టీ మంత్రులూ సభలు కాదుతెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడండి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలపడం, తద్వారా తెలంగాణ తామే తెచ్చామనే ప్రచారం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ ప్రాంత మంత్రులు కృతజ్ఞత సభలకు రూపకల్పన చేశారు. ఒక్కో జిల్లాలో ఒక్కో చోట సభలు నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తామేం చేశామో చెప్పుకోవడం పాటు 1999లో వైఎస్సార్ సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత్రికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇవ్వడం, తదనంతర పరిణామాలు, 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు, 2009 డిసెంబర్ 9నాటి ప్రకటన ఆ తర్వాతి పరిస్థితులు చివరికి తెలంగాణ ప్రకటన దిశగా తాము కా ంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కేంద్రంపై ఎంతో ఒత్తిడి పెంచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చెప్తున్న దాంట్లో నిజానిజాలను పక్కన బెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జూలై 30న నిర్ణయం తీసుకుంది. అదే రోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలు సైతం తెలంగాణకు జై కొట్టాయి. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా పలు రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంఘీభావం తెలిపాయి. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము మద్దతు పలుకుతామని ప్రకటించాయి. తెలంగాణపై రాజ్యాంగ పరమైన ప్రకటన ప్రారంభిస్తున్నట్లు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పక్షాన, ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించిన తర్వాత హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం షిండే విశ్రాంతి తీసుకుంటున్నారు. షిండే విధుల్లో లేకపోవడం వల్ల తెలంగాణ ప్రక్రియ మందగించిందనడానికి వీల్లేదు. జరగాల్సింది అధికారిక ప్రక్రియ. బ్యూరోక్రాట్లు, అధికారులు ఈ తతంగమంతా చూసుకుంటారు. అయినా ఎందుకు తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కేంద్ర కేబినెట్ భేటీ అయి ఓ నోట్ సిద్ధం చేస్తుందని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టడానికి సరైన కసరత్తే జరుగలేదు. దీంతో అక్టోబర్‌లో జరగబోయే శీతాకాల సమావేశాల వరకూ తెలంగాణ బిల్లు కోసం వేచిచూడక తప్పదు. కేంద్రం డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందనే ప్రచారానికి సోనియాగాంధీ మీడయా హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా తెరదించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని సోనియా తేల్చిచెప్పారు. అంటే కేంద్రం 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ ఎకౌంట్ పార్లమెంట్‌కు సమర్పించాక సాధారణ ఎన్నికలు జరుగుతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏడు నెలలకు పైగా అధికారంలో కొనసాగడం ఖాయం. దీన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణపై నిర్ణయం, విభజన ప్రక్రియ జాప్యం చేసే అవకాశాలు లేకపోలేదు. సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్నది కృత్రిమ ఉద్యమమే అయినా దాన్ని ఎక్కువ చేసి చూపుతున్నాయి మీడియా సంస్థలు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తర్వాత సీమాంధ్ర అట్టుడుకుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో యుద్ధ వాతావరణం నెలకొందని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారంటే ఆయన రాజకీయ పరిపక్వతను అంచనా వేయొచ్చు. రాజ్యం చేస్తున్న ముఖ్యమంత్రే బెంబేలెత్తిపోయి మాట్లాడుతున్నాడంటే భవిష్యత్ సీమాంధ్ర పరిస్థితి ఏమిటని జనాలు దిగాలు చెందాలనేది ఆయన అభిమతం. అందుకే అవకాశం చిక్కిన ప్రతీసారి సీమాంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడానిరి శయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నాడు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణపై వెనక్కిబోమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చిచెబుతోంది. అయినా 2009 డిసెంబర్ 23 నాటి జ్ఞాపకాలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి. ఆ రోజు తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్న విషయం ఎవరూ మర్చిపోలేదు. మన నేతలు కృతజ్ఞత యాత్రలు, సభల పేరుతో కాలక్షేపం చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కావొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు తాము ప్రత్యేక రాష్ట్రం తెచ్చామనే క్రెడిట్ కోసం కాకుండా ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలి. నాలుగున్నరకోట్ల ప్రజల నాలుగు దశాబ్దాల ఆకాంక్ష సాకారమయ్యే వేళ అలసత్వం వహిస్తే దీన్నే అదనుగా తీసుకొని పెట్టుబడిదారి శక్తులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మళ్లీ కొంత ఇబ్బంది తలెత్తవచ్చు. కేంద్ర హోం మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చూస్తున్న చిదంబరానికి రూపాయి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదు. అయినా ఆయన్ను కలిసి తెలంగాణపై ప్రజల అభిప్రాయాన్ని చెప్పి వీలైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ పూర్తి చేయాలని కోరవచ్చు. కానీ మన నేతలెవరూ ఆ ప్రయత్నం చేయడం లేదు. ఆంటోనీ కమిటీని కలిసి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నుంచి వెనక్కి వెళ్లొద్దని కోరారే తప్ప నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లమనే చెప్పే ధైర్యం చేయలేకపోయారు. మరోవైపు సీమాంధ్రులు తమది కాని హైదరాబాద్‌ను ఎలాగైనా సాధించుకోవలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారు. ఆరు దశాబ్దాలుగా హైదరాబాద్‌ను దోచుకున్నది చాలదని, ఇంకా తమ దోపిడీ కొనసాగాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. తెలంగాణ సాధించుకోవడమే కాదు. హైదరాబాద్‌పై నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకుండా ఒత్తిడి చేయాలి. తెలంగాణ ఉద్యమం ప్రజలది. సీమాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారులది. కృత్రిమమైనది. తాత్కాలికమైనది. ఈ విషయాన్ని అధిష్టానానికి గట్టిగా చెప్పి వేగంగా తెలంగాణ ప్రక్రియ పూర్తయ్యేలా చేయాలి. ఈ సంవత్సరాంతానికి ప్రజలు కొత్త రాష్ట్రంలో.. తాము దశాబ్దాల తరబడి కోరుకుంటున్న స్వపరిపాలనలో ఆత్మగౌరవంతో బతికే రోజు తీసుకురావా