మాట మార్చడంలో మడమ తిప్పడంలో వైకాపా దిట్టే


టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) :
తెలంగాణకు అభ్యంతరం లేదన్న వైకాపా ఇవాళ మాటమార్చి సమైక్యాంధ్ర నినాదం అందుకోవడం దారుణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు మలండిపడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా యాత్ర చేస్తున్న వైసీపీపై ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఓట్లు, సీట్ల కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందన్నారు. తెలంగాణలో ఓట్ల కోసం గాలం వేసిన పార్టీ వైసీపీ అని, ఇక్కడ లాభం లక  తెలంగాణలో వైసీపీ కనుమరుగైపోయిందని, ఇక  వైసీపీ మాడి మసికాక తప్పదన్నారు. అబద్ధాల పునాదుల విూద పుట్టిన  వైసీపీ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. వైసీపీకి కావాల్సింది పదవులు మాత్రమే వాటి కోసం ఏమైనా మాట్లాడుతారు. పదవి కోసం ఏమైనా చేస్తారు. ఎన్ని అబద్ధాలు ఆడుతారనడానికి ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకమనడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ఇడుపులపాయ ప్లీనరీ పరకాల ఉప ఎన్నిక, అంతకుముందు ఉప ఎన్నికల సందర్భంగా జగన్‌ చేసిన వ్యాక్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎప్పుడ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ వచ్చి ఇప్పుడు సీమాంధ్రలో ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని జగన్‌ చెప్పిన విషయం నిజంకాదా అని అన్నారు. వైఎస్‌ విజయలక్ష్మి పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణకు అనుకూలంగా ప్లీనరీలో తీర్మానించామని చెప్పలేదా? తెలంగాణపై కేంద్రం ఆలస్యం చేస్తుందని, తాము ప్లీనరీ తీర్మానానికే కట్టుబడి ఉన్నామని, త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని విజయమ్మ అనలేదా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతల విూదనే చెప్పులు వేయించిన చరిత్ర వైఎస్‌దని,  వైఎస్‌ ప్రోత్సాహంతోనే తెలంగాణ కోసం 41 మంది ఎమ్మెల్యేలు ఆనాడు ఢిల్లీ వెళ్లారన్న విసయం మరచి పోతే ఎలా అని హరీష్‌ ప్రశ్నించారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం అంటే తెలంగాణకు అనుకూలం అని కాదా?. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆనాడు వైఎస్‌ సభలో చెప్పలేదా?. వైఎస్‌ నుంచి జగన్‌ దాకా ఇంతకు ముందు తెలంగాణపై ఎవరేం మాట్లాడారో తమ దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ తమకు దక్కకపోతే భూకబ్జాలు చేయడానికి ఇబ్బందులు తలెత్తుతాయని వైసీపీ బాధపడుతుందన్నదే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. సీమాంధ్ర ప్రజల్లో అపోహాలు, అనుమానాలు సృష్టించడం సరికాదన్నారు. . జగన్‌ కడప ఎంపీగా ఉండి బెంగళూరులో నివసిస్తే ఎవరైనా ప్రశ్నించారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత మిమ్మల్ని ఎవరూ వెళ్లగొట్టరు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. జగన్‌ పార్టీ అవినీతి, అబద్దాల పునాదుల విూద పుట్టిందనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదని  ఆరోపించారు. విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందటం వారికి అలవాటే అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు రావని, ఉద్యోగాలు ఉండవని రెచ్చగొట్టడం సరికాదన్నారు. అసలు భయం వారికే ఉందన్నారు. వారి సొంత భయాన్ని ప్రజల భయంగా చెబుతున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే బయ్యారం గనులు దక్కవని, భూములు కొల్లగొట్టే అవకాశముండదని, జగన్‌కు కుర్చీ దక్కదనే భయం వారిలో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజల్లో అనుమానాలు, అపోహలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తోందన్నారు. దివంగత వైయస్‌ రాజశేఖర రెడ్డి చనిపోయే నాటి వరకు జగన్‌ కడప ఎంపీగా ఉండి బెంగళూరులో వ్యాపారం చేస్తే ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రం వస్తే మీ దోపిడీకి, మీ కుర్చీకి అవకాశముండదేమో కానీ, ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు. వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీని ఎప్పుడు ఎవరు నమ్మలేదన్నారు. జగన్‌ నిజ స్వరూపం బయటపడ్డాక అందులో చేరిన కొందరు కూడా ఇప్పుడు గుడ్‌ బై చెప్పారని, అదే చేతులతో పార్టీ గద్దెలు కూల్చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే, వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రజలను రెచ్చగొట్టవద్దన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, విజయమ్మ, వైఎస్‌ జగన్‌, షర్మిల.. ఇలా ఆ కుటుంబానికి చెందిన అందరు ఒక్కో సమయంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, ఇప్పుడు మాత్రం తాము మొదటి నుండి సమైక్యవాదులమే అని చెబుతున్నారని విమర్శించారు. కావాలనుకుంటే విూరు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సిడిలను పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్‌ పార్టీ మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాదని, మాట తప్పే, మడమ తిప్పే పార్టీ అన్నారు. జగన్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా పలు సందర్భాలలో మాట్లాడింది, అవి విూకు గుర్తుకు లేకుంటే వాటిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్‌ పార్టీకి అధికారమే లక్ష్యం, పదవే ప్రాణమని అన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ ఏం అవలంభిస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నామని, తాము తెలంగాణ ఇచ్చే ఆపే స్థితిలో లేమని, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని జగన్‌ పార్టీ చెప్పిందన్నారు. ఇప్పుడు నిర్ణయమొచ్చాక దీక్షలు, ధర్నాలు ఎందుకన్నారు. ప్లీనరీలో ఇచ్చిన హామీ, పరకాల ఉప ఎన్నికల్లో విజయమ్మ, షర్మిలలు చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయారా అన్నారు. చేతిలో మత గ్రంథం పట్టుకుంటున్నారని, అది పట్టుకొని కూడా అబద్దాలు ఆడితే ఎలా అని హరీశ్‌ ప్రశ్నించారు.