హైకోర్టులో హై టెన్షన్
నిబంధనలు ఉల్లంఘించి సీమాంధ్ర న్యాయవాదుల మానవహారం
తెలంగాణ న్యాయవాదులను రెచ్చగొట్టిన సీమాంధ్రులు
ప్రతిఘటించిన టి. అడ్వకేట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (జనంసాక్షి) :
హైకోర్టు ఆవరణలో హైటెన్షన్ నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించి సీమాంధ్ర న్యాయవాదులు కోర్టు ఆవరణలో మానవ హారం నిర్మించడమే కాకుండా తెలంగాణవాదులను రెచ్చగొట్టారు. దీంతో టి. అడ్వకేట్లు వారి చర్యలను ప్రతిఘటించారు. దీంతో పలువురు న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. శుక్రవారం ఉదయం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు హైకోర్టు ఆవరణలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఓవైపు తెలంగాణ లాయర్లు శాంతియుతంగా నిరసనలు నిర్వహిస్తుంటే, మరోవైపు, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రకు చెందిన న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలంగాణవాదుల వైపు సీమాంధ్ర లాయర్లు దూసుకొచ్చారు. దీంతో ఇరు ప్రాంత లాయర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది తోపులాటకు, ఘర్షణకు దారి తీయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోటాపోటీ నినాదాలతో హైకోర్టు దద్దరిల్లింది. సీమాంధ్ర న్యాయవాదులు తెలంగాణ వారిపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు ప్రాంతాల వారికి సర్దిచెప్పేందుకు యత్నించారు. హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని ఎవరూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని మైకుల్లో ప్రకటించారు. పోలీసుల ఆదేశాలను ఎవరూ పట్టించకోలేదు. ఒక్కసారిగా రెండు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు గుమిగూడడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని, అక్కడి నుంచి తరలించారు. మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్‌రెడ్డి సహా అనేక మంది తెలంగాణ న్యాయవాదులను సమీపంలోని పోలీసుస్టేషన్లకు తరలించారు. అయితే, పోలీసుల తీరుపై తెలంగాణ న్యాయవాదులు మండిపడ్డారు. తమపై దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమను అరెస్టు చేయడమేమిటని నిలదీశారు. తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని, అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. సీమాంధ్ర న్యాయవాదులు ర్యాలీల పేరుతో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రజల మధ్య విద్యేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం చీఫ్ జస్టిస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీమాంధ్రకు చెందిన న్యాయవాదులు తమపై దౌర్జన్యంగా దాడి చేశారని తెలిపారు. ఇంతవరకూ హైకోర్టుకు రాని సీమాంద్ర లాయర్లు ఇప్పుడు కోట్లు వేసుకొని వచ్చి దాడి చేశారని పేర్కొన్నారు. కేసుల విషయంలో కోర్టుకు వచ్చిన టీ-లాయర్లను అడ్డుకున్నారని, పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. మహిళా లాయర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశించారు. మదీనా సెంటర్ నుంచి సిటీ కాలేజ్‌వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. కాగా, చీఫ్ జస్టిస్‌తో నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. హైకోర్టులో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను, అందుకు దారి తీసిన కారణాలను వివరించారు. అంతకుముందు ఆయన హైకోర్టు ప్రాంగణంలో నెలకొన్న పరిస్థితులపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.