పునాదులు లేని ఉద్యమానికిమీడియా అధిక ప్రాధాన్యం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించి అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించగానే సీమాంధ్ర ప్రాంతంలో 2009 మాదిరిగానే మళ్లీ కృత్రిమ ఉద్యమం చిన్నపాటి తుంపరలా ప్రారంభమైంది. ఓ నాలుగైదు రోజుల పాటు సీమాంధ్ర ప్రాంతంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించిన వారే లేరు. హైదరాబాద్‌ను, తెలంగాణ ప్రాంత వనరులను దోచుకొని కుభేరులుగా మారిన పెట్టుబడిదారులు ఇక తమ దోపిడీ సాగదని బెంబేలెత్తిపోయి సీమాంధ్ర ప్రాంతంలో డబ్బు సంచులు వెదజల్లి మరీ కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దానికి ఆ పెట్టుబడిదారుల చేతుల్లోని మీడియా అధిక, అనవసర ప్రాధాన్యం కల్పిస్తూ ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నూటికి నూరు పాళ్లు ప్రయత్నిస్తోంది. ఇందుకు ఒకరి ఇద్దరు అని కాదు అందరు మీడియా సంస్థల అధిపతులు బాధ్యులే. సీమాంధ్ర ప్రాంతం నుంచి పత్రికలు, చానళ్లు నిర్వహిస్తున్న ఏ ఒక్కరూ విభజన వేళ సంయమనం పాటించింది లేదు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల అభ్యంతరాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మక భూమిక వహించిందీ లేదు. తెలంగాణ సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయడం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయని ఆరోజే బుద్ధి జీవులు గగ్గోలు పెట్టారు కూడా. తెలుగువారు, తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే విశాల దృక్పథంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు అనేక తర్జనభర్జనల అనంతరం అప్పటి పాలకులు అంగీకరించారు. మిగులు బడ్జెట్‌లో ఉండే హైదరాబాద్ స్టేట్ అప్పటికే దేశంలో సంపన్నమైన రాష్ట్రాల్లో ప్రముఖమైనది. కనీసం కార్యాలయాలకు కూడా దిక్కులేక డేరాల కింద ఆఫీసులు నడుపుకున్న ఆంధ్ర సర్కారు, అక్కడి ప్రజలు ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు అనంతరం పోలోమని హైదరాబాద్‌కు కట్టకట్టుకొని వచ్చేశారు. వస్తూనే ఇక్కడి ప్రజల జీవనోపాధులను దెబ్బతీశారు. తెలుగు భాషను సాకుగా చూపి ఇక్కడి నిరుద్యోగులకు (ఉర్దూ మీడియంలో చదివిన వారికి) ఉద్యోగాలు దక్కకుండా చేశారు. ఈక్రమంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, సహజ న్యాయసూత్రాలు బుట్టదాఖలయ్యాయి. 1956లో ప్రారంభమైన సీమాంధ్రుల దోపిడీ విధానాలు ఇంకా కొనసాగుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నా తమ దోపిడీ విధానాలను, ధ్వంస రచనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవేవీ సీమాంధ్ర మీడియా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు కారణాలు చెప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల వాంఛ, హక్కులపై గొంతు విప్పడం, ప్రజల న్యాయమైన డిమాండ్ వెనుక కారణాలను సీమాంధ్ర ప్రజలకు చెప్పడం ఆ మీడియాకు ఇష్టం లేదు. చరిత్ర అంటే మాదే.. సమాజ వైతాళికులం మేమే అనే దురంహకారం ప్రదర్శించే సీమాంధ్రులు తాము చెప్పిందే చరిత్ర అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనిది, కృత్రిమమైనది, పునాదులు లేని ఉద్యమానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ చూపిందే మళ్లీ మళ్లీ చూపిస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. సీమాంధ్రలో కేవలం పది శాతం మంది ప్రజలు మాత్రమే సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, వారితో హైదరాబాద్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహించే పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని సీమాంధ్రకు చెందిన ప్రజాసంఘాలు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరీ చెప్పాయి. పదికి పైగా సంఘాలు పాల్గొన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సీమాంధ్ర మీడియా పూర్తిగా విస్మరించింది. సీమాంధ్రలో జరుగుతున్న వాస్తవాలను ప్రతిబింబించే వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. అదే సీమాంధ్రలో పది శాతం మంది నిర్వహిస్తున్న ఉద్యమాన్ని మాత్రం భుజానికెత్తుకొని చూపుతోంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా ఇంకా దింపుడుకళ్లం ఆశతో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధానిగానో కొనసాగిస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగేలా చేస్తోంది. సీమాంధ్రలో ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె బ్రహ్మాండంగా సాగుతోందని ప్రచారం చేస్తోంది. కానీ అదే సమ్మెకు దళిత, బహుజనులు, మైనార్టీలు దూరంగా ఉన్నారని, వారంతా పనులకు వెళ్తున్నారనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. సీమాంధ్రలో పీకల్దాక తాగి కొట్టుకొని చనిపోయిన వాళ్లను సమైక్యాంధ్ర కోసం బలిదానాలు చేసుకున్నారని, త్యాగమూర్తులుగా చిత్రీకరిస్తోంది. మీడియా మాది ఏం చెప్పినా చెల్లుతుంది అనే దురహంకారం సీమాంధ్ర మీడియా యాజమాన్యాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా ఉన్నా దాన్ని ఎక్కడా ప్రతిఫలింపజేయడం లేదు. సీమాంధ్రలోని హెచ్చు మంది ప్రజలు తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతున్నా, ఈ డిమాండ్ వినిపించేందుకు హైదరాబాద్‌కు వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా సీమాంధ్ర మీడియా పట్టించుకోలేదు. తెలంగాణ మీడియా చానెళ్లు, పత్రికలు మాత్రమే ఆ వార్తలను పతాక శీర్షికల్లో ఇస్తున్నాయి. జై ఆంధ్ర డిమాండ్‌కు కూడా తెలంగాణ ప్రతికలు, చానెళ్లే చోటు కల్పిస్తున్నాయి. అంటే జై ఆంధ్ర అనేవారి ప్రజల గొంతుకలు ప్రతిఫలింపజేసే ప్రయత్నం కూడా సీమాంధ్ర మీడియా చేయడం లేదు. అదే సమయంలో పునాదుల లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మాత్రం భుజాలకెత్తుకొని ప్రోత్సహిస్తున్నాయి. సమైక్యాంధ్రకు ప్రాతిపదిక ఏమిటీ? ఇన్నాళ్లు లేని ఉద్యమం ఇప్పుడే ఎందుకు పుట్టుకువచ్చింది? మీడియా చేస్తున్న ప్రచారంలో నిజమెంతా? సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులు (సీఎం సహా) చేస్తున్న అడ్డుగోలు వాదనలు వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటీ? అనేవి చెప్పే ధైర్యం ఒక్క మీడియా కూడా చేయడం లేదంటే సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమం వెనుక వీరి పాత్ర కూడా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం కూడా ఆయా సంస్థలు చేయబోవు. ఎందుకంటే వారికి హైదరాబాద్ కావాలి.. తెలంగాణ వనరులు అప్పనంగా దోచుకోవాలి. దోచుకొని.. దాచుకొని పథకంలో అంతా భాగస్వాములే. ఆ శక్తులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తెలంగాణ ప్రజలది. నిజాలను నిర్భయంగా చెప్పాల్సిన అవసరం తెలంగాణ మీడియాది.