భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళల పాత్రనవభారత నిర్మాణంలో…
స్వాతంత్య్రోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న దశలో ఉద్యమంలో భాగస్వాములైన ఆనాటి మహిళలంతా అదృష్టవంతులు ఆ తల్లులంతా తాము కలలుగన్న స్వతంత్ర భారతావనిని కళ్ళారాగాంచటమేగాక, కొందరు నవభారత నిర్మాణంలో బృహత్తరమైన బాధ్యతలు నిర్వహించారు.
ఈ తరంలోని ముఖ్యులలో ఒకరు జుబేదా బేగం. చిన్ననాటినే ఉద్యమబాటన నడక ప్రారంభించిన ఆమె ఆద్భుత వక్త. సుసంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె తన సర్వస్వ జాతీయోద్యమానికి సమర్పించారు. చివరి దశలో కటిక పేదరికం అనుభవిస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ స్వీకరించ నిరాకరించారు. పెన్షన్ స్వీకరించటమంటే తన మాతృదేశ సేవకు ఖరీదు కట్టడమేనంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండా గడిపారు. ఈ రకంగా భారత ప్రభుత్వం ఇవ్వజూపిన అనేకరకాల ఆర్థిక సహాయాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించిన వారెందరో ఉన్నారు.
ఈ మేరకు ఉద్యమంలో భాగంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ప్రముఖుల్లో శ్రీమతి అముతుస్సలాం ఒకరు. నౌఖాళి మతకలహాల నివారణకు గాంధీజీ ఆమెను పంపారు. కలహాల నివారణకు గ్రామీణులు సహకరించకుండా మంకుపట్టు పట్టడంతో 22 రోజులపాటు నిరాహారదీక్ష పూని ఆ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పిన ఆమె గాంధీజీ ప్రశంసలందుకున్నారు. బేగం రహనా తయ్యబ్జీ గాంధీజీకి ఉర్ధూ భాషను నేర్పిన గురువయ్యారు. పండు వయస్సులో కూడా బేగం లుక్యాని పోరాట పటిమ చూపారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో బేగం ఫాతిమా ఇస్యాయిల్ చురుగ్గా వ్యవహరించారు. బొంబాయి నగరంలో 30 సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా శ్రమించి ఐదు లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్యిదిద్దడంలో అనితర సాధ్యమైన విజయాన్ని బేగం కుల్సుం సయాని సొంతం చేసుకున్నారు. ఆమె వయోజన విద్యావ్యాప్తి కోసం ప్రత్యేకంగా పలు భాషలలో రహబర్ అను పత్రికను కూడా నడిపారు. జాతీయోద్యమంలోని ప్రతి ఘట్టంలోనూ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమకారులచే హాజరా ఆపాగా (హాజరా అక్కయ్య) హాజరా అహమ్మద్ పిలిపించుకున్నారు. రష్యాను సందర్శించిన తొలి భారతీయ మహిళగా ఆమె ఖాతి గాంచారు. ఆంధ్ర రాష్ట్రంలోని మంతెనవారి పాలెంలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులలో ఆమె పాల్గొన్నారు. ఈ విధంగా అంకిత భావంతో విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఆదర్శవంతమైన సేవలకు అంకితమైన బేగం సుఫియా సోం, ఆత్మరక్షణకు ఆయుధం ధరించిన బుగం సుల్లానా హయాత్, గాంధీజీ నేతృత్వంలో ఆదర్శ వివాహాం చేసుకున్న బేగం అమానా ఖురేషి, పోరుబాటలో నడిచినందుకు అరెస్టయిన ఢిల్లీలోని తొలి మహిళా కార్యకర్త బేగం మహబూబ్ ఫాతిమా లాంటి వారెందరో ఉన్నారు.
తెలుగింటి ఆడపడుచులు
ఈ కోవకు చెందిన వారిలో తెలుగింటి ఆడపడుచులూ ఉన్నారు. అటువంటి వారలిఓ మహమ్మద్ గౌస్ ఖాతున్, హజరా బీబీ ఇస్మాయిల్, నఫీస్ అయేషా బేగం, దబియాబీ తదితరులు ఉన్నారు. బీరాల-పేరాల ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌస్ యోహిద్దీన్ బార్య ఖాతూన్, భర్తతో పాటుగా జైలుకు వెళ్ళకపోయినా ఉద్యమకారులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆతిధ్యమిస్తూ తన కుటుంబానికి చెందిన సర్వం ఉద్యమం కోసం వ్యయం చేసిఏశ్రీన త్యాగశీలి గాంధీజి అనుచరుడుగా రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఖద్దర్ ఇస్మాయిల్ భార్య హాజరా బీబీ గాంధీజి బాటన నడిచినందుకు ఆయె కుటుంబాన్ని వెలివేసిన వెరవని ధీమంతురాలు.
అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామానికి చెందిన రబియాబి భర్త మొహిద్దీన్ సాహెబ్‌తో కలిసి సత్యాగ్రహాంతో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఆంద్రావనిలో ఒక ముస్లిం మహిళ వ్యక్తిగత సత్యాగ్రహా ఉద్యమంలో బహిరంగంగా పాల్గొనటం ఇదే ప్రథమమని ఆనాడు పలువురు శ్లాఘించారు.. జాతీయోద్యమకారుడైన భర్త, ఆమెను పర్దాపద్దతి నుండి విముక్తి చేయడంతో ,రబియాబి మరింత ఉత్సాహాంతో స్వాతంత్య్రద్యమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ద వ్యతిరేక ప్రదర్శనలో స్వయంగా పాల్గొనటమే కాక యుద్ద వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యచకితులను చేశారు. ఆనాడు మహిళలకు జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు లేనందున ఆరెస్టు కాకుండా తప్పించుకున్నారు. స్వజనుల చేత పలు విమర్శలకు గురైనప్పటికి ఖాతరు చేయకుండా చివరి శ్వాస వరకు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ఆమె మానలేదు.
నైజాం విలీనోద్యమంలో….
స్వాతంత్య్రం సాధించాక ,ఇండియన్ యూనియన్‌లో నైజాం విలీనమవ్వాలన్నా డిమాండ్‌తో సాగిన పోరులో కూడా రాప్ట్రానికి చెందిన పలువురు ముస్లీం మహీళలు పాల్గొన్న దాఖలాలున్నాయి. ముస్లిం మహిళలకు ఉన్న మత ,సామాజిక బంధనాల మూలంగా పెద్ద సంఖ్యలో ఉద్యమ బాటన నడవలేకపోయినప్పటికి ,ఉద్యమకారులైన తమ బిడ్డలను ,భర్తలను ఎంతగానో ప్రోత్సహించారు. పరోక్షంగా సహకరించారు. ఈ విధంగా పరోక్ష సహాయం అందజేసిన వారెందరో ఉన్నప్పటికి అందరి వివరాలు తెలియరాలేదు.
రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్య్ర సమరయోధుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆ అదృష్టవంతురాలు నఫీస్ ఆయేషా బేగం. ఆమె హైదరాబాద్ నివాసి. ఆమె తండ్రి పేరు హామీద్ ఆలీఖాన్ .ఆమె 16-09- 1948 నుండి 17-9-1948 వరకు రెండురోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. నైజాం విలీనం కోరుతూ ఉద్యమించినందున ఆమె ప్రభుత్వం ప్రచురించిన గ్రంధాలలో కన్పించకపోవటం ఆశ్చర్యం కల్గించే అంశం.
తెలంగాణ పోరాటంలో ……..
ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ముస్లింలు తమ భాగస్వామాన్ని ఆందించారు. స్త్రీ ,పురుష భేదం లేకుండా ఆ పోరులో పాల్గొన్నారు. అటువంటి వారిలో రాజారాం గ్రామానికి చెందిన జైనాబి ఒకరు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆమె పోరాట నాయకులకు తన ఇంట రక్షణ కల్పించారు. పోలీసుల నుండి కాపాడారు. చివరికి ఆమె ఉద్యమకారులకు చేయూత నిచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ,శరీరం సహకరించని వృద్దాప్యంలో కూడా పోరాటయోధులను అటు రజకార్ల నుండి రక్షించుకునేందుకు ప్రాణాంతక సహసాన్ని ప్రదర్శించిన మహిళలు మనకు తారసపడతారు. జాతీయోద్యమంలో పాల్గొనటం మాత్రమే కాకుండా సామ్యవాద భావాలతో ప్రభావితమై ఇటు ఇండియన్ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం కోసం సాగిన పోరు, ఆతరువాత అటు తెలంగాణా రైతాంగ పోరాటంలో కూడా తమ త్యాగపూరిత భాగస్వామ్యాన్ని అందించిన మహిళలలో బేగం రజియా , జమాలున్నీసా బాజీ లాంటి వారున్నారు.
నైజాం వ్యతిరేకపోరాటం నుండి తెలంగాణ రైతాంగ పోరాటం వరకు ముస్లిం కుటుంబాలు ఉద్యమకారులను తమ కడుపులో పెట్టుకుని కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయుధాలు చేతపూని రణం చేసిన సాహసులైన వీరవనితలు ఉన్నారు. వడిసెల గిరగిర తిప్పుతూ శతృవు మీద దాడి జరిపిన సమశీల మహిళలు ఉన్నారు. ఆనాడు సామాజిక జీవన చరిత్ర గ్రంథాలలో తమదైన స్థానాన్ని సంపాదించుకోలేక పోయారు. అందువలన ఆ తల్లుల గురించి ప్రజలకు అతి తక్కువ మాత్రమే తెలిసింది.ప్రభుత్వం ప్రచురించిన గ్రంధాలలో కూడా మహిళామణులకు స్థానం లభించకపోవడం విచారకరం.
ఈ విధంగా పేర్కోంటు పోతే అనేక మంది మణిపూసల్లాంటి మహిళలను మనం ప్రస్తావించుకోవచ్చు ఈ మహిళల చరిత్రలు అక్కడక్కడా ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలో ,స్థానిక చరిత్ర గ్రంథాలలో ఉన్నాయి. ఆనాటి వారి త్యాగాల గురించి అందరికి తెలియాలంటే జాతీయ స్థాయి ప్రామాణిక చరిత్ర గ్రంధాలలో అన్ని సాంఘిక జనసముదాయాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులందరికి తగిన స్థానం కల్పించాలిజ ఆ లక్ష్యంగా చరిత్ర గర్భంలో దాగిన మరెందరో చరిత్రలనో పరిశోధనకుకలు వెలికి తీయాలి. ఆయా చరిత్రలను ఆయా ప్రాంతాయ భాషల్లో ప్రచురించాలి. ఆ చరిత్రలను పాఠ్యగ్రంథాలలో పొందుపర్చాలి. ఆనాటి త్యాగాల పరంపరకు భవిష్యత్తరాలను వారసులను చేయాలి.
ప్రస్తుతం భారతీయ ప్రధాన జన సముదాయాల మధ్యమానసిక అంతరాలు అపోహలు, అనుమానాలకు ప్రధాన కారణం ఆయా సాంఘీక జన సముదాయాల త్యాగమయి చరిత్రలను విస్మరించటమే. ఈ అవకాశాన్ని స్వార్ధపర రాజకీయ శక్తులు, వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారు.
ఈ ప్రమాద కర పరిస్థితికి ప్రతిగా, ఆ త్యాగాల స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ భారతదేశ బంగారు భవితకై నడుం కట్టేలా ప్రోత్సహించాలి. అందుకు ప్రజలుప్రభుత్వాలు సమకరించాలి. అప్పుడు మాత్రమే త్యాగసంపన్నులైన మన పూర్వీకులకు మనం ఘనమైన నివాళి అర్పించినవారం కాగలుగుతాం.
త్యాగాల చరిత్ర అందరికి తెలియాలి
ప్రజలక అన్ని సాంఘీక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. పలు సాంఘీక జనసముదాయాలు కలసిమెలసి సహజీవనం సాగిస్తున్న గడ్డ అయినటువంటి భరతభూమిలో ఆయా జనసముదాయాల మధ్యన సుహృద్యావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి త్యాగపూరిత చరిత్రలు మరొకరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతులైన ప్రజలందరి చరిత్ర అన్నిసాంఘీక జనసముదాయాలకు తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయాల మధ్యన పరస గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదవగాహన కారణమౌతుంది. ఆ సదవగాహన నుండిఇ సథ్భావన సహిషుణత ఉత్పన్నమౌతాయి. ఆ సహిష్ణుత, సామరస్యం శాంతి-స్నేహాలకు బలమైన పునాది అవుతాయి.
ఈ వాతావరణంలో లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మత విద్వేషాలు మట్టిలో కలసిపోయి మతసామరస్యం మరింతగా పటిష్టమౌతుంది. మతోన్మాద రాజకీయ శక్తుల కుట్రలు, కుయుక్తులకు అడ్డుకట్ట పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకు చేరువకాని ముస్లింల, ప్రదానంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో అతి చిన్న ప్రయత్నమిది.