ద్రవ్య స్థిరీకరణతో రుపాయి పతనానికి అడ్డుకట్ట


ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న విత్తలోటు, ద్రవ్యలోటు నియంత్రణకు ద్రవ్యస్థిరీకరణే మార్గం. దీనితోనే క్షీణిస్తున్న రూపాయి  విలువను అడ్డుకొని ఆమ్‌ ఆద్మీని అధిక ధరల నుంచి రక్షించవచ్చు. ఆర్థిక వ్యవస్థలో వర్తమాన ఖాతాలోటు, ద్రవ్యలోటును తగ్గించడానికి ప్రత్యామ్నాయ ప్రత్యేక ఆర్థిక వ్యూహం అవసరం. దేశీయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం, విదేశీ వస్తువుల దిగుమతుల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం వెన్వెంటనే దృష్టిసారిం చాలి. దిగుమతులకు ప్రత్యామ్నాయాలపై సమగ్ర ఆర్థిక ప్రణాళి కలు రూపొందించాలి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ బలోపేతానికి దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కల్పించాలి. తద్వారా విదేశీ మారకద్రవ్యం మన దేశానికి సమకూరుతుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చూపే చొరవే కీలకం. రూపాయి విలువ పతనమవడంతో సామాన్యులకు దైనందిన జీవితంలో అవసరమైన వినియోగ వస్తువుల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా సామాన్యుని జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రూపాయి బలోపేతానికి కల్పిస్తున్న ఉద్దీపణలు ఎంతమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వడం లేదు. అనుత్పాదక వ్యయంలో కోత, నగదు నిల్వల పెంపు, కరెంట్‌ ఖాతాలోటు పూడ్చే చర్యలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల పునరుద్ధరణ, మూలధన సమీకరణకు చర్యలు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పొదుపునకు ప్రోత్సాహం కల్పిస్తే దేశీయ మారకద్రవ్యం విలువ బలోపేతానికి దోహదపడుతుంది. ఉత్పత్తి, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తే కుదేలవుతున్న రూపాయి బలోపేతమ వుతుంది. దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న రంగాల్లో దేశీయ ప్రత్యామ్నాయ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రూపాయి వినిమయం దేశీయంగా జరుగుతుంది. వ్యవసాయ రంగానికి ఊతం, తయారీరంగానికి ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ఆకర్షణ, పెట్టుబడిదారుల్లో విశ్వాసం ప్రోదిగొల్పే చర్యలు, శాశ్వత ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆదాయ సృష్టి జరిగి దేశీయ ద్రవ్యం బలోపేతమవుతుంది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. ఫలితం గా దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. రూపాయి మళ్లీ ఉత్తాన దశకు చేరుతుంది. విదేశీ మార్కెట్‌లోనూ రూపాయి విలువ గణనీయంగా పెరిగే అవకాశముంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫ్లాట్‌ స్క్రీన్‌ టీవీలపై కస్టమ్స్‌ సుంకం విధింపు, ఎగుమతులను పెంపునకు ప్రోత్సాహం ఇచ్చి కరెంట్‌ ఖాతాలోటు పూడ్చాలి. ప్రజాకర్షక, ఓటు బ్యాంకు పథకాలపై ఎక్కువ వ్యయం చేయడం, వాటి ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడం కన్నా ప్రజల్లో పొదుపు ప్రవృత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. పెట్టుబడులకు అనువైన ఆర్థిక, సామాజిక పరిస్థితులను కల్పించాలి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70కి చేరువైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న దేశీయ కరెన్సీని వెనక్కు రప్పించాలి. ఇందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఇది వరకే గుర్తించిన మొత్తాలను దేశంలోకి రప్పించే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. స్విస్‌ బ్యాంకులతో సహా ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో మన దేశానికి చెందిన ధనవంతులు దాచిపెట్టిన నల్లధనాన్ని దేశానికి రప్పించి వాటిని ఉత్పాదక రంగాల్లో పెట్టుబడి పెడితే దేశీయంగా ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. 120 కోట్లు దాటిన దేశ జనాభాలో అత్యధికమందికి దీర్ఘకాలం ఉపాధి అవకాశాలు దొరకడం ద్వారా వారి కొనుగోలు శక్తి పెరుగుతంది. ఉత్పాదక రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయంగా న్యాయమైన వస్తువుల తయారీ, వాటికి స్థానిక మార్కెట్‌తో పాటు అంతర్జాతీ యంగా మార్కెట్‌ కల్పించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి రప్పించవచ్చు. దీనివల్ల దేశంలో విదేశీ మారక విలువలు పెరిగి దిగుమతి చేసుకునే వస్తువులు చవకవుతాయి. దేశంలో కి ప్రవాహంలా వచ్చిపడు తున్న చైనా ఉత్పత్తుల నియం త్రణకు నిబంధనలు కఠినతరం చేయ డంతో పాటు అక్రమ దిగుమతు లపై కొరడా విధించాలి. ప్రపంచీ కరణ తర్వాత భారత్‌ గ్లోబల్‌ మార్కెట్‌గా మారి విదేశీ సంస్థలు పోలోమని దేశంలోకి ప్రవేశిం చాయి. బ్రాండెడ్‌ మోజులోపడి మనవాళ్లు వాటి కొనుగోలుపైనే ఆసక్తి చూపుతున్నారు. వాటికి దీటైన దేశీయ ఉత్పత్తులకు అనువైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే. అందుకు నల్లకుభేరులపై చర్యలతో పాటు నల్లధనాన్ని సద్వినియోగం చేయడం మరో మార్గం. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని కనుక సమర్థవంతంగా మన ప్రభుత్వాలు వెనక్కు రప్పింగలిగి సరైన రీతిలో ఖర్చు చేస్తే రూపాయి మారకద్రవ్యం విలువ డాలర్‌ను అధిగమించి యూరోకు దీటుగా నిలిచే అవకాశముంది. దేశంలోని సర్‌ప్లస్‌ లేబర్‌కు రోజూ పనికల్పిండానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా వారి ఉత్పాదకరంగంలో భాగస్వాములను చేయాలి. తద్వారా ఆయా కుటుంబాల తలసరి ఆదాయం, కొనుగోలు శక్తి పెరుగుతాయి. విదేశీ దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌, కాస్మోటిక్స్‌, సిగరెట్స్‌ ఇత్యాధి వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా కొనుగోలు చేయడం ద్వారా మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆయా దేశాల్లోకి ప్రవహిస్తున్నాయి. తద్వారా దేశీయంగా కరెంట్‌ ఖాతాలోటు ఏర్పడుతోంది. అలాకాకుండా విదేశీ వస్తువులపై వ్యామోహాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం ద్వారా, దేశీయ ఉత్పత్తుల విక్రయానికి అనువైన పరిస్థితుల కల్పనకు పాలకులు చర్యలు చేపట్టాలి. రూపాయి పుర్వపు శోభ తిరిగి సంతరించుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. విదేశీ పెట్టుబడులకు ఎగబడాలే తప్ప విదేశీ వస్తువుల మార్కెట్‌కు కాదనే విషయాన్ని గుర్తించాలి.

– నేదునూరి కనకయ్య

రచయిత, అర్థశాస్త్ర ఉపన్యాసకులు

జిల్లా ఎకనామిక్స్‌ ఫోరం అధ్యక్షులు, కరీంనగర్‌.