ప్రజల కోసం విడిపోదాం.. ప్రగతికోసం కలిసి పనిచేద్దాం
సచివాలయంలో టీ ఉద్యోగుల ధర్నా
సీమాంధ్రుల పోటీ ధర్నా.. ఉద్రిక్తత
హైదరాబాద్, ఆగస్టు 31 (జనంసాక్షి) :
ప్రజల కోసం విడిపోయి.. ప్రగతికోసం కలిసి పనిచేద్దామని తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ భోజన విరామ సమయంలో సచివాలయంలో ధర్నా నిర్వహించారు. అదే సమయంలో తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు పోటీ ధర్నా నిర్వహించడంతో సచివాలయం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు గత 25రోజులుగా కొనసాగిస్తున్న విషయం విదితమే. అయితే నిన్న మొన్నటి వరకు కలసి మెలసీ ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇరుప్రాంత ఉద్యోగులు ర్యాలీలుగా ఏర్పడి సచివాలయంలోని ఎల్ బ్లాక్ కూడలి వద్ద ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయంలో ర్యాలీలు, సభలు జరపవద్దని గత మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ ఉత్వర్వులను తుంగలో తొక్కి సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవాల్సింది పోయి అండగా నిలిచి, వారు నిర్వహించిన ర్యాలీలకు సహకరించడాన్ని తెలంగాణ ఉద్యోగులు వ్యతిరేకించారు. శనివారంనాడు ఇరు ప్రాంతాల ఉద్యోగులు ర్యాలీలకు పట్టుబట్టడంతో పోలీసులు వారిని అడ్డగించారు. ఒకరికొకరు ఎదురుపడి నినాదాలు చేయడంతో రోప్ బృందం రంగంలోకి దిగి ఇరువర్గాల మధ్య అడ్డుకట్టవేశారు. సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందన్న వార్తలతో తూర్పు మండలం డిసిపి కమలహసన్ సచివాలయానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించాలని కోరారు. ఇరువర్గాలు ఎల్‌బ్లాక్ కూడలిలో భైఠాయించారు. పాతరేకులు, డబ్బాలు తెచ్చి మోగించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనమందరం భారతీయులమని, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని దీనిపై తెలంగాణ వారికి తప్ప ఇతరులెవ్వరికి అధికారం లేదని, ఇతరులెవ్వరి పెత్తనాన్ని అంగీకరించేంది లేదని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన ముఖ్యమంత్రి కనుసైగల్లో నడుస్తున్నదని అంటూ ముఖ్యమంత్రి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గత 25 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నామని కావాలనే తెలంగాణ ఉద్యోగులు తమను అడ్డుకుంటున్నారని సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపించారు. దీనిని తెలంగాణ ఉద్యోగులు ఖండించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులకు జరిగే నష్టాన్ని వివరించాలని, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత నరేందర్‌రావు డిమాండ్ చేశారు. కాగా సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీని సిబ్లాక్ వరకు నిర్వహించేందుకు పోలీసుల అనుమతినిచ్చారు. జే బ్లాక్ గుండా ప్రధాన ద్వారా మీదుగా డీ బ్లాక్ వైపు సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరారు. వీరిని అడ్డుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు విఫలమవడంతో పోలీసులు నిర్వహించిన అడ్డుకట్టను ఛేదించుకుని పోచమ్మగుడివైపు పరుగు తీశారు. దీంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక్క పెట్టున పోలీసు బలగాలు పోచమ్మగుడివైపు పరుగులు తీసాయి. పోచమ్మ గుడి వద్ద వారిని సిబ్లాక్ వైపు వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఒకరిని అనుమతించి.. మరోకరిని అనుమతించకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని పోలీసులు సీమాంధ్ర ఉద్యోగులను నార్త్ హెచ్ బ్లాక్ కూడలి వద్ద నిలిపివేశారు. అలాగే తెలంగాణ ఉద్యోగులను కె.బ్లాక్ వరకే పరిమితం చేశారు. ఇరువర్గాల మధ్య ఈలులు, కేకలు, డబ్బా చప్పుళ్లతో సచివాలయం మార్మోగింది.