తెలంగాణ ప్రక్రియలో బీజేపీ కలిసి రావాలి
జాప్యంతో ఇరు ప్రాంతాల్లో వైషమ్యాలు పెరుగుతాయి
భాజపాను కోరిన టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, సెప్టెంబరు 11 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ విషయంలో నిర్ణీత కాల పరిమితిని నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భారతీయ జనతా పార్టీని టీ జేఏసీ కోరింది. సత్వరమే రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు చేసేందుకు కేం ద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని కూడా టీజేఏసీ సూ చించింది. టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ బృందం బీజేపీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ కమి టీ చైర్మన్ టి.రాజేశ్వరరావు, కో-చైర్మన్ సి. అశోక్ కుమార్ తదితరులతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఇరు బృందాల మధ్య అరగంటకు పైగా చర్చలు కొ నసాగాయి. అనంతరం కోదండరామ్, శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలు హైదరాబా ద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కట్టుబడి ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీజేపీని కోరామన్నారు. కేబినెట్‌లో ఆమోదం తెలపడం పార్లమెంటులో బిల్లు పెట్టడం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం తదితర విషయాలపై కాలపరిమితి నిర్ణయించాలని కేంద్రాన్ని కోరాలని చెప్పామన్నారు. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు లేదా శీతాకాల సమావేశాల్లో మొదటి బిల్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఏమాత్రం జాప్యం జరిగినా ఇరు ప్రాంతాల్లో వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 14న జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, తరలిరావాలని బీజేపీని కోరామన్నారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ, అజెండా రూపొందించుకోనున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీఎన్జీవోల సభలో కొందరు ఉద్యోగులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల్లో ఆవేదన, ఉద్రేకాలు రేకెత్తాయన్నారు. ఆ విషయాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేశామని అన్నారు.