మేం కలిసుండమంటే సమైక్యాంధ్రని ఎలా అంటారు?


తెలంగాణను విజయమ్మ వేరుగా చూస్తుంది
కలుసుండడానికి దీక్ష అర్థరహితం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలు కలిసి సుండబోమంటే సమైక్యాంధ్ర కొనసాగించాలని వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోరడంలో అర్థం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కొదండరామ్‌ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్‌ విజయమ్మ దీక్షకు దిగుతుండడం దుర్మర్గమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్యం అంటే అందరు కావాలనుకున్నప్పుడనే కనీస జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. విజయమ్మ తెలంగాణను, తెలంగాణ ప్రజలను వేరుగా చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో దీక్ష చేసి ఏం సాధించాలనుకుంటున్నారో ప్రధాన ఎజెండా ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఓవైపు ప్రజలు కలిసి ఉండమని ఖరాఖండిగా చెపుతుంటే కలిసి ఉంచాలనడం ఎక్కడి న్యాయమన్నారు. కేంద్రం సమన్యాయం చేయలేదని ఆరోపిస్తున్న విజయమ్మ దీక్షతో తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. ఇప్పటికే తెలంగాణలో దుఖాణం ఎత్తేసినందున దమ్ముంటే రాజకీయ లబ్ధి కోసం దీక్షకు దిగుతున్నామని స్పష్టంగా చెప్పాలని సవాల్‌ విసిరారు. తాము తెలంగాణను కోరుకుంటున్నది ఏస్వార్థం కోసం కానే కాదన్నారు. ప్రజలంతా 60 ఏళ్లకు పైగా పోరాటం చేస్తున్న ఫలితంగానే కేంద్రం రాష్ట్రం ఇచ్చిందని, దీనిని అడ్డుకోవాలని వైసీపీ చూడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.