ఎవరిని రెచ్చగొట్టాలని?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు అనుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు దీనిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నాయి. మొదట ఎవరికి వారుగా ఈ ప్రయత్నాలు సాగించగా ఇప్పుడు ఆయా శక్తులు ఏకయ్యాయి. ఎంతగా ఒత్తిడి చేసినా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వెనక్కు తీసుకోకపోవడం, తెలంగాణపై వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడంతో ఆయా శక్తులు కంగుతిన్నాయి. విడివిడిగా పోరాడితే ఉమ్మడి లక్ష్యం నెరవేరదని గుర్తించి, తెరవెనుక గూడుపుఠానీ సాగించి లోపల్లోపలే జట్టుకట్టాయి. తెలంగాణ ప్రాంతంలోని వనరులు, నీళ్లు, నిధుల దోపిడీతో అత్యధికంగా లాభపడిన శక్తులు అడ్డదారిన తెలంగాణకు చెందాల్సిన ఉద్యోగాలను కొళ్లగొట్టిన వారిని రెచ్చగొట్టి రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలోనూ కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఈ పెట్టుబడిదారులే ప్రధాన ఆదాయ వనరుగా ఉండి సమైక్య ఉద్యమాన్ని నెలరోజులుగా డబ్బు సంచులతో నడిపిస్తున్నారు. ఇది వరకు ఢిల్లీలో తమ లాబీయింగ్‌కు లొంగే నేతల కోరలు అధిష్టానం పీకేయడం, స్వయంగా సోనియాగాంధే తెలంగాణ ఇవ్వాలని సంకల్పించడంతో కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శక్తులు సైతం ఆమె మాటకు ఎదురు చెప్పే ధైర్యం చేయడం లేదు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల పోరాటానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు తలవంచాయి. జై తెలంగాణ అనకుండా ఇక్కడ పోటీ చేసే పరిస్థితే లేకపోవడంతో అన్ని పార్టీలు తెలంగాణపై పలు సందర్భాల్లో స్పష్టత ఇచ్చాయి. రాష్ట్రంలో ఏకైక సమైక్యవాద పార్టీగా చెప్పుకునే సీపీఎం ఈ వాదాన్ని ఎత్తుకున్న తర్వాత తన బలాన్ని కోల్పోయి కుదేలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇది వరకే పలుమార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించింది. ఆయా సందర్భాల్లో తెలంగాణకు జై కొట్టిన రాజకీయ పక్షాలు తీరా కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకున్నాక అడ్డం తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు ఈ విషయంలో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణపై అవసరమైతే అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతానని చెప్పిన బాబు తెలంగాణ ఇస్తామని కేంద్రం రెండు పర్యాయాలు ప్రకటిస్తే ఈ రెండుమార్లు అడ్డదిడ్డంగా మాట్లాడి సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు లేవనెత్తడానికి ప్రయత్నించాడు. ఈసారి మరీ దుర్మార్గంగా ప్రవరిస్తున్నాడు. గతంలో రెండుకళ్ల సిద్ధాంతం వల్లెవేసిన బాబు ఇప్పుడు సీమాంధ్ర కంటితోనే చూస్తూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నాడు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని చెప్పి ఇప్పుడు కాడెత్తేసింది. తెలంగాణలో పార్టీ దూకాణాన్ని పూర్తిగా మూసేసుకొని సీమాంధ్రకు వలసపోయింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష, దాని కొనసాగింపు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతదని, రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో సమైక్యంగానే ఉంచాలని కోరుతూ చంచల్‌గూడ జైల్లో ఆయన దీక్ష చేపట్టారు. అక్రమాస్తుల కేసులో విచారణ ఖైదీగా ఉన్న జగన్ దీక్ష చేపట్టి ఆరు రోజులవుతోంది. నాలుగు పదులు దాటిన జగన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు. ఆరు రోజులుగా అన్నం ముట్టకపోవడంతో రక్తంలో చక్కెర నిల్వలు పడిపోయాయి. అంతేతప్ప జగన్‌కు ఆరోగ్యకరంగా మరో సమస్యలేదు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇది వరకు ఎవరూ చెప్పింది లేదు. కేవలం భోజనం మానేయడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి జగన్ నీరసించాడు. అతడికి ఫ్లూయిడ్స్ ఇస్తే తిరిగి మామూలు శక్తిని సంతరించుకుంటాడు. అందుకు చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆస్పత్రి సరిపోతుంది. లేదా బయటినుంచి వైద్యులను రప్పించి ఆయనకు వైద్యం చేయించే అవకాశముంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ను చికిత్స కోసమంటూ గురువారం అర్ధరాత్రి తర్వాత హడావిడిగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. అక్కడ జగన్‌కు చికిత్స చేసే అవకాశమున్నా ఆయన నిరాకరిస్తున్నాడని చెప్పి ఒకరోజు కాలక్షేపం చేశారు. తద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజలు రెచ్చిపోవాలని, తమ కోసం దీక్ష చేస్తున్న జగన్‌కు అండగా ఆందోళనలు, దాడులకు దిగేలా చేయాలనేది ఇందులో కుట్రగా స్పష్టమవుతోంది. సరే అలాగే ఉస్మానియా ఆస్పత్రిలోనైనా స్థిమితంగా ఉంచారా అంటే అక్కడ చికిత్సకు పూర్తిస్థాయిలో సదుపాయాలు లేవు కాబట్టి నిమ్స్‌కు తరలించాలని వైద్యులతోనే చెప్పించారు. తద్వారా జగన్‌ను మరో ఆస్పత్రికి తరలించే ఘట్టానికి తెరతీశారు. వరుసగా రెండురోజులు జగన్‌ను రెండు ఆస్పత్రులకు తరలించడం ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో అతడి ఆరోగ్యం పట్ల భయాందోళనలు రేకెత్తించడం ఇక్కడ సర్కారు వ్యూహంగా స్పష్టమవుతోంది. మొన్నటివరకు ప్రభుత్వానికి, జగన్‌కు ఎడముఖం.. పెడముఖమే. అలాంటి పరిస్థితుల్లో జైల్లో దీక్ష చేపట్టిన జగన్‌ను బయటికి తీసుకురావడం సాధ్యం కాదు. అతడికి నిర్బంధంగా అక్కడే వైద్యం అందించే అవకాశం ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోకుండా అతడిని జన బాహుల్యంలోకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటీ? అంటే సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి మరికాస్త సహజత్వాన్ని ఆపాదించడమే. జగన్‌ను శుక్రవారం రాత్రి మళ్లీ నిమ్స్‌కు తరలించారు. చంచల్‌గూడ జైల్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లే బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో నిమ్స్‌కు పంపారు. జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకువచ్చి అతడి భద్రత కోసం వందలాది మంది పోలీసులను నియమించి ఆస్పత్రిలో పెట్టి చికిత్స అందించాల్సిన పరిస్థితుల్లో జగన్ లేరు. ప్లూయిడ్స్ ఇస్తే ఆయన మళ్లీ మామూలు మనిషి అవుతారు. దాన్ని కాదని ప్రభుత్వమే అతడిని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తూ సమైక్యాంధ్ర కోసం కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్న వారందరిదీ ఒకే దారి అని స్పష్టం చేశారు. జగన్ కుటుంబానికి సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న సానుభూతిని సమైక్యాంధ్ర ఉద్యమానికి అణువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేతలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో ఇప్పుడు వారే వెనుకుండి జగన్ దీక్షను ఎపిసోడ్లు.. ఎపిసోడ్లుగా సాగదీస్తున్నట్టు స్పష్టమవుతోంది. కానీ ఇక్కడ ఆయా శక్తులు మర్చిపోతున్న విషయాలు చాలా ఉన్నాయి. జగన్ తెలంగాణను వదులకొని సీమాంధ్ర ప్రాంతం చాలనుకున్నాడు. అందుకే ఆ ప్రాంత ప్రజల అక్రమ ప్రయోజనాలతో పాటు తన అక్రమ, అవినీతి సామ్రాజ్యాన్ని నిలుపుకునేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలోనూ ప్రాతినిథ్యం కోరుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పిగంతులు మాత్రం ఇక్కడ పనిచేయవు. ఇక సీఎం కిరణ్ ప్రజలంటేనే సీమాంధ్రులు అనేలా తెలుగుభాషాదినోత్సవ వేదిక నుంచి నిర్వచించి తెలంగాణ ప్రజలను దారుణంగా అవమానించారు. జగన్ వెనుక ప్రభుత్వం నిలబడి సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని తోసి రాజెయ్యాలని ప్రయత్నిస్తోంది. సీమాంధ్రులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు అంతకుమించి రెచ్చిపోతారు. తమకు అవకాశం రాగానే కోలుకోలేని రీతిలో బుద్ధి చెప్పి తామంటే ఏమిటో కూడా నిరూపిస్తారు. అదీ ఇంకా ఎంతోదూరంలో లేదు.