మార్క్సిజం అంటే పిడివాదం కాదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు). భాషా ప్రయోక్త రాష్ట్రాల పేరుతో సీపీఎం ఓ పిడివాదాన్ని మోస్తూ దాన్ని అందరిపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు నాలుగు దశాబ్దాలుగా పోరుడుతున్న చరిత్రను, ఈ న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు 1500 మంది వరకు యువత బలిదానాలు చేసిన త్యాగాలను కాదని సీపీఎం సమైక్యాంధ్ర పేరుతో సీపీఎం పిడివాదాన్ని మోయడానికి కారణాలు లేకపోలేదు. మితవాద పంథాను కాదనుకొని మిలిటెంట్ పంథా ఎంచుకున్న సీపీఎం కొద్దికాలానికి కాడి పడేసింది. 1925లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి వేరుపడి 1964లో సీపీఎం ఆవిర్భవించింది. బెంగాళ్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రజాధరణ పొందింది. మూడు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. విప్లవ రాజకీయాలు, పార్లమెంటరీ పంథా, తెలంగాణ సాయుధ పోరాట విరమణ, బూర్జువా రాజకీయాలపై అంచనా తదితర అంశాల్లో సీపీఐతో తలెత్తిన వివాదం కారణంగా వేరు కుంపటి పెట్టుకున్న సీపీఎం కేవలం ఐదేళ్లలోనే మరో చీలకను ఎదుర్కొంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్ని చీలికలు ఎదుర్కొన్నా వాటిలో సింహభాగం అణగారిన వర్గాల గొంతుకలుగానే నిలిచాయి. సుదీర్ఘకాలం రాజ్యాధికారంలో కొనసాగిన సీపీఎం మాత్రం తన సహజ సిద్ధాంతాల నుంచి కాస్త దూరంగా పోయిందనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతిపదికే లేని భాషా ప్రయోక్త రాష్ట్రాల పేరుతో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే సిద్ధాంతాన్ని పదే పదే వల్లెవేస్తోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ధార్ కమిషన్ తోసిపుచ్చింది. జేవీపీ (జవహర్‌లాల్ నెహ్రూ, వల్లబాయ్ పటేల్, పట్టాబి సీతారామయ్య) కమిటీ సైతం తోసిపుచ్చింది. కానీ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. హిందీ మాట్లాడేవారికి అనేక రాష్ట్రాలున్నప్పుడు ఇక భాషా ప్రయుక్త రాష్ట్రాలనే భావనే తప్పు. కానీ తప్పును ఒప్పుగా చూపేందుకు సీపీఎం ప్రయత్నించడం వెనుక మూలం పశ్చిమబెంగాల్. బెంగాళీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తున్న సీపీఎం అదే పంథాను ఆంధ్రప్రదేశ్‌లోనూ అవలంబిస్తోంది. బెంగాల్ ముక్కలు చెక్కలైతే తమ చేతిలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం చేజారిపోయి కేంద్ర రాజకీయాల్లో తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే భయం సీపీఎంను పట్టి పీడిస్తుంది. అందుకే మార్క్సిజంతో సంబంధం లేని పిడివాదాన్ని ముందుకు తెస్తుంది. మార్క్స్ పీడిత పక్షపాతి. అణగారిన వర్గాల విముక్తం కోసం పోరాడిన ధీశాలి. ఆయన పేరుతో ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు దోపిడీదారులు, కబ్జాకోరుల పక్షం వహిస్తూ సమైక్యాంధ్ర పేరుతో కొంగ జపం చేస్తోంది. ఇందులో బెంగాల్ ప్రయోజనాలు మాత్రమే కాదు, పార్టీ కేంద్ర కమిటీలో క్రియాశీల శక్తులుగా ఉన్న వ్యక్తుల సంకుచిత భావజాలం కూడా ముడిపడి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర పెత్తనం, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన అగత్యం తెలంగాణ పౌరులు ఎదుర్కోవడం. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఉద్యోగాలు, నీళ్లు, నిధులను అప్పనంగా కొళ్లగొట్టడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు రావడం. రాజ్యం దానిలోకి హింసను చొప్పించి అందుకు తెలంగాణ యువతనే బాధ్యులుగా చేస్తూ తుపాకులు ఎక్కుపెట్టి కాల్చడం. 369 మంది విద్యార్థులు, యువతను బలితీసుకున్న రాజ్యం అదే ఆధిపత్య ధోరణిని తెలంగాణపై రుద్దడాన్ని నిరసిస్తూ కోట్ల గొంతుకలు ఒక్కటై ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించాయి. తెలంగాణ ప్రజలు పీడితులు, తెలంగాణ ప్రజలు బాధితులు. వారి పక్షాన నిలవాల్సిన మార్క్సిస్టు పార్టీ వీరిని దోపిడీకి గురిచేసే వారి పక్షాన చేరింది. అందుకు ప్రాతిపదిక ఎమిటో చెప్పే ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల పోరాటం ఫలితం దిశగా సాగుతున్న సమయంలో దోపిడీదారులు కుట్రల కత్తులకు మళ్లీ పదును పెట్టారు. ఇలాంటి సమయంలో వారితో జట్టుకట్టింది సీపీఎం. మార్క్సిజాన్ని ప్రబోధించే సీపీఎం జాతి, భాష గురించి మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. ఇలా మాట్లాడుతూ దోపిడీదారుల పక్షం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో దోపిడీకి, పీడనకు గురైంది తెలంగాణ. ఈ విషయాన్ని గణాంకాలతో సహా పలు సందర్భాల్లో ఇక్కడి మేధావులు బయటపెట్టారు. అందుకు సంబంధించిన గణాంకాలు సీపీఎం పార్టీకి అందజేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఇవేవి పట్టించుకోని సీపీఎం ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తూ భాషాప్రయోక్త రాష్ట్రాలపై ప్రచారం చేస్తోంది. అసలు భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఎందుకు అవసరమో చెప్పకుండా తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అది సమైక్యాంగ ఉండాలని కోరుకునే సీమాంధ్ర ప్రాంతంలో. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన వారు తెలంగాణ ప్రాంతీయులు. ఉమ్మడి రాష్ట్రంలో తాము వేగలేమని, స్వపరిపాలన కావాలని కోరుతున్నది తెలంగాణ ప్రజలు. సీపీఎం తన పిడివాదాన్ని పట్టుకు వేల్లాడ్డంతోనే గత అసెంబ్లీలో పార్టీకి ఉన్న శాసనసభ్యుల సంఖ్య ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. అది ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగే ఉంది. ప్రజల ఆకాంక్షను కాదని తన బాధే ప్రపంచం బాధ అనుకునే సీపీఎం పార్టీకి తెలంగాణ ప్రజల్లో విశ్వాసం లేదు. కార్మికవర్గాల్లో ఒకప్పుడు కాస్తోకూస్తో ఉన్న బలం కూడా ఇప్పుడు కానరాని పరిస్థితి. ఇటీవల జరిగిన కార్మిక సంఘాల ఎన్నికలు దీనిని తేటతెల్లం చేస్తున్నాయి. అయినా సీపీఎం ఇంకెక్కడి ప్రయోజనాల కోసమో ఆంధ్రప్రదేశ్‌లో తన పిడివాదాన్ని పట్టుకు వేలాడుతోంది. శ్రీకృష్ణ కమిటీ ఎదుట విభజనపై సీపీఎం విషం కక్కింది. గంగాజమున తెహజీబ్‌కు ప్రతీకైన హైదరాబాద్‌లో విభజన తర్వాత మత ఘర్షణలకు తలెత్తే అవకాశముందని చెప్పింది. యూపీఏ-1 ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీ సీపీఎం. అప్పటి కామన్ మినిమం ప్రోగ్రాంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు ఏమాత్రం స్పందించలేదు. అంతేకాదు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్రిక్త పరిస్థితుల నివారణకు కేంద్రం చొరవ తీసుకోవాలని, తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నా తెలంగాణ ఇస్తే అడ్డుకోబోమని తేల్చిచెప్పింది. గతేడాది డిసెంబర్ 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ దీనిని పునరుద్ఘాటించింది. ఇప్పుడు భాషాప్రయోక్త రాష్ట్రాల పేరుతో సీమాంధ్ర ప్రాంతంలో కపట ప్రచారం సాగిస్తోంది. సీపీఎం భాషా ప్రయోక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉంటే ఉండవచ్చు. అందుకు ప్రతిపదిక ఏమిటో? ఎందుకు భాషాప్రయోక్త రాష్ట్రాలు అవసరమో ప్రజలకు చెప్పాలి. భాషా ప్రయోక్త రాష్ట్రాల వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనాలుంటే వాటిని వివరించాలి. ఒక రాజకీయ పార్టీగా సీపీఎం పార్టీకి ఆ హక్కు ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజలు విడిపోతాం మొర్రో అంటుంటే బలవంతంగా కలిసుండాలని కోరడం, ఈ విషయమై సీపీఐని నిందించడం ఆ పార్టీ అపరిపక్వ విధానాలను ఎత్తిచూపుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యం అయిన పరిస్థితుల్లో జాతీయ పార్టీగా సీపీఎం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రాంతం, జాతి ప్రాతిపదికన ఆ పార్టీ వ్యవహరించకూడదు. అలా చెప్పే ప్రయత్నమేది సీపీఎం కేంద్ర, రాష్ట్ర కార్యవర్గాలు చేయడం లేదు. పైపెచ్చు సీమాంధ్ర ప్రాంతంలో కొత్త ప్రచారం మొదలు పెట్టి వారిలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కనీసం సీమాంధ్ర ప్రాంతంలో ప్రతినిథ్యం కూడా లేని సీపీఎం తెలంగాణలో ఉన్న ఒక్క సీటును లక్ష్యపెట్టడం లేదు. బెంగాల్‌లో పార్టీ ప్రయోజనాల కోసం తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను ఫణంగా పెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు ఇష్టం లేకున్నా బలవంతంగా కలిసుండాలని సీపీఎం చెప్పడం నీతిబాహ్యం. ప్రతిపదికలేని విషయాన్ని ప్రధానంగా తీసుకొని మార్క్సిజానికే కళంకం తెచ్చే దిశగా ఆ పార్టీ ముందుడుగు వేస్తున్నట్లుగా ఉంది. దీనిపై ప్రజాతీర్పును త్వరలోనే ఎదుర్కోవాల్సి ఉందనే విషయాన్ని కూడా విస్మరించింది.