భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలుఫకీర్లు-సన్యాసుల సమైక్య పోరాటం
భారత దేశాన వర్తకులుగా అడుగిడిన బ్రిటిషర్లు అంది వచ్చిన అవశాశాలను ఉపయోగించు కుంటూ క్రమక్రమంగా తమ సామ్రాజ్య విస్తరణ కాంక్షకు స్వదేశీ పాలకులను ఎరచేయడం ఆరంభిం చారు. భారతయ భూభాగం మీద తమ పాలనను సుస్థిరం చేసుకు నేందుకు కుట్రలు కుయుక్తులకు శ్రీకారం చుట్టి కొండచిలువలా భరత గడ్డను చుట్టేయసాగారు. కంపెనీ పాలకుల అంతరంగాన్ని గ్రహించి, రానున్న పెనుప్రమాదాన్ని ముందుగా గుర్తించి హెచ్చరించింది, ఎదుర్కొంది ముస్లింలే కావటం గమనార్హం.
ప్రధమ స్వాతంత్య్ర సమరానికి వంద సంవత్సరాల ముందే బ్రిటిష్ పాలకులపై వ్యతిరేకత వ్యక్తమైంది. బెంగాల్లో బ్రిటిష్ వలస పాలకుల తొత్తులైన జమీందార్లకు వ్యతిరేకంగా ముస్లిం ఫకీర్లు మజ్నూషా నేతృత్వంలో 1763లో తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేశారు. ఆ సమయంలో ఫకీర్లకు తోడుగా శ్రీ భవాని పాఠక్ నాయకత్వంలోని సన్యాసులు కూడా తిరుగుబాటులో పాల్గొనటంత ఈ తొలి తిరుగుబాటు ఉద్యమం ఫకీర్లు-సన్యాసుల ఉద్యమంగా ఖ్యాతి గాంచింది. బ్రిటిష్ అధికారి లార్డ్ మెంకజీ నేతృత్వంలోని బ్రిటిష్ సైనిక దళాలను అనేకమార్లు ఓటమికి గురిచేసిన ఫకీర్లు-సన్యాసులు ప్రజల నుండి అపార ఆదరణ పొందారు, ఈ ఉద్యమంలో మూసాషా, చిరాగ్‌అలీ, నూరుల్ మహమ్మద్ తదితరులు ముఖ్య పాత్ర వహించారు. ఈ తిరుగుబాటు 1800 వరకు సాగింది.
వహాబీ-ఫరైజీల తిరుగుబాటు
తొలి తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం సమాప్తమైన రెండు దశాబ్ధాల కాలంలోనే ముస్లింలు బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు మళ్ళీ సిద్దమయ్యారు. 1820 నుంచి 1870 ప్రాంతం వరకు సాగిన ఈ తిరుగుబాటు వహాబీ ఉద్యమంగా ఖ్యాతిగాంచింది. రాయ్‌బరేలీకి చెందిన సయ్యద్ అహమ్మద్ బర్వేలీ ఈ ఉద్యమానికి ఆద్యుడు. ఈ పోరాటానికి నాయకత్వం వహించి అమరులైన వారిలో టిటూమిర్, అబ్దుల్ అజీజ్, మహమ్మద్ మహషిన్, దూదూ మియా, ఇనాయత్ అలీ, విలాయత్ అలీ ప్రముఖులు. ఈ యోధులు సుదీర్ఘకాలం సాగించిన పోరుకు సంబంధించిన విజయాలను, ఆ పోరాటయోధులు పాల్గొన్న చరిత్రాత్మక సంఘటనల గురించి బెంగాల్ తదితర ప్రాంతాల ప్రజలు ఈ నాటికి స్మరించుకుం టున్నారంటే, ఆ పోరాటాల ప్రాముఖ్యతను ఊహించగలరు. ఈ ఉద్యమం వహీబీ ఉద్యమంగా ఖ్యాతిగాంచింది.
బొంబాయి, మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లలో కూడా ఈ ఉద్యమానికి కార్యకర్తలు, మద్దతుదార్లు ఏర్పడ్డారు. అప్పటి హైదరాబాదు నవాబు సోదరుడు ముబారిజుద్దౌలా వహాబీ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. బ్రిటిష్ రాణికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్న నేరారోపణగావించి, ముబారి జుద్దౌలాకు జీవిత ఖైదు విధించారు. ఆయన అనుచరులు మరో పదిమంది సంవత్సరాకు పైబడిన జైలు శిక్షలకు గురయ్యారు. చిట్టచివరకు ముబారిజుద్దౌలా గోల్కొండలో అమరత్వం పొందారు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ కాంక్షను గుర్తించిన ఈ పోరాటాలన్నీ, ప్రజలమీద సాగుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రారంభమై, బ్రిటిష్ వలస పాలకుల వైపునకు మళ్ళాయి. ఈ పోరాటాలచే స్పూర్తి పొందిన ప్రజలు, ప్రధానంగా యువకులు 1857 నాటి ప్రథమ స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ఈ పోరాటంలో అనేక మంది వహాబీలు అమరులయ్యారు. అటువంటి వారిలో షహీద్ పీర్ అలీ, ఇనాయత్ అలీ, ఫర్హత్ హుస్సేన్, మహమ్మద్ షౌకత్ అలీ ముఖ్యులు, వహాబీల నుండి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనను సహించలేని బ్రిటిష్ వలస పాలకులు వహబీల మీద అనేక కుట్ర కేసులు బనాయించి వందలాది వహబీ వీరులను రకరకాల తీవ్ర శిక్షలకు గురిచేశారు.
ఆ కాలంలోనే ఫరీద్‌పూర్‌కు చెందిన పీర్ షరీయతుల్లా నేతృత్వంలో మరో పోరాటం ప్రారంభమైంది. ఈ పోరు ఫరైజీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి తొత్తులైన జమీందార్లు, వడ్డీ వ్యాపారులు, తేయాకు తోటల యజమానులు ఆ ప్రాంతం రైతుల మీద, సామాన్య జనం మీద సాగిస్తున్న పీడనకు వ్యతిరేకంగా ఈ తిరుగాబాటు ప్రారంభమైంది. ఈ తొత్తులకు అండగా కంపెనీ పాలకులు రావటంతో ఉద్యమకారుల అస్త్రశస్త్రాలు బ్రిటిష్ వలస పాలకులవైపు గురి పెట్టబడ్డాయి.
ఈ ఉద్యమానికి హజీ పీర్ షరీయతుల్లా శ్రీకారం చుట్టినప్ప టికి ఆ ఉద్యమం దశను దిశను మార్చి సమరశీల పోరాటంగా బ్రిటిషర్లను ఖంగు తినిపించిన మహాయోధుడు దూదు మియా. ఆయన నేతృత్వంలో రైతాంగం, వివిధ వృత్తుల సామాన్య ప్రజలు, వివిధ జనసముహాలు కలిసికట్టుగా ఆయన వెంట నడిచారు. ఆ కారణంగా అతిత్వరలో ఈ పోరాటం పలు ప్రాంతాలకు వ్యాపించింది. 1830 నుండి 1900 వరకు సాగిన ఈ పోరాటంలో దూదు మియాకు వారసులుగా నోయామియా, బనీ అమీర్ మియా తదితరులు భాగస్వామ్యం వహించారు.
ఈ పోరాటాలు చాలా వరకు ప్రారంభదశలో మతం పునాదుల మీద, మత సంస్కరణల లక్ష్యంగా ఆరంభమైనప్పటికీ, వలస పాలకుల దోపిడికి ప్రజలు గురికావటం గమనించి తమ దశను-దిశను మార్చుకుని, పరాయి పాలకుల దాస్యం నుండి ప్రజలకు విముక్తి కలుగచేయాలన్న వస్త్రృతత లక్ష్యంతో కంపెనీ పాలకులు, ఆ పాలకుల తొత్తుల మీద తిరుగుబాటుకు బాటలు వేశాయి. ఈ తిరుగుబాటు సమయంలో మతంతో ప్రసక్తి లేకుండా ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారంతా ఆ యోధుల ఆగ్రహానికి గురివావటం విశేషం. ఆ తరువాత బ్రిటిష్ పాలకులను తరిమికొట్టేందుకు సాగిన పలు తిరుగుబాట్టకు ప్రేరణగా నిలిచి స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు ఈ పోరాటాలు బాటలు వేశాయి. బ్రిటిష్ పాలన మీద విచ్చుకత్తులతో విరుచుక పడి అగ్నియుగాన్ని సృష్టించిన, విప్లవకారులకు మార్గదర్శకం కావటమేకాకుండా స్ఫూర్తిదాయ కంగా నిలిచినందున ఆ పోరాట వీరులను స్మరించిన స్వాతంత్య్రో ద&్యమ చరిత్ర అసంపూర్ణం.
-సయ్యద్ నాసిర్ అహ్మద్