సీఎం ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు?

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత, ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో పదవి నుంచి తప్పుకుంటానని మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. దీంతో అధినేత్రి ఆగ్రహానికి గురయ్యారు. ఒక దశలో ఆమె సీఎం నుంచి ముందస్తుగానే రాజీనామా లేఖ తీసుకున్నట్లు మీడియాకు లీకులందాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ సమక్షంలోనే కిరణ్‌ నుంచి సోనియా రాజీనామా లేఖ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కిరణ్‌ రాష్ట్ర విభజనపై నిర్వేదంగా మాట్లాడటం ఆయన పదవి ఊడినట్లేనని ప్రచారం జరిగింది. ఇంతలో ఏమైందో ఏమో కాని కిరణే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. దీంతో కిరణ్‌ మళ్లీ తెలంగాణపై అడ్డుపుల్ల రాజకీయాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పాటుపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి మరీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టారు. తాను రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చొని సామాన్యుడి వలె ప్రశ్నలు సంధించి తన రాజకీయ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. మీడియా సాక్షిగా అనేక అబద్ధాలు చెప్పి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారు. తన తప్పుడు గణాంకాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించారు. మొదట హైదరాబాద్‌లో 40 వేల నుంచి 50 వేల మంది వరకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదులు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టుతో పాటు వివిధ కోర్టుల పరిధిలో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదులు ఎంతమందో కూడా లెక్క సరిచూసుకోకుండా సీఎం నోటికి వచ్చిన సంఖ్య చెప్పారని అనుకోవడానికి వీల్లేదు. తెలంగాణ విడిపోతే ఒకేసారి 50 వేల మంది వరకు న్యాయవాదులకు ఉపాధి లేకుండా పోతుందని, వారంతా వట్టి చేతులతో ఆంధ్ర రాష్ట్రానికి చేరుకుంటారని చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా సీమాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. నిన్నటికి నిన్న ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అభ్యంతరాల కమిటీకి అదే తప్పుడు నివేదికలు అందజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల సంఖ్య మూడు వేలకు మించదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీఎంను కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. కేసీఆర్‌ చెప్పింది నిజమేనని సీఎం సహా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. కానీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా సీమాంధ్ర ప్రాంతంలో తాము సృష్టించిన కృత్రిమ ఉద్యమానికి సహజత్వం ఆపాదించాలని వారంతా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకు సీఎం ఊపిరిపోశారు. న్యాయవాదుల సంఖ్య మాదిరిగానే సీఎం హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో జీవనం సాగించే సీమాంధ్రుల సంఖ్యపై కూడా అసంబద్ధమైన లెక్కలు అధిష్టానం ముందుంచారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల జనాభా ఎంతో ముఖ్యమంత్రికి తెలుసు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా కూడా ఆయన స్పష్టంగా తెలుసు. కానీ హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 50 లక్షల మందికి పైగా సీమాంధ్రులు జీవనం సాగిస్తున్నారని తప్పుడు లెక్కల చిట్టా అధిష్టానం ముందుంచారు. అసలు హైదరాబాద్‌ జనాభే 50 లక్షల లోపు అయితే ఇక్కడ అంతే సంఖ్యలో సీమాంధ్రులు జీవనం సాగిస్తున్నారని చెప్పడం ద్వారా సీఎం అధిష్టానాన్ని కాదు సీమాంధ్ర ప్రాంత ప్రజలను తప్పుదోవపట్టించ చూశారు. అంతేకాదు రాష్ట్ర విభజనతో దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించాడు. తెలంగాణలో మావోయిస్టుల బెడద పెరిగిపోతుందని, ఉగ్రవాద సమస్య కూడా పేట్రేగుతుందని నివేదించారు. కిరణ్‌ చెప్పినవన్నీ అబద్ధాలే అనే విషయం అధిష్టానానికి తెలుసు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి పూర్వమే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఈ విషయమై అన్ని వర్గాల నుంచి సమాచార సేకరణ జరిపింది. అన్ని పార్టీల అభిప్రాయాలూ సేకరించింది. అయినా సీఎం అబద్ధాలు. అసంబద్ధమైన లెక్కలు చెప్పడం వెనుక ఉద్దేశ్యం సుస్పష్టం. ఇంతకాలం ఉమ్మడి రాజధానిలో తెలంగాణకు చెందాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అప్పన్నంగా కొళ్లగొట్టేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అది సాధ్యం కాదు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఈ ప్రాంతానికే చెందుతాయి. సీఎం వళ్లించిన అబద్ధాల్లో మరో కీలకమైన అంశం నీటి పంపిణీ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన నదలు కృష్ణా, గోదావరి. కృష్ణా నది జలాలు పూర్తిగా వినియోగమవుతుండగా, గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధానాలు లేవు. ఈ నదిపై చేపట్టిన ప్రాజెక్టులు ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వాటాలుండగా, గోదావరి జలాలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే చెందుతాయి. అయితే గోదావరిలో మిగులు జలాల వినియోగంపై అబద్ధపు ప్రచారం ద్వారా ఆ నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని సీమాంధ్ర సర్కారు ఎన్నో కుటిల యత్నాలు చేసింది. ఇప్పుడవేవి సాధ్యం కావని దొంగ ఏడుపులు ఏడుస్తోంది. పోలవరం నిర్మాణం ద్వారా కోస్తాంధ్ర ప్రాంతంలో మూడో పంటకు నీరివ్వాలనేది మరో ప్రయత్నం. ఈ ప్రాజెక్టు ఎత్తుపై తెలంగాణ ప్రాంతానికే కాదు ఒడిశా ప్రభుత్వానికి అనేక అభ్యంతరాలున్నాయి. ఇప్పుడు సమస్య జఠిలమై మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపైనే ప్రభావం చూపుతుందనేది సీఎం సహా సీమాంధ్ర నేతల అనుమానం. అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు న్యాయంగా దక్కాల్సిన నీటిని ఇవ్వడానికి తెలంగాణ ప్రజలకు ఏ అభ్యంతరాలు లేవు. వారి నీటిని అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా తెలంగాణ చేయబోదు. కానీ ప్రజల్లో అనవసర భయాందోళనలు రెచ్చగొట్టడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే తాపత్రయమే తప్ప ముఖ్యమంత్రికి మరే ఉద్దేశాలు లేవు. సీఎం కిరణ్‌ తాను ఒక ప్రాంతానికి మాత్రమే ప్రతినిధిని అని ఇది వరకే స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తి ఏలుబడిలో ఉండటం తెలంగాణకు మంచిది కాదు. ఇంతకాలం సీమాంధ్రులు చేసిన అబద్ధపు ప్రచారం రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారని. తీరా విభజన నిర్ణయం ప్రకటించాక  తెలంగాణ ఇస్తే సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతాయని చెప్తున్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అనే చర్చ పక్కనబెడితే ఎవరికి వారు విడిపోవడమే మంచిది.