తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహుజన, మైనార్టీలు భాగస్వామ్యం కావాలి


సావిత్రీబాయి పూలే అధ్యయన వేదిక (ఓయూ) సెమినార్‌లో వక్తల ఉవాచ
హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) :
తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహు జన, మైనార్టీలు భాగస్వామ్యం కావాలని వక్తలు కోరారు. సావిత్రీ పూలే అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ హాల్‌ లో ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు, బహుజనుల భవిష్యత్తు.. చర్చ’ సదస్సులో పలువురు వక్తలు పాల్గొని తమ అభిప్రా యాలను వెలిబుచ్చారు. పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ వివేకానంద మాట్లాడుతూ, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమం లో ఎన్నో త్యాగాలు చేశామని అన్నారు. ఇన్ని త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో దళిత, బహుజనులకు అన్నింటా పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. డాక్టర్‌ సునీత, డాక్టర్‌ పద్మజా షా, కె. సుజాత, డాక్టర్‌ సత్యలక్ష్మి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే, అంబేద్కర్‌ రచనలు, జీవితాంశాలను పాఠ్యాంశాలు చేర్చాలని డిమాండ్‌ చేశారు. వలసవాద పాఠ్యాంశాలను సమూలంగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. రకరకాల పేర్లతో లాక్కొన్న దళిత, గిరిజనుల భూములను తిరిగి ఇప్పించాలని కోరారు. దూరాక్రమణకు గురైన భూములను మహిళల పేర్లపై పట్టా చేసి ఇవ్వాలని, గొలుసుకట్టు చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని కోరారు. బంజరు, బీడు భూములను వ్యవసాయ కుటుంబాలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కుల వృత్తులకు అవసరమైన అనుబంధ పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు. ఇండస్ట్రియలిస్ట్‌ సరోజ వివేక్‌, రచయిత పసునూరి రవీందర్‌, డాక్టర్‌ లలిత, జూపాక సుభద్ర, గోగు శ్యామల, తేజస్విని మాట్లాడుతూ వరంగల్‌ ఆజంజాహీ మిల్స్‌, సర్‌సిల్క్‌ మిల్స్‌, డీబీఆర్‌, బోధన్‌ షుగర్స్‌, ఐడీపీఎల్‌, ఎఫ్‌సీఐ, ఆల్విన్‌ తదితర పరిశ్రమలను తిరిగి తెరిపించాలని కోరారు. గ్రామాల్లో ప్రజలకు సరిపడినంతగా వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రజలు, మహిళల ఆరోగ్య భద్యతను పూర్తిగా ప్రభుత్వమే నిర్వర్తించాలని అన్నారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, టెక్నాలజీ, అగ్రికల్చర్‌ కళాశాలలు స్థాపించాలని డిమాండ్‌ చేశారు. మ్యాన్‌ హోల్స్‌, డ్రెయినేజీల్లోకి మనుషులను దింపే పద్ధతికి స్వస్తి పలికి, మెకనైజేషన్‌, రోబోటైజేషన్‌ స్కావింజింగ్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. సూరేపల్లి సుజాత, పిడుగు మంజుల, పులి కవిత, కె. రాధ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతివాడలో మెకనైజేషన్‌ సిస్టంలో పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలని, బాలకార్మిక వ్యవస్థ, స్త్రీ ట్రాఫికింగ్‌, జోగిని వంటి మనువాద పితృస్వామ్య దురాచారాలను నూతన తెలంగాణలో రూపుమాపాలని కోరారు. అన్ని రంగాల్లో మహిళలు, బహుజనులకు వాటా పెంచాలని కోరారు. ‘జనంసాక్షి’ ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ మాట్లాడుతూ, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం నిర్మితమవుతోందని తెలిపారు. ఆ త్యాగాలన్నీ దళిత, బహుజన, మైనార్టీలవేనని తెలిపారు. దళితులు, దళిత మహిళలు సీఎం కావాలని, వారు కూడా ఇతరుల ఆధిపత్యంలో కాకుండా స్వయం నిర్ణయాలు తీసుకునే వారు కావాలని కోరారు. తెలంగాణ సింహాలు ఒక గొర్రె నాయకత్వంలో పనిచేయబోవని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలను అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారని, కానీ అంబేద్కర్‌ కలలు కన్నట్టుగా దమాషా పద్ధతిలో దళిత, బహుజన, మైనార్టీలను చట్టసభలకు మాత్రం పంపడం లేదని అన్నారు. అంబేద్కర్‌ విగ్రహాలు పెట్టాల్సిందేనని, అదే సమయంలో ఆయన కలలు కన్నట్లుగా ఈ వర్గాలను చట్టసభలకు పంపాలని కోరారు. ముస్లింలను రజాకర్లుగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. రజాకర్లు దేశ్‌ముఖ్‌లు సృష్టించుకున్న ప్రైవేటు సైన్యమని స్పష్టం చేశారు. నిజాం నూటికి నూరుపాళ్లు లౌకికవాది అని, అన్ని మతాలు, భాషలు, సంస్కృతులను సమానంగా చూసేవారని తెలిపారు. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో 40 తెలుగు మీడియం పాఠశాలల స్థాపనకు అన్ని నిధులు సమకూర్చారని గుర్తు చేశారు. దేశంలోనే పేరెన్నికగన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆయన స్థాపించేందనన్నారు. హైకోర్టు నిర్మాణ సమయంలో దానికింద ఉన్న దేవాలయం తొలగింపునకు పూనుకోగా పునాదుల్లోనే అన్యాయం ఉంటే న్యాయం ఎక్కడుంటుందని ప్రశ్నించాడని తెలిపారు. ముస్లిం అలీగఢ్‌ యూనివర్సిటీకి చందా అడిగినప్పుడు కూడా బనారస్‌ హిందూ యూనివర్సిటీకి ఎంతైతో ఇచ్చానో అంతే ఇస్తానని, తనకు ప్రజలంతా సమానమని గుర్తు చేశారు. కేవలం ఏడాదిన్నర రజాకర్ల కాలాన్ని బూచీగా చూపి ముస్లింలను దూరం పెట్టే ప్రయత్నం చేయవద్దని, నిజాం నవాబులు ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను అందరూ గుర్తుంచుకోవాలని కోరారు