అడ్డుపడుతున్న శక్తులే లక్ష్యం కావాలి
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల నిరీక్షణ ఫలించబోయే వేళ సీమాంధ్ర పెత్తందారి శక్తులు దానిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వాటిని వెనుక నుంచి కాకుండా ముందుండే నడుపుతున్నారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తోడ్పానిస్తున్నాడు. మరికొందరు సీమాంధ్ర మంత్రులు, నేతలు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ప్రాతిపదికే లేని సమైక్యాంధ్ర డిమాండ్‌ను ముందుకు తోసి తమ దోపిడీని సాగించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పిడికెడు మంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కోట్లాది మందిని ఇబ్బందులకు గురిచేయడం రాజకీయంగా ఈ శక్తులకు పరిపాటే. తమ ప్రయోజనాలు, తమ ప్రాంతానికి చెందిన వారి ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వారికెప్పుడూ పట్టవు. కనీసం వీరిని ప్రజలుగా గుర్తించేందుకు కూడా ఆయా శక్తులు అంగీకరించవు. తాము పాలకులం, తెలంగాణ ప్రజలు పాలితులు అంతే కాదు సేవకులు అనే భావన వారిది. వారి భావనకు అచ్చుగుద్దినట్టు సరిపోయే దౌర్భాగ్యపు నేతలు ఈ పది జిల్లాల్లో ఉన్నారు. ఎంతసేపు తమ ప్రయోజనాలే తప్ప ఓట్లేసిన ప్రజలను పట్టించుకున్నది తక్కువే. ఇప్పుడు వాళ్లే తాము తెలంగాణ తెచ్చామంటే, తమ వల్లే తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఇంత చేసింది వీళ్లే అనుకున్నా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వాళ్ల వెనుక ఉండే తమ బానిస బతుకులను తేటతెల్లం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష. నాలుగు దశాబ్దాలుగా ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో రాజ్యం జై తెలంగాణ అని నినదించిన వాళ్లను వివిధ పేర్లు పెట్టి పొట్టనబెట్టుకొంది. హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన వేళ చేసుకున్న ఒప్పందాలను సీమాంధ్ర పాలకులు తుంగలో తొక్కారు. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కొళ్లగొట్టారు. నిజాం తెలంగాణ ప్రజల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వాల అండతో సెజ్‌లు, పరిశ్రమలు పేరిట అప్పనంగా కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. ఉత్తి చేతులతో హైదరాబాద్‌కు వచ్చిన ఎందరో తెలంగాణ వనరులు దిగమింగి కుభేరుల అవతారమెత్తారు. వాళ్లే ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం ప్రకటించినా సీమాంధ్ర ప్రాంత ప్రజలు అంతగా పట్టించుకోలేదు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న సీమాంధ్ర పెత్తందారులు, రాజకీయ నాయకులు డబ్బు సంచులతో మొదట కృత్రిమ ఉద్యమం నిర్మించారు. వీళ్లు ఎంతగా మొత్తుకున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు రంగంలోకి దిగారు. సీమాంధ్ర ప్రజలకు లేనిపోని భయాలు కల్పించి ఎట్టకేళకు కొందరిని రోడ్లపైకి తేగలిగారు. అయినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో సీఎం సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయాడు. పరిపాలనను గాలికొదిలేసి తెలంగాణను అడ్డుకునేందుకు వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యాడు. తెలుగు భాషాదినోత్సవం వేదికపై నుంచి తనను సీఎంగా నియమించిన అధిష్టానాన్నే సవాల్ చేసేలా మాట్లాడాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలక నిర్ణయాలు తీసుకుంటారని, ఒకవేళ పార్టీలు నిర్ణయాలు తీసుకోదలిస్తే ఆ పార్టీకి ప్రజలు పూర్తిగా సెలవు ప్రకటిస్తారని సూత్రీకరించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సెలవు ప్రకటించి తీరుతారని నొక్కి చెప్పారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవాడికే అష్టకష్టాలు పడిన కిరణ్ ఇప్పుడు ఎవరి బలం చూసుకొని ఇంత పెద్దపెద్ద డైలాగ్‌లు చెప్తున్నాడు. పార్టీలు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి ఎన్నో పర్యాయాలు ప్రజలు సెలవులు ప్రకటించి చూపారని ఒకింత తీవ్రస్వరంతోనే అధినేత్రిని హెచ్చరించారు. స్వతహాగా సొంత సీటు నిలబెట్టుకోలేని కిరణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని చేసిన అధిష్టానాన్నే హెచ్చరించే దమ్ము ఎక్కడినుంచి వచ్చిందని అక్కడి నేతలే నోరెళ్లబెడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలరోజులుగా ఉద్యమాలు జరుగుతున్నట్టు చెప్తున్నా వాటిలో ప్రజల భాగస్వామ్యం తక్కువే. ఇప్పుడు ఇచ్చిన తెలంగాణను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో హీరోగా నిలిచి ప్రబల రాజకీయ శక్తిగా ఎదగాలని కిరణ్ కోరుకోవచ్చు. కానీ తన నేపథ్యాన్ని ఆయన విస్మరిస్తున్నాడు. కిరణ్‌కు అంతబలాన్ని సమకూర్చింది.. సమర్పించింది కాంగ్రెస్ అధిష్టామే తప్ప మరొకటి కాదు. కిరణ్‌ను సీఎంగా చేయడం ద్వారా పాలన పరంగా దుర్భలుడైన ముఖ్యమంత్రిని మనకు ఇచ్చి పూర్తి వెనుకబాటుకు కాంగ్రెస్ అధిష్టానమే కారణమైందని చెప్పుకోవాలి. అభివృద్ధి వెనుకబాటు విషయాలను పక్కనబెడితే కిరణ్, చంద్రబాబు తెలంగాణను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారన్నది వాస్తవం. అవేవో తెరవెనుక ప్రయత్నాలుగా కాకుండా బహిరంగంగానే వారు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మోచేతి నీళ్లు తాగే కొందరు ఈ ప్రాంత నేతలు ఆహా.. ఒహో అంటూ వంతపాడుతున్నారు. సాధించుకున్న తెలంగాణను అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతున్న శక్తులేవో స్పష్టమైన తరుణంలో ఆ శక్తులే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపాలి. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు వారికి దన్నుగా నిలుస్తున్న ఈ ప్రాంత నేతలను నిలదీసి అడగాలి. కొట్లాది తెచ్చుకున్న తెలంగాణకు అడ్డుపడుతున్న శక్తులను విడిచి వస్తారా? కిరణ్ చెప్పినట్టు తమ ఆకాంక్షకు వ్యతిరేకంగా ఉన్నందుకు శాశ్వత సెలవు ప్రకటించమంటారా? అని ప్రశ్నించాలి. కిరణ్ చెప్పింది అక్షరాల నిజం చేయడానికి తెలంగాణ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఇచ్చిన తెలంగాణను అడ్డుకుంటే అందుకు దోహదపడిన వారికి శాశ్వత సెలవు ప్రకటించేందుకు పది జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈక్రమంలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ద్రోహులకు గుణపాఠం చెప్పి తీరుతారు. నాలుగు దశాబ్దాలుగా పోరాడి, 1500 మందికి పైగా బిడ్డల ఆత్మత్యాగాల తర్వాత సాధించుకున్న తెలంగాణను అడ్డుకుంటే సెలవు ప్రకటించడం మాత్రమే కాదు బొంద తవ్వి పూడ్చడానికి సైతం తెలంగాణ ప్రజలు వెనుకాడబోరు. అడ్డుపడే శక్తులే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటోంది. అది కచ్చితంగా ఫలితం దిశగానే ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలిచేదెవరో? తమతో కలిసి వచ్చేది, వస్తున్నదెవరోవరో తెలంగాణ ప్రజలు తేల్చుకున్నారు. ఎవరెవరికి శాశ్వత సెలవు ఇవ్వాలో ఇప్పటికే నిర్ధారించుకున్నారు. అందుకు తగిన సమయం కోసమే వేచి చూస్తున్నారు.