ధ్వంసం చేసిందెవరు? అభివృద్ధి చేసిందెవరు?!


”కుమ్మరి సారెపై కూర్చున్న ఈగ చుట్టూ తిరుగుతూ తానే కుండలు చేశానని భ్రమిస్తుంది
హైదరాబాద్‌కు వచ్చి లాభాలు గడించి తామే అభివృద్ధి చేశామని భ్రమింప చేస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు”
హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముసాయిదా రూపొందించే సమ యంలో సీమాంధ్రులు మళ్లీ కుట్రల రాజకీయాలకు తెరతీశారు. తాము వచ్చే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా మని చెప్తున్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే వళ్లించడం ద్వారా నిజం చేయ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పా టుకు ముందు హైదరాబాద్‌ అంటే ఎవరికీ తెలియదని, తాము వచ్చే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చామని కూడా గొప్పలు చెప్పుకుంటారు. ”కుమ్మరి సారెపై కూర్చున్న ఈగ చుట్టూ తిరుగుతూ తానే కుండలు చేశానని భ్రమిస్తుంది. అలాగే హైదరాబాద్‌కు వచ్చి లాభాలు గడించి తామే అభివృద్ధి చేశామని భ్రమింప చేస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు”. నరం లేని నాలుక ఎంతటి అబద్ధాన్నైనా సులభంగా వల్లెవే స్తుందనడానికి ఇప్పటి సీమాంధ్ర నాయకుల మాటలు, చేష్టలే సజీవ సాక్ష్యం. హైదరాబాద్‌పై.. ఈ మహానగర అభివృద్ధిపై కారు కూతలు కూస్తోన్న సీమాంధ్రులకు ఇప్పటికే తెలంగాణవాదులు పలు పర్యాయాలు సమాధానాలిచ్చారు. అయినా తమ చేతుల్లో ఉన్న మీడియాను అడ్డంపెట్టుకొని తమ అబద్ధాల ప్రచారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సీమాంధ్రుల విష ప్రచారాన్ని నిజమేననుకొని అక్కడి పట్టణ ప్రాంత ప్రజలు కృత్రిమ ఉద్యమంలో పావులుగా మారుతున్నారు. హైదరాబాద్‌పై తెల్లవారింది మొదలు రాత్రి పొద్దుపోయే దాక అసత్యాలు, అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తున్న శక్తులకు సమాధానమిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది 1956లో. కానీ హైరదాబాద్‌ ఆవిర్భవించింది 1591లోనే. 1763లో హైదరాబాద్‌ గోల్కొండ రాజ్యానికి రాజధాని అయింది. అప్పటి నుంచి 1948 వరకు హైదరాబాద్‌ గోల్కొండకు రాజధా నిగా ఉంది. 1948 నుంచి 1956 వరకు దక్కన్‌ ప్రాం తం హైదరాబాద్‌ స్టేట్‌గా ఉండేది. 1763 నుంచి 1956 వరకు 193 ఏళ్ల సుదీర్ఘ కాలం హైదరాబాద్‌ గోల్కొండ, హైదరాబాద్‌ స్టేట్‌కు రాజధానిగా ఉంది. నాలుగు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న హైదరాబాద్‌ రెండున్నర శతాబ్దాలకు పైగా పరిపాలనా కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి 57 సంవత్సరాలు మాత్రమే అయింది. అంతకు రెండు శతాబ్దాల పూర్వమే హైదరా బాద్‌ సుసంపన్నమైన నగరం. నాలుగు శతాబ్దాల హైదరాబాద్‌ చరిత్రలో ఇరానియన్లు, కాయస్తులు, సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, తమిళులు, కన్నడులు, మహారాష్ట్ర వారు, పంజాబీలు తదితరులు వలస వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు. హైదరాబాద్‌ నగరం 660 గ్రామాల్లోని 50 లక్షల ఎకరాల నిజాం సర్ఫేకాస్‌ భూముల్లో చెమటోడ్చి పన్నులు కట్టిన అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజల సొత్తు. 1956కు ముందే ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రం. కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో నిర్మించిన బంగారు నగరం. అప్పట్లో హైదరాబాద్‌ భూతల స్వర్గం. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో 139 పెద్ద చెరువులు, 310 చిన్న చెరువులు, మూసీ నదిపై అనేక ఆనకట్టలు ఉండేవి. హుసేన్‌సాగర్‌, మీర్‌ ఆలం చెరువుల నుంచి నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు అప్పట్లోనే హైదరాబాద్‌ జలమండలిని ఏర్పాటు చేశారు. 1868లోనే హైదరాబాద్‌లో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పడింది. 1869లో మునిసిపల్‌ పరిపాలన విధానం అమల్లోకి వచ్చింది. మహానగరంలో 15 వందలకుపైగా చారిత్రక కట్టడాలు, సహజసిద్ధ నిర్మాణాలు ఉన్నాయి. 1871 నుంచి 1948 వరకు హైదరాబాద్‌లో నిజాం ప్రభుత్వం వందలాది పరిశ్రమలను ఏర్పాటు చేసింది. కానీ ఎక్కడ కాలుష్యం తాలూకు అవశేషాలు కూడా కానవచ్చేవి కాదు. హైదరాబాద్‌ స్వచ్చమైన జలాలు, తోటలతో ప్రశాంతంగా ఉండేది. ఆ రోజుల్లోనే 175 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హైదరాబాద్‌ మనది.
హైదరాబాద్‌లో 1864లోనే రెవెన్యూ సేవలు ప్రారంభమయ్యాయి. 1866లో కస్టమ్స్‌, వైద్యశాల, మొదటి రైల్వేలైను (బొంబాయి-రాయచూర్‌), జిల్లాల నిర్మాణం ప్రారంభమైంది. 1867లో అటవీ, ఎండోమెంట్‌, ప్రింటింగ్‌, స్టేషనరీ శాఖల సేవలు అందుబాటులోకి వచ్చాయి. 1869లో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, పోస్టల్‌, మునిసిపల్‌ శాఖలు సేవలు ఆరంభించాయి. 1870లో విద్యాశాఖ, 1875లో సర్వే, 1876లో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌, 1881లో జనాభా గణన, 1882లో ఎక్సైజ్‌, 1883లో పోలీస్‌, 1892లో గనులు పరిశ్రమలు, వాణిజ్య శాఖల సేవలు మొదలయ్యాయి. 1896లో నీటి పారుదల శాఖ ద్వారా వ్యవసాయ భూములకు నీరందించడం, నీటి తీరువా వసూళ్లు మొదలయ్యాయి. తద్వారా 19వ శతాబ్దానికి పూర్వమే హైదరాబాద్‌ స్టేట్‌లో అన్ని కీలక పరిపాలన శాఖల ద్వారా పౌరసేవలు, పరిపాలన వ్యవహారాలు సాగేవి. 1911లోనే స్టేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌, 1913లో హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌, తర్వాతి సంవత్సరంలో ఆర్కియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌ 1932లో పురుడుపోసుకుంది. తద్వారా ప్రజలకు రేడియో ప్రసారాలను స్వాతంత్రానికి పూర్వమే అందుబాటులోకి తెచ్చింది.
1909 ఇండియా ఇంపీరియల్‌ గెజిట్‌ ప్రకారం హైదరాబాద్‌ భారత్‌లోని నాలుగో అతిపెద్ద నగరం. నాటి నగర జనాభా ఐదు లక్షలు. 19వ శతాబ్దం మొదటి దశకంలో ఢిల్లీ కంటే హైదరాబాద్‌ జనాభానే ఎక్కువ. నిజాం రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో రాకపోకలకు అవకాశమేర్పడింది. నిజాం రాజ్యంలో, హైదరాబాద్‌లో ఎనిమిది విమానాశ్రయాలు ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ పూలతోటలు, జలాశయాలు ఉండేవి. క్రీడామైదానాలు, సీసీ రోడ్లు, విశాలమైన భవంతులు అప్పుడే నిర్మించారు. 1921లోనే నిజాం నవాబు ఎంతో ముందు చూపుతో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించారు. ఐదు లక్షల జనాభా కోసం నిర్మించిన డ్రెయినేజీ వ్యవస్థను ప్రస్తుత పాలకులు పెద్దగా మెరుగుపర్చలేదు. 450 చిన్నా, పెద్ద చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో కానరాకుండా పోయాయి. 169 జలాశయాలు పూర్తిగా ఉనికిని కోల్పోయాయి. 1956లో కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ ధ్వంసం మొదలైంది. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న లక్షలాది ఎకరాల నిజాం భూములపై గద్దల్లా వాలిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంత వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలను కొళ్లగొట్టిన బకాసురులు నయా పారిశ్రామికవేత్తల అవతారం ఎత్తారు. ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా చెల్లుబాటవుతున్నారు.
స్వచ్ఛమైన నీటితో అహ్లాదభరితంగా ఉండే హుస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో ఇప్పుడు నిలబడలేని పరిస్థితి కల్పించింది ఎవరు? హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు కృష్ణా పరివాహక ప్రాంతం. ఇక్కడి ప్రజలకు తాగునీటిని కూడా కృష్ణ జలాల్లోంచే అందించాలి. కానీ దూష్ట ప్రభుత్వాలు కృష్ణా జలాలను తమ పొలాల్లోకి పరుగులు పెట్టించి గోదావరి బేసిన్‌లోని మంజీరా నీటిని హైదరాబాద్‌కు తాగునీటి కోసం తరలించారు. తద్వారా నిజాం కాలంలో లక్షలాది ఎకరాలకు సాగు నీరందించిన నిజాంసాగర్‌, ఘనపూర్‌ ఆనకట్టలు వట్టిపోయాయి. వందేళ్లకు పైగా నగరానికి తాగునీరందించిన గండిపేట, హిమాయత్‌సాగర్‌లు సీమాంధ్రుల రియల్‌ ఎస్టేట్‌ దాష్టీకానికి ఉనికిని కోల్పోతున్నాయి. సరూర్‌నగర్‌ చెరువు, ఉప్పల్‌, మీరాలం, సఫిల్‌గూడ చెరువుతో పాటు ఎన్నో జలాశయాలు కబ్జాలకు గురయ్యాయి. ఫలితంగా ఒకప్పుడు 50 అడుగుల్లోనే నీరు పడే హైదరాబాద్‌లో ఇప్పుడు 500 అడుగుల వరకు బోర్లు వేయాల్సిన దుస్థితి దాపురించింది. సీమాంధ్రులు గొప్పగా చెప్పుకుంటున్న నెక్లెస్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, ఫిల్మ్‌సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్‌, ల్యాంకో హిల్స్‌, మల్టీప్లెక్స్‌లు హైదరాబాద్‌ అభివృద్ధికి ఎప్పటికీ దిక్సూచీ కాబోవు. ఒకప్పుడు వందలాది ఎకరాల పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరంగా కనిపించే నగర శివారు ప్రాంతాలు ఇప్పుడు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. సీమాంధ్రులు నిర్వచిస్తున్న నయా అభివృద్ధి కారణంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు మృత్యు కుహరాలుగా రూపాంతరం చెందాయి. మియాపూర్‌, పటాన్‌చెరువు, నాచారం, మల్లాపూర్‌, జీడిమెట్ల, కాటేదాన్‌ పారిశ్రామిక వాడలు నగరాన్ని కలుష్యభరితం చేస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏటా ఎన్నో కొత్త వ్యాధులకు కారణమవుతున్నా, వాటి శుద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధి లేకుండా పోయింది. దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని సిరీస్‌ కంపెనీ దశాబ్దాల పాటు విడిచిపెట్టిన కలుషిత నీటి వల్ల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. పటాన్‌ చెరువు నుంచి పశ్చిమం దిశగా ప్రవహించే నక్కలవాగు ఒకప్పుడు 40 గ్రామాలకు తాగునీటిని అందిస్తే ఇప్పుడు అందులో 18 కాలుష్యం బారినపడ్డాయి.
నిజాం కాలంలో ఏర్పడిన ఈసీఐఎల్‌, ఐడీపీఎల్‌, ఆల్విన్‌, ప్రాగాటూల్స్‌, రిపబ్లికన్‌ ఫోర్బ్‌, హెచ్‌ఎంటీ, బేకరైట్‌ హేలం, వరంగల్‌ ఆజంజాహీ మిల్స్‌ సమైక్యరాష్ట్రంలో మూతపడ్డాయి. 1956 నాటికే హైదరాబాద్‌లో ఆజామాబాద్‌, ముషీరాబాద్‌, కవాడిగూడ, సనత్‌నగర్‌తో పాటు మరికొన్ని పారిశ్రామిక ప్రాంతాలుండేవి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత సీమాంధ్రులు మిడతల దండులా హైదరాబాద్‌పైకి వలసల దండెత్తారు. దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ మొదలు చౌటప్పుల్‌ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా సీమాంధ్రుల వాణిజ్య సంస్థలు వెలిశాయి. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా, శాంతా బయోటెక్‌, సిరీస్‌, రాంకీ, సత్యం (మహీంద్ర సత్యం), నాట్కో, మ్యాట్రిక్స్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, జయభేరి, లాంకో, బొమ్మన, చందన తదితర పరిశ్రమలు, వ్యాపార సంస్థల ప్రవేశంతో హైదరాబాదీలకు ఉపాధి లేకుండాపోయింది. హైదరాబాదీ స్పెషల్‌ ఇరానీ చాయ్‌ని ఇప్పుడు వెదుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. సినిమాలు, హోటళ్లు, టూరిజం పేరుతో తెలంగాణ భూములను కొళ్లగొట్టారు. ఒక్క వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 72 వేల ఎకరాల ప్రభుత్వ భూములను బకాసురులు కాజేశారు. ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ కోసం 250 ఎకరాల స్థలాన్ని గచ్చిబౌలి సమీపంలోని మణికొండ జాగీర్‌కు చెందిన నానక్‌రామ్‌ రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన లావుణీ పట్టా భూములను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధి మండలి (ఏపీఐఐసీ) పేరిట నామ మాత్రపు ధరకు తిరిగి తీసుకొని పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేశారు. భవిష్యత్‌లో ప్రజా అవసరాలకు గజం జాగా కూడా లేకుండా చేసేందుకు సీమాంధ్ర పాలకులు కంకణం కట్టుకున్నారు. బేగంపేటలో విమానాశ్రయం ఉండగానే శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో చంద్రబాబునాయుడు వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించారు.
175 చదరపు కిలోమీటర్ల పరిధిలోని హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను 6,876 చదరపు కిలోమీటర్లకు పెంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ మార్చడంలోనే పెనుకుట్ర దాగుంది. హైదరాబాద్‌పై గుత్తాధిపత్యం కొనసాగించేందుకే రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని హెచ్చు భూభాగాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మింగేసింది. తద్వార సీమాంధ్ర పెత్తందారుల భూదాహం తీర్చుకుంది. కొంతమంది నాలుగైదు ఏళ్లలోనే బిలియనీర్లుగా మారిపోయారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ 1909లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు ఆరోస్థానానికి పడిపోయింది. అంటే హైదరాబాద్‌ను సీమాంధ్రులు అభివృద్ధి చేశారా? విధ్వంసం సృష్టించారా? స్వాతంత్రం వచ్చేనాటికి సకల సంపదలు, మిగులు బడ్జెట్‌లో ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌కు, రాజాజీ ఆదేశంతో మద్రాస్‌ను వదిలి కాగితాలతో కర్నూల్‌కు చేరుకున్న సీమాంధ్రులు పోలిక ఎక్కడిది. వాళ్లు హైదరాబాద్‌ను చేశారా? ఇక్కడ వ్యాపారాలు చేసి స్థితిమంతులుగా మారారా? హైదరాబాద్‌ను, తెలంగాణను సర్వం దోచుకుని ఆకాశ హర్మ్యాలు నిర్మించి హైదరాబాద్‌ చారిత్రక, వారసత్వ కట్టాలను ధ్వంసం చేసింది ఈ సీమాంధ్రులు కాదా? ఇప్పుడు వాళ్లే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల ఆకాంక్షను అడ్డుకునేందుకు అనేక కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారు. తమకు తెలిసిన అడ్డుపుల్ల రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ స్వాతంత్రానికి పూర్వం అభివృద్ధి, సీమాంధ్రులు సృష్టించిన విధ్వంసంపై చెప్పుకుంటే పోతే ఎన్నో మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. వాటిలో కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించాం. హైదరాబాద్‌ను సీమాంధ్రులు అభివృద్ధి చేసింది లేదు. కాలానుగుణంగా జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా హైదరాబాద్‌కు వచ్చి చేరిన మణిహారాలేమి లేవు. ఢిల్లీ, ముంబయి, చెన్సై, బెంగళూర్‌, కోల్‌కతా మెట్రో నగరాలకు ప్రజల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని ఆయా నగరాల అభివృద్ధి మాత్రమే వినియోగిస్తున్నారు. రాష్ట్ర వార్షికాదాయంలో 50 శాతం హైదరాబాద్‌ నుంచే సమకూరుతున్న ఇక్కడి ప్రజల కోసం మాత్రం సీమాంధ్రులు వెచ్చిందిస్తుంది బహు స్వల్పం. హైదరాబాద్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సీమాంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసి జబ్బలు చరుచుకుంటున్నారు. పైకి వాళ్లే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని బుకాయిస్తున్నారు.