్న ఆలోచన వారిలో లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం వెళ్లాయంటే అదేదో ఒక రాత్రో, ఒకరోజులోనో తీసుకున్న నిర్ణయం కాదు. కనీసం నాలుగున్నర దశాబ్దాల పోరాటం, నిస్వార్థ ఉద్యమం ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఇవ్వకుంటే ఈ ప్రాంతంలో రాజకీయ సమాధి తప్పదనే భావనకు కాంగ్రెస్ వచ్చేలా చేసింది తెలంగాణ ఉద్యమం. 1968 చివరిలో ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర పోరాటం 1969లో తారస్థాయికి చేరింది. ఈక్రమంలో తెలంగాణ 369 మంది ఉజ్వల భవిత ఉన్న తన బిడ్డలను కోల్పోయింది. రాజ్యం తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ యువతను కాల్చి చంపింది. తర్వాతికాలంలోనూ రాజ్యం తెలంగాణ కోసం ఉద్యమించే వారిపై వివిధ నిందలు మోపి హత్య చేసింది. ఆ హత్యలకు జవాబు చెప్పుకోవాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. తెలంగాణను అన్ని రకాలుగా దోపిడీ చేసిన సీమాంధ్రులు ఇప్పుడు హైదరాబాద్ తమదేనని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర రాజధానిపై అందరికీ హక్కులు ఉంటాయని అంటున్నారు. కనీసం కార్యాలయాలు కూడా లేని కర్నూల్ రాజధానిగా ఉన్న ఆంధ్ర సకల సంపన్న రాజ్యమైన హైదరాబాద్ స్టేట్‌తో జట్టు కట్టిన విషయం మరిచిపోయారు. దేశానికి రాకపూర్వమే హైదరాబాద్ దేశంలోనే ఐదో అభివృద్ధి చెందిన నగరంగా ఉందనే విషయాన్ని విస్మరించారు. ఇప్పటి హైదరాబాద్ అభివృద్ధి కాలానుగుణంగా వచ్చిందే తప్ప ప్రత్యేకంగా సీమాంధ్రులు చేసిందేమీ లేదు. ఆ విషయాన్ని విస్మరించి కనీసం తెలంగాణతో అనుబంధం కూడా పెంచుకోకుండా, తెలంగాణ కావాలని అడగకుండా ఉద్యోగాలపై హక్కులు అడగడం సీమాంధ్రుల దిగజారుడు తనానికి నిదర్శనం. తెలంగాణ ప్రజలుగా అనుకున్న వాళ్లకు మాత్రమే ఇక్కడ గుర్తింపు ఉంటుంది. వారికి మాత్రమే తెలంగాణ వల్ల సిద్ధించే హక్కులు వర్తిస్తాయి. ఈ గడ్డపై జీవిస్తూ ఇక్కడి నీళ్లు తాగుతూ నిధులు అనుభవిస్తూ సీమాంధ్ర కొమ్ముకాసే కోవర్టులు ఎప్పటికీ ఇక్కడి వాళ్లు కారు.