ముసుగు తొలగిపోయింది

తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదంటూ ఇంతకాలం బుకాయించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అసలు రంగును బయట పెట్టుకుంది. ఆదివారం విజయమ్మ రాష్ట్ర ప్రజల పేరుతో సీమాంధ్రులకు రాసిన లేఖలో దాన్ని స్పష్టం చేసింది. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని తమతో పాటు సీపీఎం, ఎంఐఎం పార్టీలదీ సమైక్యవాదమేనని  ఆ లేఖలో పేర్కొంది. సమైక్య శంఖారావం పేరిట తన కుమార్తె సోమవారం నుంచి నిర్వహించనున్న యాత్ర వివరాలు వెల్లడించింది. తన కుమారుడు జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సర్వతోమూఖాభివృద్ధి చెందుతుందని పేర్కొంది. షర్మిల నిర్వహించనున్న యాత్రం సీమాంధ్రలోని 13 జిల్లాలకే పరిమితం కాగా ఆమె పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ఎలా నేతృత్వం వహిస్తుందో అర్థంకాని పరిస్థితి. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ నిండు సభలో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకొని తెలంగాణవాదాన్ని దారుణంగా అవమానించాడు. ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నాక ఇడుపులపాయలో నిర్వహించిన పార్టీ ప్లీనరిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని చెప్పారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా పరకాల ఉప ఎన్నికలప్పుడు అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పారు. గతేడాది డిసెంబర్‌ 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ అదే విషయాన్ని చెప్పి, తెలంగాణ ఇస్తామంటే అడ్డుకునే శక్తిగాని, తెచ్చే శకిగాని తమకు లేదన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ జూలై 30న తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అంతకుముందే స్పష్టమైన సంకేతాలిచ్చింది. అయితే తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకోబోతుందని ముందే పసిగట్టిన వైఎస్సార్‌ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో ఉనికిని నిలుపుకునేందుకు జూలై 26నే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించింది. అలాగే తెలంగాణకు సానుకూలంగా ప్రకటించిన నిర్ణయంపై వెనక్కు మళ్లింది. బయటికి తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్తూనే తెరవెనుక చేయాల్సిన కుట్రలన్నీ చేసేసింది. పార్టీ తీరును నిరసిస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ నేతలంతా ఆ పార్టీని వీడారు. ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న ఏకైక తెలంగాణ ప్రాంత నేత బాజిరెడ్డి గోవర్దన్‌. గోవర్దన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు సైతం ఇంతకాలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తాము వ్యతిరేకం కాదని చెప్తూ వస్తున్నారు. అయితే ఆదివారం విజయమ్మ రాసిన లేఖతో ఆ పార్టీ ముసుగు తొలగిపోయింది. ఇంతకాలం తెలంగాణపై ఆ పార్టీ కప్పుకున్న ముసుగు వీడింది. సమైక్య రంగు బహిర్గతమైంది. వైఎస్సార్‌ కుటుంబం ఎప్పటికీ తెలంగాణకు అనుకూలం కాబోదని తేటతెల్లమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సీమాంధ్ర పక్షపాతం వహించిన వైఎస్‌ తరహాలోనే ఆయన కుటుంబం అక్కడికి మాత్రమే పరిమితమైపోయింది. వైఎస్సార్‌ సీపీకి హైదరాబాద్‌ కావాలి. తెలంగాణ ప్రాంత వనరులు కావాలి. హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఆదాయం కావాలి. తెలంగాణ ప్రాంత ప్రజలకు చెందాల్సిన ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, వనరులు కొళ్లగొట్టడం కావాలి. కాని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాత్రం వద్దు. తెలుగు ప్రజలు, సమన్యాయం అంటే సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలు, వారికి దక్కాల్సిన న్యాయం, అందుకోసం అమాయక తెలంగాణ ప్రజల గొంతులు కోయడం మాత్రమేనని విజయమ్మ తేటతెలుగు లేఖలో స్పష్టం చేశారు. మొదట్లో ఆ పార్టీతో అంటకాగి అసలు రంగు బయటపడ్డాక మొత్తం బంధాన్నే తెంపుకొని తెలంగాణ నేతలు బయటికి వచ్చారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్ష పక్షాన నిలిచారు. జగన్‌ పార్టీ తెలంగాణలో మొత్తం ఖాళీ అయి సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమయ్యాక కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను పాలించాలనే అభిలాషను వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లోపు విభజన ప్రక్రియ పూర్తికాకుంటే మొత్తం 10 జిల్లాల్లో ప్రాతినిథ్యం లేకున్నా సీమాంధ్ర ప్రాంతంలోని ఓట్లతో గద్దెనెక్కవచ్చనే దింపుడుకల్లం ఆశ వైసీపీది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ సీమాంధ్ర పక్షపాతం వహించడం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఆ పార్టీతో పట్టిన పీడ వదిలినట్లైంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణపై ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఇంతకాలం అవకాశవాద రాజకీయాలు చేశాడు. ఇప్పటికీ అదే ఫార్మూలాతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సిగ్గుమాలిన నేతలు బాబు సీమాంధ్ర పక్షపాతం వహించినా అదికాదు.. ఇది.. ఇదే నిజం.. తమ పార్టీని రెండు ప్రాంతాల్లో నష్టం చేయడానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబు తెలంగాణకు ఎప్పటికీ అనుకూలం కాదు. ఆయన పలుమార్లు దీనిని స్పష్టం చేశాడు. కానీ ఓట్లు సీట్లు అవసరమైనప్పుడు మాత్రం తెలంగాణకు జైకొట్టి లబ్ధిపొందాలనుకోవడం ఆయనకే తెలిసిన విద్య. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకబోవని తెలుసుకున్నాడు కాబోలు చేసిన బాసలన్నీ మరిచి మళ్లీ సీమాంధ్ర పక్షపాత జెండా ఎత్తుకున్నారు. రాష్ట్రంలోని పార్టీలు, ముఖ్యంగా టీడీపీ నిర్ణయాన్ని సాకుగా చూపి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పూనుకొని తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టారనేది బాబు వాదన. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అంతేకాలంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు విధాన పరమైన అంశాలపై అవగాహన లేని చిన్న పిల్లాడి మాదిరి మాట్లాడుతున్నాడు. వయసు పెరిగినా కొద్దీ హుందాగా వ్యవహరించాల్సింది పోయి తన చిల్లర ప్రవర్తనతో రోత పుట్టిస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ, అసలు తన విధానం ఏమిటో అర్థం కాకుండా చేస్తున్నాడు. విభజనతో తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది అంటే అర్థం ఏమిటో బాబే కాదు ఆయన పార్టీలోని ఒక్కరూ చెప్పరు. అంటే ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా ఉండాలనేది ఆయన వాదనా అంటే అదీ కాదంటారు. ఎక్కడి పాట అక్కడ పాడుతూ 2014 ఎన్నికలను దాటాలని టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. బాబు గోడమీది పిల్లివాటంతో  తప్పించుకుతిరిగే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బాబు ఆదివారం గుంటూరు జిల్లాలో యాత్ర ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా చిన్నపిల్లాడిని తలపిస్తున్నాయి. ఓట్లు వేయించుకోవాలంటే తెలంగాణకు వ్యతిరేకమని చెప్పి నేరుగా సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించుకోవచ్చు. కానీ అలా కాకుండా తెలంగాణ ప్రకటన ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కులెవరో హరించినట్లుగా కొంగజెపం చేస్తున్నాడు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో పోటీ స్పాన్సర్డ్‌ ఉద్యమాన్ని నడిపిస్తున్నవారిలో బాబు రెండో ప్రముఖుడు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలతో బాబు చలించిపోయి  యాత్రకు బయల్దేరాడు. మరి తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాల పాటు స్వరాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు బాబు ఎటుపోయాడు. ఈ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు వెయ్యి మందికి పైగా తెలంగాణ యువత ఆత్మ బలిదానాలకు పాల్పడ్డప్పుడు ఏం చేశాడు? తెలంగాణ ప్రాంతంలో సకలం బంద్‌ అయినప్పుడు ఎందుకు నోరు విప్పలేదు? అనే ప్రశ్నలకు ఆయన అడుగులకు మడుగులొత్తే తెలంగాణ ప్రాంత నేతలెవరూ సమాధానలు చెప్పరు. రాజధానితో కూడిన రాష్ట్రం విడిపోతుందంటూ కొత్త ఏడుపు అందుకున్న బాబుకు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు, టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు గుర్తులేదో? అఖిలపక్ష సమావేశంలో చెప్పినప్పుడు, శాసనసభలో ప్రైవేటు తీర్మానం పెడతానన్న విషయాన్ని ఎలా మరిచారో? బాబుకు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి. వారికి న్యాయంగా దక్కాల్సిన హక్కులన్నీ హరించి తన వారికి దోచిపెట్టడం కావాలి. వారి ఆకాంక్షలు మాత్రం పట్టవు. సీమాంధ్ర బాబు ఇక ఆటలు కట్టిపెట్టి అసలు తన వాదమేంటో తేల్చిచెప్పాలి. రాజధాని, నీళ్లు, నిధులే సమస్య అయితే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. సమైక్యతే తన విధానమైతే అది స్పష్టం చేసి తెలంగాణలో తన జెండా పీకేసీ పెట్టేబేడా సర్థుకొని సీమాంధ్రకు వెళ్లిపోవాలి.