హైదరాబాద్ కోసమే కుట్రలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సమయంలో హైదరాబాద్ వేదికగా సీమాంధ్రులు నిర్వహించిన సభ వారి కుట్ర రాజకీయాలకు తార్కాణంగా నిలిచింది. ఏపీఎన్‌జీవోల పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్గనిర్దేశనంలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ శేవ్ తెలంగాణకు తామెంత సిద్ధంగా ఉన్నామో వారితో చెప్పించింది. తెలుగుజాతి, తెలుగుతల్లి, తెలుగువారి ఐక్యత పేరుతో ఇంతకాలం సీమాంధ్రుల ఏడ్చిన ఏడుపంతా హైదరాబాద్‌ను ఇంకా ఎక్కువ కాలం దోచుకోవడానికేనని స్పష్టమైంది. తెలంగాణను ఇంతకాలం దోచుకున్నాం.. ఇంకా సంపూర్ణంగా దోచుకోవడానికి కేంద్రం అడ్డుపడింది కాబట్టి కనీసం హైదరాబాద్‌నైనా దక్కించుకొని దండుకోవాలనే వారి దురాశకు వేదికగా నిలిచింది ఏపీఎన్‌జీవోల సభ. వారు సమైక్య రాష్ట్రం కోసమంటూ, సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సభ నిర్వహించినప్పటికీ విభజనకు వారు సిద్ధపడ్డట్లుగా స్పష్టమైంది. ఎలాగూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేం కాబట్టి తమది కాని హైదరాబాద్‌ను తెలంగాణకూ దక్కకుండా చేయాలనే వారి కుట్ర బట్టభయలైంది. సీమాంధ్రులెవరూ తెలంగాణ వారితో కలిసి ఉండాలని అనుకోవడం లేదని తేటతెల్లమైంది. వాళ్లు ఇప్పుడే కాదు ఎప్పుడూ తెలంగాణ ప్రజలతో కలిసి ఉండాలని అనుకోలేదు. ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భౌతికంగా సీమాంధ్ర, తెలంగాణతో జతపడి ఉన్నా ఆధిపత్యమంతా వారిదే సాగింది. నాలుగున్నర దశాబ్దాల సీమాంధ్రుల పాలనలో తెలంగాణ అన్నింటా వంచనకు గురైంది. తెలుగు భాషను సాకుగా చూపి ఏర్పాటు చేసిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అంతటా అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత వలస పక్షుల్లా హైదరాబాద్‌లో వాలిన సీమాంధ్రులు ఇక్కడే అతుక్కుపోయారు. తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొళ్లగొట్టి ఇప్పుడు సంపన్నులు, కుభేరులయ్యారు. వారంతా హైదరాబాద్‌కు వట్టి చేతులతో వచ్చిన వారే. తెలంగాణను నిలువునా దోచిన వారే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుతగులుతున్నారు. తెలంగాణను దోచిన డబ్బులు తెలంగాణను అడ్డుకోవడానికి వెదజల్లుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ జిల్లాల్లోని అపార ఖనిజ సంపదను, వనరులను కొళ్లగొట్టి ఇంకా ఇంకా సంపాదించుకోవాలనే దురాశ వారిది. ఆ దురాశతోనే తెలంగాణ ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు. తామెన్ని కుయుక్తులు పన్నినా యూపీఏ ప్రభుత్వం ససేమిరా అనడంతో కనీసం హైదరాబాద్‌నైనా తెలంగాణకు కాకుండా చేయాలని కుట్రలకు తెరతీశారు. ఆ కుట్రలను ఏపీఎన్‌జీవోల సభ సందర్భంగా బహిర్గతం చేశారు. సభకు నిరసన తెలిపిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత బలరాజును విచక్షణా రహితంగా కొట్టి హత్యకు యత్నించారు. సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సహచరులు, సీమాంధ్ర గుండాలు కలిసి కొట్టారు. అంతకుముందే జై తెలంగాణ అన్న మరొకరిపై కుర్చీలతో దాడి చేసి రక్తం కళ్ల జూశారు. కలిసి ఉండేందుకని సభ పెట్టిన వారు అందుకు విభేదించే వారితో చర్చకు సిద్ధపడాలి. కలిసి ఉండటం ఎందుకు వారికి నచ్చజెప్పాలి. కలిసి ఉండటం ద్వారా ఏం ప్రయోజనాలున్నాయో వివరించాలి. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో అవి ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో, అందుకు బాధ్యులెవరో చెప్పి, ఇకపై అలా జరుగకుండా చట్టభద్దమైన మార్గాలను ముందుంచి ప్రజలకు నచ్చజెప్పాలి. అవేవి చేయకుండా జై తెలంగాణ అనడమే పాపమన్నట్లుగా వీధి గుండాల్లా తెలంగాణవాదులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి ఇచ్చిన డీజీపీ దినేశ్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ అంతకుముందు విధించిన 19 ఆంక్షలను ఏపీఎన్‌జీవోలు ఉల్లంఘించినా పెద్దగా స్పందించలేదు. ఉద్యోగేతరులను ఎందుకు ఆహ్వానించారో చెప్పాలంటూ ఏవో నోటీస్‌లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ సభ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు ముఖ్యంగా డీజీపీ వైఖరి తెలంగాణ ప్రజలను తీవ్రంగా గాయపర్చింది. నిజాం కళాశాల హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా చొరబడిన పోలీసులు టిఫిన్ చేస్తున్న విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. లాఠీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఓ విద్యార్థిని మేడపై నుంచి కిందకు తోసేశారు. నడుముకు గాయాలైన అతడిని ఈడ్చి డీసీఎం వ్యాన్‌లో పడేశారే తప్ప ఆస్పత్రికి తరలించలేదు. సీమాంధ్రులు మూకుమ్మడిగా దాడి చేసిన బాలరాజు పరిస్థితి అదే. తెలంగాణ ఎమ్మెల్యేల జోక్యం తర్వాత గాని వారిని ఆస్పత్రికి తరలించని కర్కశత్వం పోలీసులది. అదే సీమాంధ్రలో విధ్వంసం జరుగుతున్నా కళ్లప్పగించి చూసిన పోలీసులు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్‌లో తెలంగాణవాదులపై దాడులకు తెగబడుతున్నారు. సీమాంధ్రలో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం పాటిస్తున్నారు. తెలంగాణ డిమాండ్‌కు పోలీసులు చూపుతున్న వివక్ష కూడా కారణం. తెలంగాణవారిపై ఉక్కు పాదం మోపే పోలీసులు అదే సీమాంధ్రులు ఎంత భరితెగించినా చేష్టలుడిగి చూడటం మినహా ఏమీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంతర్భాగంగా ఉన్న తెలంగాణ వారితో కలిసి ఉందామంటూ సభ పెట్టిన వారు జై తెలంగాణ అన్న వారిపై దాడి చేయించడం సీమాంధ్ర దురంహకారానికి నిదర్శనం కాదా? తెలంగాణ ప్రజలను అక్కున చేర్చుకోలేని వారు, సమానంగా చూడలేని వారు, తెలంగాణ భాషను, యాసను అవమానించిన వారు బలవంతంగా కలిసుందామని కోరడంలో అర్థం లేదు. తాము వచ్చే తెలంగాణ ప్రజలకు నాగరికత నేర్పామని, వ్యవసాయం నేర్పామని, ఇంకా ఏవేవో చెప్పామనే దురంహకారపు మాటలు కట్టిపెట్టి తెలంగాణ ఏర్పాటు ద్వారా తమకేం కావాలి కేంద్రాన్ని అడిగి సాధించుకోవాలి. తెలంగాణలో ఉన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీమాంధ్ర ప్రాంతంలోనూ ఏర్పాటు చేయించుకోవాలి. అన్ని సౌకర్యాలతో కూడిన రాజధాని నిర్మించాలని కోరాలి. అంతేగాని హైదరాబాద్ కావాలని కోరడం వారి దోపిడీ విధానాలకు సంకేతం. తెలంగాణ ఏర్పాటు ఖాయమైన సమయంలో హైదరాబాద్‌ను దక్కించుకోవాలనే కుట్రలతో ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతతకు భంగం వాటిల్లేలా చేయడం వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక్కు వెళ్తుందేమోనని చూడటం దుర్మార్గమైన చర్య. హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేయాలనే కుట్రలకు దీటైన జవాబు చెప్పడానికి తెలంగాణ పౌర సమాజం సిద్ధంగా ఉంది. పరిస్థితి అంతవరకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది. అందుకు ఉపక్రమించి ఉద్రిక్తల నివారణకు ప్రయత్నించాలి.