యూటీ లీకులు దేనికి?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబోతున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ మీడియాకు లీకులిస్తోంది. ఆ లీకుల ఆధారంగా పీటీఐ ఇచ్చిన వార్తా కథనం తెలంగాణ ప్రాంతంలో ప్రకంపనలకు దారితీసింది. ఇంతకాలం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి తీరుతామని ప్రకటించిన కేంద్ర హోం శాఖ ఇప్పుడు ఎందుకు యూటీ పేరిట లీకులిస్తోందో అర్థంకాని ప్రశ్న. సీమాంధ్ర ప్రాంత ప్రజల పేరుతో దోపిడీదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్రం కనుక యూటీ ప్రతిపాదనకు అంగీకరిస్తే దానికి ప్రతిఫలం అనుభవించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్‌లేని తెలంగాణను అంగీకరించడానికి ఇక్కడి ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. ఆ విషయం యూపీఏ ప్రభుత్వం తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా స్పష్టం చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు సానుకూల నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో వచ్చిన ప్రతిస్పందనలేమిటో అందరికీ తెలిసినవే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను సీమాంధ్ర ప్రాంత ప్రజలెవరూ పట్టించుకోకపోగా హైదరాబాద్‌ను, తెలంగాణ వనరులను దోచి కుభేరుల అవతారం ఎత్తిన బడా పారిశ్రామిక వేత్తలు, నేతలు ఆ 13 జిల్లాల్లో డబ్బు సంచులు కుమ్మరించి స్పాన్సర్డ్ ఉద్యమానికి తెరలేపారు. ఈ విషయమూ కేంద్రానికి ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేశాయి. మొదట జిల్లా, నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమైన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నెల రోజులు దాటిన తర్వాత కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లలేకపోయారు. గ్రామ స్థాయిల్లో ఉద్యమం జరుగుతున్నట్లు ఎక్కడా నమోదు కావడం లేదు కూడా. సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోని మీడియా తెలంగాణ ఏర్పాటు తర్వాత సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కులు హరించి వేయబడుతాయని, కేంద్రం నిర్ణయం తర్వాత హైదరాబాద్ మనది కాకుండా పోతుందని ఎంతగా విష ప్రచారం చేసినా అక్కడి ప్రజల నుంచి రావాల్సినంతగా స్పందన రాలేదు. అయినా చూపింది చూపిస్తూ ఇదిగో ఉద్యమ హోరు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట తెలుగుజాతి, తెలుగుతల్లి విచ్ఛిన్నం కావొద్దని, విడిపోవద్దని అన్న సీమాంధ్రులు ఇప్పుడు తమకు దక్కని హైదరాబాద్ తెలంగాణకు కూడా దక్కొద్దని దుష్ట పన్నాగం పన్నుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి సీమాంధ్రులు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్తున్నది పుక్కిటి పురాణం. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరం. అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, చెన్నైల తర్వాత స్థానం హైదరాబాద్‌దే. ఇప్పుడా హైదరాబాద్ అభివృద్ధిలో ఏ స్థానంలో ఉందో అభివృద్ధి చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్న వారే చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి పేరిట సాంస్కృతిక విధంసానికి పాల్పడిన వారు, హైదరాబాద్ ప్రజలకు దక్కాల్సిన భూములు, వనరులను అప్పనంగా కొళ్లగొట్టిన వారు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నది తమ దోపిడీని కొనసాగించుకోవడానికే. హైదరాబాద్ చారిత్రక, వారసత్వ చిహ్నాలను విధ్వంసం చేసిన శక్తులు నగర అభివృద్ధిపై కారుకూతలు కూస్తుంటే హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొందరు సైతం వెనక యూటీ పాటపాడటం చారిత్రక తప్పిదం. అది వారు ఇప్పటికిప్పుడు గుర్తించకపోయినా వారి డిమాండ్ వల్ల అనుకోనిది జరిగితే అందుకు బాధ్యత వహించక తప్పదు. వట్టి చేతులతో హైదరాబాద్‌కు వలస వచ్చి కుభేరులుగా మారిన సీమాంధ్రులు హైదరాబాద్ తమదని భ్రమించడం.. అడ్డదారిన హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందిన వారిని అలా భ్రమింపజేయడం.. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అనేక రాజకీయ కుట్రలు.. హైదరాబాద్‌ను గ్రేటర్ పేరిట పరుగులు పెట్టించడం ఇప్పుడు యూటీ ప్రతిపాదనకు ప్రధాన అస్త్రాలుగా మారాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పది జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న విషయాన్ని మన దేశమే కాదు అంతర్జాతీయ సమాజం సైతం గుర్తించింది. తెలంగాణ డిమాండ్‌లో న్యాయముందని ఒప్పుకుంది. తెలంగాణ ప్రజల రక్తమాంసాలు దారపోసి నిర్మించుకున్న హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. అలాంటి హైదరాబాద్‌కు ఆరు దశాబ్దాల క్రితం బతకాడానికి వచ్చిన వారు ఇప్పుడు హక్కుల కోసం కేంద్ర పాలిత ప్రాంత చేయమంటే అందుకు కేంద్రం సానుకూలంగా ఉంటే దానికి తగిన ప్రతిఘటన కూడా చవిచూడాల్సి ఉంటుంది. ఇంకో విషయం తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రతిపాదించిన పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఇక్కడి ప్రజలకు ఆమోదయోగ్యం. ఆ ప్రతిపాదన నుంచి ఏమాత్రం వెనక్కు వెళ్లినా అప్పుడు ప్రజ్వరిల్లే మహోద్యమాన్ని ఊహించుకోవడం కష్టం. తెలంగాణ ఏర్పడకుండా సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు చేస్తున్న కుటిల యత్నాలకు మనస్తాపం చెంది ఇక్కడి యువత, విద్యార్థులు వెయ్యి మందికిపైగా ఆత్మబలిదానాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యూటీ పేరుతో కేంద్రం ఇస్తున్న లీకులు ఈ ప్రాంత విద్యార్థులు, యువత మనోస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మళ్లీ ఇక్కడ ఆత్మబలిదానాలు మొదలు కావొచ్చు. పరిస్థితి అంతదాక వెళ్తే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే హైదరాబాద్‌ను యూటీగా చేయడానికి పార్లమెంట్‌లో 2/3 మెజార్టీ అవసరం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుపై ఇది వరకే తీర్మానం చేసిన బీజేపీ ఈ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశమే లేదు. అలాంటప్పుడు పార్లమెంట్‌లో ఆ తీర్మానం వీగడం ఖాయం. గెలిచే అవకాశం లేని ప్రతిపాదనను సభ ముందుకు తీసుకువచ్చే ధైర్యం కేంద్రం చేస్తుందా? లేక ఇంకేదైనా ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చిందా అనే విషయం తెలియకున్నా ప్రాతిపదిక లేని హైదరాబాద్ యూటీ ప్రతిపాదనపై ప్రతిఘటన మాత్రం తప్పదు. యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజా ఉద్యమం బలమెంతో తెలుసు. పాలపొంగులాంటి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలమైన తెలంగాణ ఆకాంక్షతో ముడిపెట్ట చూస్తే అందుకు తగిన మూల్యం చెల్లించడానికి కాంగ్రెస్ సిద్ధపడాలి.