విక్రాంత్‌ జలప్రవేశం


కొచి, ఆగస్టు 12 (జనంసాక్షి) :
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచి నౌకాశ్రయంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్‌, నావల్‌ చీఫ్‌ డీకే జోషి సమక్షంలో భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సతీమని ఎలిజబెత్‌ ఆంటోనీ విక్రాంత్‌ను జలప్రవేశం చేయించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే పూర్తయిందని, మిగతా దశల్లో నిర్మాణం పూర్తి చేస్తామని నౌకాదళ అధికారులు తెలిపారు. విక్రాంత్‌ 2018లో నౌకాదళం అమ్ముల పొదిలో చేరుతుందని పేర్కొన్నారు. 2016 నాటికి పరీక్షలకు సిద్ధం కానుందని వారు తెలిపారు. ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా దేశాలకు మాత్రమే ఉంది. 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వైశాల్యం గల విక్రాంత్‌ 37,500 టన్నుల బరువు మోయగలిగేలా రూపొందించారు. దీనిపై రెండు టేకాఫ్‌ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్‌ పాయింట్లు ఉంటాయి. మిగ్‌ 29 కే, కమోవ్‌ 31, తేలికపాటి యుద్ధ విమానాలు దీనిపై మోహరిస్తాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఎనిమిది డీజిల్‌ జనరేటర్లు, నాలుగు గ్యాస్‌ టర్బైన్లు అమర్చారు.