అత్యాచార భారతం

సనాతన సంప్రదాయాలు, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ఎదుటి వారికి చెయ్యెత్తి నమస్కరించే మంచి మనసు, పెద్దలపై గౌరవం, స్త్రీలను దేవతలకు ప్రతిరూపంగా చూసే ఆధ్మాత్మిక భావన. భారత దేశాన్ని నిర్వచించడానికి, భారతీయుల మంచి తనాన్ని చాటి చెప్పడానికి వాడే ఉపోద్ఘాతం ప్రారంభంలో వాడే పదాలివి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని భారత దేశ ఔన్నత్యాన్ని గురించి నొక్కి చెప్పారు అప్పట్లో ఆర్యులు. కానీ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు స్త్రీ అంగడి బొమ్మలా, ఆటవస్తువులాగే ఉంది. మాతృస్వామ్య వ్యవస్థలో కొంతకాలం స్త్రీల ఆధిపత్యం నడిచి ఉండవచ్చుకానీ ఆ తర్వాత మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడ్చక తప్పని పరిస్థితి. ప్రపంచ దేశాలకు మేం అన్నింటా ఆదర్శం అని ఒకప్పుడు భారతీయులు గర్వంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక రంగంలో మాత్రం భారతదేశం శరవేగంగా దూసుకుపోతోంది. నిత్యం వందలాది ఘటనలతో సభ్య సమాజం తలవంచుకునే పరిస్థితులు కల్పిస్తోంది అభినవ భారతం. దేశ రాజధాని ఢిల్లీ మొదలు మారుమూల కుగ్రామాల వరకు స్త్రీలు, యువతులు, బాలికలపై నిత్యం అత్యాచార ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలోని 53 నగరాల్లో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది. అందులో దేశ రాజధాని ఢిల్లీ అత్యధిక అత్యాచారాలతో అగ్రభాగాన నిలిచింది. 2012 దేశంలోని 53 గుర్తించిన నగరాల్లో అత్యాచార ఘటనలతో పోల్చితే అందులో ఢిల్లీ 17.6 శాతం అత్యాచారాలను తన ఖాతాలో వేసుకొని నేనే నంబర్‌ వన్‌ అని చాటింది. దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక అత్యాచార ఘటన నమోదవుతోంది. 2102 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 24,923 మందిపై అత్యాచారం జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. అత్యాచార బాధితులకు సమాజంలో చులకన భావం, సూటిపోటి మాటలు, ఈసడింపులు వంటివి ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో పలు అత్యాచార ఘటనలు నలుగు గోడలు దాటి బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. కఠినమైన చట్టాలున్నా నిందితులు తప్పించుకోవడానికి అందులోనే కొన్ని వెసులుబాట్లు ఉండటం, దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతి, దాన్ని ప్రోత్సహించే శక్తులు ఎక్కువగా విచారణ సంబంధ వ్యవస్థల్లో ఉండటంతో బాధితులు గొంతెత్తి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. అత్యాచారాల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ వరుస్థ స్థానాల్లో నిలిచాయి. నగరాల వారీగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఆ తర్వాతిస్థానంలో ఉంది. పింక్‌సిటీ జైపూర్‌ మూడోస్థానంలో, ఇండోర్‌ ఆ తర్వాతిసానంలో నిలిచాయి. దేశంలో గంటకు ముగ్గురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. అందులో పలువురు కీచకుల చేతిలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప్రపంచ దేశాలకు అన్నింటా ఆదర్శవంతమైనదిగా చెప్పుకునే భారతదేశంలో నిత్యం 4,320 మంది మహిళలు ఎందుకు కీచకుల బారిన పడుతున్నారు? అందులో పసిప్రాయం కూడా వీడని చిన్నారులు కూడా ఎందుకు బాధితులుగా ఉంటున్నారు? అత్యాచారాలను నిరోధించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనే ప్రశ్నలు సగటు భారతీయుడి చుట్టుముడుతున్నాయి. యావత్‌ దేశాన్ని కదిలించిన ఘటన నిర్భయది. గతేడాది డిసెంబర్‌ 16న రాత్రి స్నేహితుడితో కలిసి ఢిల్లీలోని సాకేత్‌ ప్రాంతంలో సినిమా చూసి ఇంటికి బయల్దేరిన వైద్య విద్యార్థిని (23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు మదాంధులు పాశవికంగా అత్యాచారం జరిపారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని కొట్టి మరీ తమ పశువాంఛ తీర్చుకున్నారు. అంతటితో ఆగలేదు. నిస్సహాయురాలైన యువతిపై ఇనుపరాడ్లతో దాడి చేసి ఆమె శరీరాన్ని చిధ్రం చేశారు. ఇదంతా హై సెక్యూరిటీ జోన్‌గా చెప్పుకునే ఢిల్లీలో నడుస్తున్న బస్సులో జరిగింది. ప్రతి రోడ్డుపై భద్రత ఉండే ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరుపుతున్నా మన నిఘా వ్యవస్థ చేష్టలుడిగి చూస్తుందే తప్ప ఏమీ చేయలేకపోయింది. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ యువతి డిసెంబర్‌ 29న తుది శ్వాస విడిచింది. ఆమె అత్యాచారం, హత్యోదంతం దేశాన్ని కుదిపేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆందోళనలు నిర్వహించారు. వెల్లివెత్తిన ప్రజాందోళనలతో సర్కారు దిగివచ్చి అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ఈ చట్టానికి నిర్భయ చట్టం అని పేరు పెట్టింది. కఠినమైన చట్టమైతే తెచ్చారు కానీ మహిళలపై లైంగికదాడులు మాత్రం ఆగడం లేదు. నిర్భయ ఘటన కళ్లముందు కదలాడుతుండగానే గురువారం సాయంత్రం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ ఫొటో జర్నలిస్టు (23)పై సామూహిక అత్యాచారం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ముంబయిలోని పారెల్‌ ఏరియాలోని ఓ పాడుపడిన మిల్లులో ఫొటోలు తీయడానికి వెళ్లిన జర్నలిస్టుపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె వెంట ఉన్న మరో ఉద్యోగిపై దాడి చేసి అతడిని కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్భయలాంటి కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా దేశంలో మహిళలపై అకృత్యాలు ఆగకపోవడానికి కారణాలు ఏమిటో పాలకులు మాత్రం గుర్తించడం లేదు. శాస్త్రసాంకేతిక రంగాలు అందుబాటులోకి రావడంతో యువత అరచేతుల్లోనే అశ్లీలత రాజ్యమేలుతోంది. చవకగా దొరుకుతున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇందుకు కారణమవుతున్నాయి. అశ్లీల వెబ్‌సైట్లపై నియంత్రణ సాధ్యం కాదని సర్కారు చేతులెత్తేసింది. అలాగే దేశంలో జరుగుతున్న వివిధ దురాఘతాలకు మద్యం పరోక్ష కారణమవుతోంది. పాలకులు మద్యాన్ని ఖజానా నింపే బంగారు బాతుగుడ్డుగానే చూస్తున్నారు తప్ప దానివల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం మద్యం మత్తులో యువత విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరిచి ప్రవరిస్తున్నారు. నిత్యం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలకు మద్యమే కారణం. అనేక అకృత్యాలకు మద్యమే హేతువు. మద్యాన్ని ఆర్థిక వనరుగా చూస్తున్న సర్కారు దాని వల్ల జరుగుతున్న విపరిణామాలను మాత్రం లెక్కగట్టడం లేదు. పాలనకు మూలమైన డబ్బు కోసం ప్రజలతో విచక్షణా రహితంగా తాగించడమే ధ్యేయంగా పెట్టుకుంది. మనిషి మస్తిష్కంపై పెను ప్రభావం చూపి పశువుగా మార్చడం మద్యంతోనే సాధ్యం. అలాగే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవడం, సోదరభావం క్రమేణ క్షీణిస్తుండటం అత్యాచారాలకు మూలంగా మారుతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి మద్యం విచ్చలవిడి విక్రయాలను నియంత్రించకుంటే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావడం మామూలే. సర్కారు దీన్ని మామూలుగానే తీసుకుంటే దేశంలో మహిళలకు భద్రతే లేకుండా పోయే ప్రమాదముంది. సృష్టికి మూలమైన స్త్రీ జాతి ఉనికికే ఇది పెను సవాల్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.