సమైక్యాంధ్రుల దురాక్రమణ తెలంగాణవాదుల సంయమనం
తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టుబట్టి జరిపించిన ఏపీఎన్‌జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సమైక్యాంధ్రులు దురాక్రమణ, దుర్మార్గాలు, దాష్టీకానికి, తెలంగాణవాదుల సంయమనానికి ప్రతీకగా నిలిచింది. సమైక్యంగా ఉందామంటూనే తెలంగాణవాదులను కడతేర్చడానికి సీమాంధ్ర గుండాలు చేసిన దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచింది. సీఎం సీమాంధ్ర దురహంకారానికి, సీమాంధ్రుల దోపిడీ, దివాళకోరు విధానాలకు సాక్షిభూతమైంది. తెలంగాణ ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలో ఎల్‌బీ స్టేడియం, దాని సమీపంలోని ఘటనలు తేల్చిచెప్పాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నూటికి నూరుపాళ్లు నిజమైనదని తేటతెల్లమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్యపక్షాలు సానుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రుల కుట్ర రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రజలు విడిపోతాం మొర్రో అంటుంటే లేదు కలిసి ఉండాలని పట్టుపడుతున్నాయి. సమైక్య రాష్ట్రం కోరుకునే వారు ఎందుకు కలిసి ఉండాలో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజనకు దారితీసిన పరిస్థితులు ఏమిటో గుర్తించి వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలి. తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పి, తెలంగాణ ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ప్రజలను ఒప్పించి సమైక్యాంధ్ర కోసమని సభ నిర్వహిస్తే అర్థముంది కానీ గొంతులు కోస్తాం.. నరికేస్తాం.. చంపేస్తామంటూ సమైక్యాంధ్ర సభ అంటే అది సమైక్యమెలా అవుతుంది. సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులకు తెలంగాణ ఏర్పాటు వల్ల తలెత్తే ఇబ్బందులేమిటో చెప్పి వాటి పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని కోరడంలో అర్థముంది కానీ హైదరాబాద్ వేదికగా సభ పెట్టి ఆ వేదికపై నుంచి అనేక అబద్ధాలు చెప్పి సమైక్యంగా ఉండాలని కోరడంలో ఏమైనా అర్థం ఉందా? ఆ సభలో జై తెలంగాణ అని నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై మూకుమ్మడి దాడి చేసిన వారు తెలుగువారంతా కలిసి ఉండాలని చెప్పడం వంచన కాకుండా ఏమవుతుంది. సమైక్యాంధ్ర సభకు వచ్చిన గుండా ఉద్యోగి చుట్టూ పోలీసులను పెట్టుకొని నిజాం కాలేజీ విద్యార్థుల వైపు చూస్తూ గొంతులు కోస్తామని హెచ్చరించడమా కలిసి ఉందామని చెప్పడం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బాలరాజును చావబదడమా తెలుగుజాతి అంతా ఒక్కటే అని చెప్పడం. జై తెలంగాణ అన్నవారిపై దాడి చేసి సమైక్యాంధ్ర కోరడంలో ఏమైనా అర్థం ఉందా? సభకు అనుమతించిన పోలీసులు నిజాం కాలేజీలో హాస్టల్‌లోకి ప్రవేశించి టిఫిన్ చేస్తున్న విద్యార్థులపై ప్రదర్శించిన దమనకాండ సభ్య సమాజాన్ని సిగ్గుతో తలవంచుకునేలా చేస్తుంది. పోలీసులు ఓ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి కిందికి నెట్టివేశారంటే వారు ఎంతగా సహనం కోల్పోయి ప్రవర్తించారో.. ఎవరి ఆదేశాల మేరకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారో స్పష్టమవుతోంది. హైదరాబాద్‌లో నిబంధనల మేరకు ప్రజాస్వామికంగా సభ పెట్టుకుంటామన్న ఏపీఎన్‌జీవోలు ఒక్క నిబంధననూ పాటించలేదు. ఎన్‌జీవోలు కాని గజల్ శ్రీనివాస్, మిత్ర, సీమాంధ్ర మీడియా ప్రతినిధులను వేదికపైకి పిలిచి కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారు. వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు చట్టం తన చుట్టమన్నట్టూ ప్రవర్తించాడు. సీఐ స్థాయి అధికారి గజల్ శ్రీనివాస్‌ను సభలోకి వెళ్లకుండా అడ్డుకుంటే పీఎస్సార్ జోక్యం చేసుకొని ఆయన్ను తోడ్కొని వెళ్లారు. ఇక ఉద్యోగులు కాని వారెందరో స్టేడియంలోకి ప్రవేశించారు. వారంతా ఎలా సభలోకి వచ్చారో.. ఐడీ కార్డులు లేకున్నా వారిని ఎలా లోపలికి అనుమతించారో పోలీసులే చెప్పాలి. హైదరాబాద్ నడిగడ్డపై సీమాంధ్రులకు సమైక్యాంధ్ర సభ జరుపుకోవడానికి అనుమతినిచ్చిన సీఎం, అంతా తామై దాన్ని ముందుకు నడిపిన డీజీపీ దినేశ్‌రెడ్డి, హైదారాబాద్ సీపీ సభ సందర్భంగా సీమాంధ్రులు ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించారు. సమైక్యాంధ్ర కోరుకునే ఏపీఎన్‌జీవోలు తెలంగాణవాదంపై, తెలంగాణవాదులపై తమ ప్రసంగాల్లో విషం చిమ్మారు. సమైక్య రాష్ట్రం ఎందుకవసరమో, తెలంగాణ అనివార్యమైన పరిస్థితుల్లో తమ అభ్యంతరాలేంటో చెప్పాల్సిందిపోయి తెలుగువారంతా కలిసుండాలనే పిడివాదాన్ని పట్టుకువేలాడారు. ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడే కాదు వక్తలందరూ తెలంగాణపై దుమ్మెత్తిపోశారు. వేదిక వెనుక కట్టుకున్న బ్యానర్‌లోనే సమైక్య అనే పదాన్ని సరిగా రాసుకోలేని తెలుగువాళ్లు సమైక్యాంధ్రను కోరుకోవడం నిజంగా దురదృష్టకరం. జనగనమన కూడా సరిగ్గా పాడలేని వారు తెలుగుజాతి పేరుతో తెలంగాణ వారిని దోచుకోవడానికి హైదరాబాద్ వేదిక కుట్రలకు పాల్పడటం కంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకోవడంలో సీమాంధ్రులకేదో ఉప్ప మనసు ఉందనుకోవడానికి అవకాశం లేదు. వారి దృష్టంతా హైదరాబాద్ పైనే. వీలైతే తెలంగాణను మొత్తంగా దోచుకోవాలి. లేదంటే హైదరాబాద్‌లో తమ దోపిడీ కొనసాగడానికి ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి. అందులో భాగంగానే సీఎం కిరణ్ ఏపీఎన్‌జీవోల సభకు అన్నితానై నడిపించాడు. హైదరాబాద్‌ను దోచుకోవడానికి పన్నిన కుట్రలను నిరసిస్తూ తెలంగాణ ప్రజలు శాంతియుతంగా తెలంగాణ బంద్ పాటించారు. సీమాంధ్రులు ఎంతగా కవ్వించినా ఏమాత్రం రెచ్చిపోకుండా సంయమనంతో వ్యవహరించారు. రేపటి తెలంగాణను సవ్యంగా సాధించుకునేందుకు తమ వంతు పాత్ర పోషించారు. కోర్టు ఉత్తర్వులను ఏపీఎన్‌జీవోలు, పోలీసులు యథేచ్ఛగా ఉల్లంఘించారు. సభ నిర్వహణలోనే విభజన వాదం ప్రదర్శించారు. కేవలం సీమాంధ్ర మీడియాకు మాత్రమే అనుమతి ఇచ్చి తమ కుత్సిత బుద్ధిని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండగానే సీమాంధ్రులు మానసికంగా విభజనకు సన్నద్ధమయ్యారు. ఇంతకుమించి తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వేరే అవసరమే లేదు. పీకలు కోస్తామనే వారితో, మనుషులను చావబాదే వారితో ఎందుకు కలిసుండాలి. తెలంగాణ ఏర్పాటుకు ఇంతకంటే ఏం కావాలి. అందుకే తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా మా రాష్ట్రం మాకు కావాలని కోరుతున్నారు. ఇందుకోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. కానీ ఎన్నడూ సీమాంధ్రుల్లా పట్టుతప్పి ప్రవర్తించలేదు. ఇలాంటి వారితో ఇంకా కలిసి ఉండలేం. విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు సర్దుకుపోవడం తప్ప.